AP Politics : చంద్రబాబుకు అప్పుడు జేపీ గండం… ఇప్పుడు జేడీ గండం!

నాడు జేపీ, చిరంజీవి చంద్రబాబును అధికారంలోకి దూరం చేస్తే.. నేడు జేడీ ఆ పనిచేయబోతున్నారు. చంద్రబాబును అధికారంలోకి రాకుండా ఈ కాపు నేతలు ప్రతీసారి అడ్డుపడుతూనే ఉన్నారన్న చర్చ సాగుతోంది.

Written By: NARESH, Updated On : December 23, 2023 9:27 pm
Follow us on

AP Politics : అప్పుడు జేపీ, ప్రజారాజ్యం ఓట్లు చీల్చుకోవడంతో బాబుకి అధికారం పోయింది…ఇప్పుడు జేడీ రూపంలో మరోసారి అదే రిపీట్ అవుతుందా.? ఈసారి ఎలాగైనా గెలవాలి.. గెలిచి తీరాలి అని చంద్రబాబు పొత్తులు పెట్టుకొని మరీ యజ్ఞాలు యాగాలు మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ ను ఒప్పించి మెప్పించి.. బీజేపీని దారిలోకి తెప్పించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత చేసినా ఏపీ రాజకీయంలో చంద్రబాబును కొన్ని పరిణామాలు భయపెడుతున్నాయి.

గెలుపు ముంగిట ఓ పరిణామం జరగడం.. చంద్రబాబు ఓడిపోవడం ప్రతీసారి కామన్ గా జరుగుతోంది. 2009 ఎన్నికల్లో ఇలాగే బలమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ను ఓడించేందుకు చంద్రబాబు అన్ని పార్టీలను కూటమి కట్టాడు. నాటి టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో మహాకూటమి పెట్టారు. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే చంద్రబాబు గెలిచేవారు. కానీ ఇక్కడే కాపులు ఆ పార్టీలు దెబ్బకొట్టాయి.

నాడు కాపు ఓటు బ్యాంకు టార్గెట్ ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి.. నీతిమంత రాజకీయాలు అంటూ పోటీచేసిన లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ఏకంగా చంద్రబాబు అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు. ప్రజారాజ్యం దాదాపు 16.32 శాతం ఓట్లతో.. ఇక లోక్ సత్తా కొన్ని నియోజకవర్గాల్లో చాలా ఓట్లను చీల్చి గెలవాల్సిన చంద్రబాబును ఓడించారు. 2009లో కాంగ్రెస్ గెలుపునకు, చంద్రబాబు టీడీపీ ఓటమికి మధ్య ప్రజారాజ్యం, జేపీ లోక్ సత్తా కీలకంగా మారింది. ఓ రకంగా నాడు జేపీ పోటీచేయకుండా చంద్రబాబుకు మద్దతు ఇచ్చినా గెలిచేవాడు. చిరంజీవి కూడా ఒంటరిగా పోకుండా వెళితే కాపు ఓటు బ్యాంకు చంద్రబాబకు చేరి ఈజీగా గెలిచేవాడు.2009లో అలా జరిగితే ఇప్పుడు 2023లోనూ అదే చంద్రబాబును భయపెడుతోంది.

ఈసారి కాపు ఓటు బ్యాంకు చీలకుండా జనసేనను కలుపుకొని బాబు ముందుకెళుతున్నారు. అయితే మెజార్టీ కాపులు పవన్ ను నమ్ముతారా? ఆయన వెంట నడుస్తారా? అన్నది డౌట్ గా ఉంది. ఇక బీజేపీ ప్రభావం పెద్దగా లేకున్నా.. ఇప్పుడు కొత్త పార్టీ ఖచ్చితంగా బాబును భయపెడుతోంది.

జై భరత్ అంటూ జేడీ లక్ష్మీనారాయణ ఏపీలో కొత్త పార్టీ పెట్టారు. స్వయంగా కాపు అయిన ఈయనకు సమాజంలో మంచి పేరు ఉంది. నిజాయితీగల నేతగా పేరుంది. అదే ఆయనకు క్రేజ్ ను ఫేంను తీసుకొచ్చింది. ఇప్పుడు పార్టీ పెడితే ఖచ్చితంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు కాపులు మద్దతు తెలుపుతారు. మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అండగా నిలుస్తారు. అదే జరిగితే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు జేడీ చీల్చితే చంద్రబాబుకు నష్టం. ఆయనకు పడాల్సిన ఓట్లు జేడీ పార్టీకి వెళతాయి. అంతిమంగా వైసీపీ గెలుపునకే జేడీ దోహదపడుతారు.

జేడీ వెనుక జగన్ ఉన్నాడా? లేడా అన్నది అప్రస్తుతం.. జేడీ పోటీ వల్ల దెబ్బ పడేది టీడీపీ, జనసేనకే అన్నది వాస్తవం. అందుకే జేడీ పోటీతో మరోసారి చంద్రబాబుకు అధికారం దూరం అవుతుందా? అన్న చర్చ సాగుతోంది.

నాడు జేపీ, చిరంజీవి చంద్రబాబును అధికారంలోకి దూరం చేస్తే.. నేడు జేడీ ఆ పనిచేయబోతున్నారు. చంద్రబాబును అధికారంలోకి రాకుండా ఈ కాపు నేతలు ప్రతీసారి అడ్డుపడుతూనే ఉన్నారన్న చర్చ సాగుతోంది.