Pawan Kalyan: ఓవైపు అన్న చిరంజీవి టాలీవుడ్ సమస్యలు తీర్చేందుకు ఏపీ సర్కార్ తో సంధికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు అదే జగన్ తో కయ్యానికి తమ్ముడు, జనసేనాని పవన్ కళ్యాణ్ కాలుదువ్వుతున్నాడు. వైసీపీపై పోరాటానికి జనసైనికులను కార్యోన్ముఖులను చేస్తున్నాడు. ఈ క్రమంలోనే జనసేన ఆవిర్భావ సభను భారీగా ప్లాన్ చేస్తున్నారు.

టీడీపీ హయాంలో కూడా జనసేన ఆవిర్భావ సభను ఎన్నికల ఏడాదిలో ఘనంగా నిర్వహించిన పవన్ ఆ సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడి తన శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాడు. టీటీడీలో ఆ సమయంలో బయటపడ్డ శేఖర్ రెడ్డిలాంటి వాళ్లు లోకేష్ బినామీలు అంటూ ఆరోపణలు చేసి రాష్ట్రాన్ని షేక్ చేశాడు. జనసేన గెలవదని తెలిసినా కూడా నాడు టీడీపీ ఓటమిలో పవన్ కళ్యాణ్ ఇలా పాలుపంచుకున్నాడు. ఎన్నికలయ్యే వరకూ కూడా టీడీపీపై పోరాటాన్ని పవన్ కొనసాగించాడు. దీంతో టీడీపీ ఓటమిలో తను కూడా భాగస్వామి అయ్యాడు.
ఈసారి వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ టార్గెట్ చేశారు. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే సమరం ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఆవిర్భావ సభను మంగళగిరిలో అత్యంత భారీగా నిర్వహించాలని పవన్ నిర్ణయించారు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గకపోవడం ఇక ఆంక్షల్లాంటివేమీ ఉండే అవకాశం లేకపోవడంతో ‘కాజ’ ప్రాంతంలో పెద్ద ఎత్తున సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే స్థలాన్ని కూడా ఖరారు చేశారు.
మార్చి 14వ తేదీన పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్లాన్ చేశారు. మరో నెలరోజుల సమయం ఉంది. ఈ లోపు ఆ సభ నుంచి జనసేన రోజువారీ వ్యవహారాల్లో అత్యంత కీలకంగా ఉంటుందని తేల్చే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ కూడా అప్పటి నుంచి ఎక్కువగా ప్రజల్లో ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా మరో రెండేళ్లకు పూర్తి స్థాయిలో ఎన్నికలు వస్తాయి.. ఇప్పటికే ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. దీంతో ఆవిర్భావం నుంచి జనసేన వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. ఇక రెండేళ్లు తీవ్రంగా కొట్లాడి ఏపీలో అధికారం కోసం కీలక పాత్ర పోషించాలని పవన్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.