Nagababu : జనసేనలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయా? మన వేలే మన కన్ను పొడుస్తోందన్న నాగబాబు ట్విట్ దేనికి సంకేతం? అంతర్గతంగా ఏదైన సమస్య నెలకొందా? లేకుంటే జనసేన శ్రేణులను అలెర్ట్ చేసేందుకే అలా చేశారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది. ఇటీవల జనసేనలో నాగబాబు యాక్టివ్ అయ్యారు. పార్టీ శ్రేణులతో వర్చువల్ సమావేశాలు నిర్వహించారు. సోషల్ మీడియాలో పార్టీ విధానాలు చెప్పే క్రమంలో కొన్నిరకాల జాగ్రత్తలను సూచించారు. సలహాలు, సూచనలు అందించారు. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. క్షేత్రస్థాయిలో జిల్లాల పర్యటనకు సన్నద్ధమవుతున్నారు. దీంతో జనసేనలో ఒక రకమైన ఫీల్ ఏర్పడుతోంది. ఎన్నికల మూడ్ లోకి వచ్చినట్టేనని టాక్ వినిపిస్తోంది.
అదనపు బలమే..
ప్రస్తుతం పవన్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. రాజకీయాల కోసం తాను సినిమాల్లో తప్పక నటించాల్సిన పరిస్థితి అని చాలా సందర్భాల్లో పవన్ చెప్పుకొచ్చారు. పవన్ ఫుల్ టైమ్ రాజకీయాలు చేయకపోవడం పార్టీ శ్రేణులు కూడా బాధపడుతున్నాయి. అధినేత పరిస్థితిని తెలుసుకొని సర్దిచెప్పుకుంటున్నాయి. అయితే ఆ లోటును పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ తీర్చుతూ వచ్చారు. ఎక్కడా హంగూ ఆర్భాటం లేకుండా జిల్లాల్లో పర్యటించారు. పార్టీ శ్రేణులకు నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు అందించేవారు. అయితే ఇప్పుడు నాగబాబు తోడుకావడంతో జనసేనకు అదనపు బలమే. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ముందే సంకేతాలు ఇచ్చిన నాగబాబు ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలకు దిగడంతో జనసేన వర్గాల్లో జోష్ నెలకొంది.
జిల్లాల పర్యటన
నాగబాబు జిల్లాల పర్యటనకు దిగుతున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. ఇందుకు ఉత్తరాంధ్రను ముహూర్తంగా నిర్ణయించారు. ముందుగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎలమంచిలి నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనకాపల్లి నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. జనసేన వర్గాలు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రెగ్యులర్ గా నాగబాబు పర్యటించే చాన్స్ కనిపిస్తోంది.
ఈ నెలే కీలకం..
రాజకీయంగా ఈ నెలే కీలకంగా భావిస్తున్నారు. అటు టీడీపీ సైతం పొత్తులపై మహానాడు వేదికగా స్పష్టమైన ప్రకటన చేయనుంది. అధికారికంగా పొత్తుల కోసం ప్రస్తావించనుంది, అదే సమయంలో నాగబాబు సైతం జనసేన వర్గాల అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇంతలో పెండింగ్ సినిమాలు పూర్తిచేసి పవన్ సైతం ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టనున్నారు. వారాహి యాత్ర చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన చేపట్టబోయే కార్యక్రమాలతో పాటు వారాహి యాత్రకు సంబంధించి టూర్ షెడ్యూల్ పై జనసేన హైకమాండ్ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే మెగా బ్రదర్ నాగబాబు ఎంటర్ కావడంతో జనసేన వర్గాలు తెగ ఆనందపడుతున్నాయి.