Homeజాతీయ వార్తలుJagan- Delhi Ordinance: కేంద్రం, ఢిల్లీ సర్కార్‌ ఆర్డినెన్స్‌ వార్‌.. ఈ ఫైట్‌ లో కీలకంగా...

Jagan- Delhi Ordinance: కేంద్రం, ఢిల్లీ సర్కార్‌ ఆర్డినెన్స్‌ వార్‌.. ఈ ఫైట్‌ లో కీలకంగా జగన్, నవీన్.. అవినాష్ అరెస్ట్ వేళ ఉత్కంఠ

Jagan- Delhi Ordinance: ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సారధ్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ కేంద్రంపై పోరాటాన్ని తీవ్రతరం చేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆప్‌ సర్కాన్‌ ఓ పోలీస్‌ అధికారిని బదిలీ చేసింది. దీంతో స్పందించిన కేంద్రం.. ఆప్‌సర్కార్‌ చర్యలకు చెక్‌పెట్టేలా ఆర్డినెన్స్‌ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగడుతోంది ఆప్‌ సర్కార్‌. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను లాక్కుంటూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌పై పోరును జాతి పోరాటంగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అభివర్ణించారు.

నేషనల్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ అథారిటీ దిశగా..
అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల కోసం కేంద్రం నేషనల్‌ క్యాపిటల్‌ సివిల్‌ సర్వీస్‌ అథారిటీ ఏర్పాటు దిశగా ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను ఢిల్లీ ప్రభుత్వంతోపాటు బీజేపీ యేతర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో కేజ్రీవాల్‌ ఆ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఇది విపక్షాలకు అగ్నిపరీక్ష సమయమని దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడాలనుకునే పార్టీలు ముందుకు రావాలని ఆప్‌ పిలుపు ఇచ్చింది.

విపక్షాల మద్దతు కోసం..
ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కత్తిరిస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను టీఎంసీ కూడా వ్యతిరేకించింది. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తోందని దుయ్యబట్టింది. మరోవైపు తమ బిల్లులన్నీ రాజ్‌భవన్‌లో మగ్గుతున్నాయని తమిళనాడు సీఎం చెబుతున్నారని, ఇది కేవలం తమ పోరాటమే కాదని ఇది దేశవ్యాప్త పోరాటమని స్పష్టం చేశారు. ఢిల్లీ పోలీసులు మనీష్‌ సిపోడియాను ఎలా ట్రీట్‌ చేశారో మీరంతా చూశారని అన్నారు. ఢిల్లీలో బ్యూరోక్రాట్‌ల పోస్టింగ్, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.

ఆర్డినెన్స్‌.. చట్టమైతే..
మరోవైపు కేంద్రం ఈ ఆర్డినెన్స్‌కు చట్ట రూపం తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన కేజ్రీవాల్‌ ఆర్డినెన్స్‌పై పార్లమెంట్‌లో బిల్లు పెడితే వ్యతిరేకించేలా విపక్షాలను కూడగట్టే పనిలో పడ్డారు. లోక్‌సభలో బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉన్నందున బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. రాజ్యసభలో బలం తక్కువగా ఉన్నందున బిల్లు వీగిపోయేలా కేజ్రీవాల్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

రంగంలోని బీజేపీ పెద్దలు..
బిల్లు పార్లమెంట్‌లో ఎలా ఆమోదింపజేయాలనే విషయంలో బీజేపీ పెద్దలు రంగంలోకి దిగారు. రాజ్యసభలో బలం ఎంత.. ఎవరి మద్దతు తీసుకుంటే బిల్లు ఆమోదం పొందుతుంది.. ఎంతమంది ఎంపీల మద్దతు అవసరం అనే వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో తటస్థ పార్టీలవైపు కమలనాథులు చూస్తున్నారు.

కలిసొచ్చే కాలానిని నడిసొచ్చే బిల్లు..
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, ఒడిశాలో అధికారంలో ఉన్న బీజూజనతాదళ్‌ మద్దతుతో బిల్లు ఆమోదం పొందాలని కేంద్రం భావిస్తోంది. కలిసి వచ్చే కాలానికి, నడిచి వచ్చే కొడుకు అన్నట్లుగా.. ఎంపీ అవినాష్‌రెడ్డిని మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసునుంచి ఎలా తప్పించాలా అని చూస్తున్న వైసీపీని కేంద్రమే సాయం అడిగే పరిస్థితి వచ్చింది. దీంతో ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని అవినాష్‌రెడ్డిని తప్పించేలా చూడాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. ఇందుకు ప్రతిగా కేంద్రం పెట్టే బిల్లుకు వైసీపీ రాజ్యసభలో మద్దతు ఇవ్వాలని భావిస్తోంది. మొత్తంగా తాజా రాజకీయ పరిణామాలు అటు ఢిల్లీలో, ఇటు ఏపీలో ఆసక్తి రేపుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version