IT industry : బాబుకు క్రెడిట్ ఇస్తావా? జగన్ ఇది చేస్తావా?

ఎన్నికలకు ఆరు నెలల వ్యవధి మాత్రమే ఉంది. ఐటీ కంపెనీలు ప్రస్తుతం తరలి వస్తే మాత్రం.. దాని ఫలితం అనుభవించేది మాత్రం తర్వాత వచ్చే ప్రభుత్వమే.

Written By: NARESH, Updated On : September 6, 2023 7:44 pm
Follow us on

IT industry : కొవిడ్ తరువాత ఐటీ ఉద్యోగాల్లో మార్పు వచ్చింది. వర్క్ ఫ్రం హోం సంస్కృతితో ఐటీ సంస్థలు గణనీయంగా ఖర్చును తగ్గించుకున్నాయి. అటు సంస్థలకు ఖర్చు తగ్గటమే కాకుండా.. ఉద్యోగులు సొంత గ్రామాల్లోనే ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ తరుణంలోనే ఐటీ సంస్థలు ఒక ఆలోచనను పదునుపెట్టాయి. సెకండరీ గ్రేడ్ నగరాల్లో ఐటీ సంస్థలు ఎందుకు ఏర్పాటు చేయకూడదు? అని ఆలోచిస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదులో మాత్రమే ఐటీ ఉద్యోగాలు ఎక్కువగా కల్పించబడుతున్నాయి. ఏపీకి సంబంధించి ఎంతోకొంత విశాఖలో ఐటీ సంస్థలు ఏర్పటవుతున్నాయి. కానీ ఆశించిన స్థాయిలో ఎంప్లాయిమెంట్ దక్కడం లేదు. ఇటువంటి తరుణంలో ఐటీ సంస్థలు తీసుకున్న నిర్ణయం.. ఏపీ పాలిట స్వర్గధామం గా నిలవనుంది. ఏపీకి సంబంధించి విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో ఐటి అభివృద్ధికి అవకాశం ఉంది. ఆయా సంస్థలు ఆసక్తి చూపుతున్నందున.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితే మన రాష్ట్రం కూడా ఐటీ పరంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచుకునే ఛాన్స్ ఉంది.

వైసిపి ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు తరలిపోతున్నాయి అన్న అపవాదు ఉంది. దానిని అధిగమించాలంటే ఐటీ సంస్థలను ఆహ్వానించి చేయూతనందించాల్సిన అవసరం ఉంది. స్వల్ప కాలంలోనే ఐటీ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. వీలైనంత త్వరగా జగన్ సర్కార్ స్పందిస్తే.. పదుల సంఖ్యలో ఐటీ సంస్థలు ఏపీకి తరలివచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ఐటీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఏపీకి రావడానికి ఆసక్తి చూపుతున్న సంస్థలను సైతం ఆహ్వానిస్తే.. వేలాది మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్నికలకు ఆరు నెలల వ్యవధి మాత్రమే ఉంది. ఐటీ కంపెనీలు ప్రస్తుతం తరలి వస్తే మాత్రం.. దాని ఫలితం అనుభవించేది మాత్రం తర్వాత వచ్చే ప్రభుత్వమే. గతంలో చంద్రబాబు హయాంలో జరిగింది కూడా అదే. హైటెక్ సిటీని అంతకు ముందున్న ప్రభుత్వాలు ప్రారంభించాయి. దానిని చంద్రబాబు పూర్తి చేయడంతో.. ఆ క్రెడిట్ అంతా ఆయనకే లభించింది. ఇప్పుడు ఏపీలో ఐటీ సంస్థల పరిస్థితి కూడా అదే. ఇప్పుడు గానీ ఐటీ సంస్థల ఏర్పాటు ప్రారంభం జరిగితే.. ఆ క్రెడిట్ మాత్రం 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ లెక్కన జగన్ ఆ క్రెడిట్ దక్కించుకుంటారా? లేక చంద్రబాబుదా? అన్నది తేలాల్సి ఉంది.