Israel Palestine Conflict: ఇజ్రాయోల్‌–పాలస్తీనా వివాదం : యూదా రాజ్యం అరబ్బుల పాలస్తీనాగా ఎలా మారింది?

క్రీస్తుపూర్వం 586 లో బాబిలోనియన్ల దాడి తర్వాత చాలామంది యూదులు తమ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ హేరోదు అనే బలమైన రాజు రావడంతో ఈ ప్రాంతానికి తిరిగి వచ్చారు.

Written By: Raj Shekar, Updated On : October 17, 2023 3:45 pm

Israel Palestine Conflict

Follow us on

Israel Palestine Conflict: ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై తన దాడిని కొనసాగిస్తోంది. ఇప్పటికే 5 వేల మందికిపైగా మరణించారు. భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. యుద్ధం ప్రారంభంలో ఇజ్రాయోల్‌కు అండగా నిలిచిన దేశాలు ఇప్పుడు ఇజ్రాయోల్‌ తీరును తప్పు పడుతున్నాయి. తీవ్ర ప్రాణనష్టం జరుగుతున్నా ఇజ్రాయోల్‌ సేనలు నిబంధనలకు విరుద్ధంగా హమాస్‌పై దాడులు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయోల్‌–పాలస్తీనా వివాదంలో మరో కీలక అంశం గురించి తెలుసుకుందాం..

యూదుల ప్రాంతంలో అరబ్బులు..
క్రీస్తుపూర్వం 586 లో బాబిలోనియన్ల దాడి తర్వాత చాలామంది యూదులు తమ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ హేరోదు అనే బలమైన రాజు రావడంతో ఈ ప్రాంతానికి తిరిగి వచ్చారు. క్రీస్తు పూర్వం 20 సంవత్సరంలో హేరోదు పాలనా కాలంలో మళ్లీ జెరూసలేంలో టెంపుల్‌ నిర్మించుకున్నారు. దీన్ని సెకండ్‌ టెంపుల్‌ ఆఫ్‌ జెరుసలెం అని పిలుస్తారు. అయితే సుమారు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమన్లు వీరిపై దాడి చేశారు. చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనలలో ఒకటి అయిన ఈ యూదా రోమన్ల యుద్ధంలో రోమన్లు గెలిచారు. ఈ యూదా రోమన్ల యుద్ధం తర్వాత యూదులు మళ్లీ ఈ ప్రాంతం నుంచి∙చెల్లాచెదరు అయిపోయారు. అంతేకాకుండా జెరూసలేంలో వీరు నిర్మించుకున్న సెకండ్‌ టెంపుల్‌ కూడా రోమన్ల దాడి లో ధ్వంసం అయింది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ప్రారంభమైన ఇస్లాం మతం 7వ శతాబ్దానికల్లా ఈ ప్రాంతంలో ఒక బలీయమైన మతంగా అవిర్భవించింది. రోమన్ల సామ్రాజ్యం తర్వాత ఈ ప్రాంతం క్రీస్తు శకం 7వ శతాబ్దం సమయంలో ఇస్లాం పాలకులు అయిన కాలిఫ్‌ల చేతిలోకి వచ్చింది. ఆ తర్వాత 16వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన రాజ్యం అయిన ఓట్టమన్‌ సామ్రాజ్యం కిందకు వచ్చింది. ఒకానొక సమయంలో మూడు ఖండాలలో వ్యాపించిన ఈ సామ్రాజ్యం ఇజ్రాయోల్‌ పాలస్తీనా ప్రాంతాన్ని మొదటి ప్రపంచ యుద్ధం వరకు పరిపాలించింది. బాబిలోనియన్లు, రోమన్లు మరియు ఇస్లాం పాలకుల దాడి కారణంగా 70% యూదులు తమ ప్రాంతం నుంచి వేరు వేరు దేశాలకు వలస వెళ్లిపోగా 30% వరకు మాత్రమే ఈ ప్రాంతంలో మిగిలిపోయారు.

మొదటి నుంచి యూదుల ఆధీనంలో..
ప్రాచీన కాలం నుంచి యూదుల ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతం క్రీస్తు శకం ఏడవ శతాబ్దం తర్వాత ఇస్లాం పాలకుల చేతిలోకి రావడం, తర్వాత కాలంలో ఈ ప్రాంతంలోని యూదులు ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడంతో ఈ ప్రాంతం ముస్లిం జనాభా ప్రధానంగా ఉన్న పాలస్తీనా అవతరించింది. పాలస్తీనా అన్న పదం అప్పట్లోని ఫిలిష్తీయుల కారణంగా వచ్చింది. ఫిలిష్తి అన్న పదానికి వలసవాదులు, చొరబాటుదారులు అన్న అర్థం ఉందని చెబుతారు. అదేవిధంగా ఇజ్రాయోల్‌ అన్న పదం అబ్రహాము మనవడైన యాకోబుకి ఉన్న మరొక పేరు అని, దీనికి దేవుని చూసిన వాడు అన్న అర్థం ఉందని చెబుతారు.

యూదుల టెంపుల్స్‌తో వివాదం..
యూదుల టెంపుల్స్‌ మరియు అల్‌ అక్సా మసీదులు ఈ ప్రాంత చరిత్రకే కాకుండా ప్రస్తుత ఇజ్రాయేల్‌ – పాలస్తీనా వివాదానికి కూడా ఒక రకంగా కేంద్ర బిందువులు. యూదుల మొదటి టెంపుల్‌ని సోలమన్‌ రాజు క్రీ.పూ. 957 లో అప్పటి రాజధాని అయిన జెరుసలేం లో నిర్మించాడు. ఇది యూదులకి పవిత్ర ప్రదేశంగా ఉండేది. దీనిని క్రీ.పూ. 586 లో బాబిలోనియన్‌ రాజ్యం వారు ఈ రాజ్యం పై దండెత్తినపుడు ధ్వంసం చేశారు. తర్వాత మళ్లీ హేరోదు అనే ఒక బలమైన రాజు తిరిగి యూదా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత క్రీ.పూ. 20లో రెండవ టెంపుల్‌ని అదే జెరుసలేం ప్రాంతంలో నిర్మించాడు. అయితే క్రీ.శ. 70 లో రోమన్లు వీరిపై దాడి చేసినపుడు దీన్ని ధ్వంసం చేశారు. ఈ సెకండ్‌ టెంపుల్‌ శిథిలాల్లో ఒక గోడ మాత్రం మిగిలిపోయింది. ఇప్పుడు యూదులు ఈ గోడ వద్దే గుమికూడి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ చిన్న గోడ యూదులకి అత్యంత పవిత్రమైనది.

ఇస్లాం పాలకుల చేతిలోకి..
ప్రాచీన కాలంలో యూదుల రాజ్యంగా ఉన్న ఈ ప్రాంతం క్రీస్తుశకం 7 వ శతాబ్దంలో ఇస్లాం పాలకుల చేతిలోకి రాగా, గతంలో యూదుల టెంపుల్‌ ప్రాంతంలో ఇస్లాం పాలకులు అల్‌ అక్సా అన్న మసీదుని నిర్మించుకున్నారు. మక్కా, మదీనా తర్వాత ముస్లింలకు మూడో అతి పవిత్రమైన మసీదు ఇది. మహమ్మద్‌ ప్రవక్త చివరి రోజుల్లో ఈ మసీదు నుండే స్వర్గానికి వెళ్లిపోయాడని ముస్లిం పవిత్ర గ్రంధాలు చెబుతున్నాయి. దీంతో ముస్లింలు, యూదుల మధ్య అప్పుడప్పుడు ఇక్కడ చెలరేగే మతపర ఉద్రిక్తతలకు ఇది కూడా ఒక కారణం.