Chandrababu: వ్రతం చెడ్డా.. ఫలితం దక్కాలంటారు.కానీ చంద్రబాబుకు అది దక్కడం లేదట.. ఆది నుంచి అనేక దీక్షలు చేస్తున్నా చంద్రబాబు కు సరిపడా మైలేజ్ రావడం లేదన్నది వాస్తవం. ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోసారి దీక్ష తో ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించారు. పలు చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడం, ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్ మాఫియాను నియంత్రించాలని.. కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరుతూ అధికార పక్షాన్ని డిఫెన్స్ లో పడేసే ప్లాన్ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న ఉదయం 36 గంటల ధర్మ దీక్షను చంద్రబాబు ప్రారంభించారు.

చంద్రబాబు ఇంతకుముందు కూడా ఇలాంటి దీక్షలను నిర్వహించారు. ఈ సంవత్సరం జూన్ లో కూడా అమరావతి సాధన దీక్షలో కూర్చుకున్నారు. కోవిడ్-19 నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ వారి కష్టాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టారు. ఇక రాష్ట్రంలో జగన్ హామీనిచ్చిన 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని పోలవరం నిర్వాసితులకు చంద్రన్న బీమాకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక గతంలోనూ బాబు గారు భారీ దీక్ష చేపట్టారు. 2019 నవంబర్ లో ఇసుక కొరతకు నిరసనగా ఆయన మరో దీక్షను చేపట్టారు. సెప్టెంబర్ 2018లో ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం 2014లో ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేశారు.
విభజన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ , అవశేష రాష్ట్రాలలో చంద్రబాబు చేసినన్ని దీక్షలను దేశంలో మరే రాజకీయ నాయకుడు చేయలేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంత కష్టపడి నిరసన ప్రదర్శనలు చేసినప్పటికీ చంద్రబాబు డిమాండ్లు మాత్రం నెరవేరలేదు. కావాల్సినంత రాజకీయ మైలేజ్ పొందలేకపోయాడు. ఎలాంటి స్పష్టమైన ఫలితాలు ఇప్పటికీ దక్కలేదు. ఈ దీక్షల వల్ల ప్రయోజనం ఏంటనేది ఇప్పటికీ అంతుబట్టడం లేదు. వ్రతం చెడ్డా ఫలితం మాత్రం దక్కలేదంటారు. ఉపావాసాలతో చంద్రబాబు ఒళ్లు హూనం అయినా కూడా ఆయనకు సరిపడా మైలేజ్ రాలేదంటారు.
ఏదైనా విషయంపై అసమ్మతిని వ్యక్తం చేయడం.. సమాజంలోని ప్రజలను చైతన్యం చేయడం రివాజు. కానీ మెజార్టీ ప్రజల ప్రయోజనాలు కలిగేలా నిరసన వ్యక్తం చేస్తే దానికి ప్రజాదరణ దక్కుతుంది. ప్రజల కోసం ప్రజల ద్వారా వారి కష్టాలపై చేస్తే వారి ఆదరణ ఉంటుంది. కానీ చంద్రబాబు చేసేది వ్యక్తిగత దీక్ష. తన పార్టీ నేతలు, కార్యాలయాలపై చేసిన దాడులకు నిరసనగా చేస్తున్న దీక్ష
అందుకే చంద్రబాబు దీక్షలకు పెద్దగా స్పందన రావడం లేదని అర్థమవుతోంది. నేతల హడావుడి తప్పితే ప్రజల భాగస్వామ్యం తక్కువగా ఉందని అంటున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రయోజనాల కోసం చంద్రబాబు దీక్షలు చేస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొన్నటికి చంద్రబాబు దీక్ష వద్ద ఉన్న జనాలు ఇప్పుడు లేరు. ప్రతీరోజు మద్దతుదారుల సంఖ్య తగ్గుతూనే ఉంది. తన దీక్షల ద్వారా సమాజంలో సమర్థవంతమైన మార్పును తీసుకువచ్చే ఏదో ఒక ఉపాయాన్ని చంద్రబాబు ప్లాన్ చేస్తే మంచిదని పలువురు హితవు పలుకుతున్నారు.