
ABN RK- TDP: అదరం..బెదరం.. వెన్నుచూపం.. తాము ఎవరి పల్లకి మోయం..మాది దమ్మున్న చానల్.. ప్రజాహితమే మా అభిమతం.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ చెప్పే మాటలివి. కానీ చేసేవి మాత్రం అందుకు విరుద్ధం. ముద్రణ రంగంలో అడుగుపెట్టిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకు పాలకులాడారు. ఈ క్రమంలో తానూ అమాంతం ఎదిగారే తప్ప.. టీడీపీకి మాత్రం ఆశించిన స్థాయిలో లాభం చేయలేకపోయారు. టీడీపీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ సైతం ఇదే అభిప్రాయంతో ఉంటారు. టీడీపీ గెలిస్తే తన మార్కు..ఓడిపోతే మాత్రం చంద్రబాబు నా మాట వినలేదు.. నేను ముందే చెప్పానంటూ వక్రభాష్యాలు, కాలమ్ లతో నింపేస్తుంటారు. అయితే ఒకే విషయాన్ని పదేపదే చెప్పడం ద్వారా విసుగు పుడుతుంది. తరువాత అసంతృప్తికి దారితీస్తుంది. ఇప్పుడు ఆర్కే తన వీకెండ్ కామెంట్ లో సైతం పదేపదే జగన్ వ్యతిరేక వైఖరిని కనబరచడం ఏమంత శ్రేయస్కరం కాదు. అటు తాను ఆశిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీకి ఏ ప్రయోజనం కూడా రాదు.
ఎప్పుడూ జగన్ వ్యతిరేక వైఖరే…
ఇటీవల తన వీకెండ్ కామెంట్స్ లో జగన్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజలు ముష్ఠి ఎత్తుకోవాల్సి ఉంటుందని ఆర్కే హెచ్చరించారు. బటన్ నొక్కడం ద్వారా ఏపీని అప్పుల ఊబిలో కూరుకుపెడుతున్నారన్నది ఆర్కే విశ్లేషణ, ప్రధాన ఆరోపణ. సంక్షేమ పథకాల మాటున రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. సంక్షేమం రాష్ట్రానికి ఏమంత ప్రయోజనం కూడా కాదని చెబుతున్నారు. వాస్తవమే అయినా జగన్ అమలుచేస్తున్న పథకాలను చంద్రబాబు కొనసాగిస్తున్నామని ప్రకటించారు. అటు లోకేష్ తన పాదయాత్రలో సైతం ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. అంటే టీడీపీ అధికారంలోకి వచ్చినా ఈ సంక్షేమ పథకాలు, బటన్ నొక్కుడు కొనసాగుతాయన్న మాట. అటువంటప్పుడు చంద్రబాబు, లోకేష్ ల విషయం ప్రస్తావించవచ్చు కదా. కానీ ఆయన ప్రస్తావించడం లేదు. పైగా ప్రజలు ముష్ఠి ఎత్తుకుంటారన్న హెచ్చరికలు.
పవన్ ను చిన్నచూపు చూసేలా..
అటు పవన్ విషయంలో కూడా ఆర్కే రాతలు భిన్నంగా ఉంటాయి. టీడీపీకి అవసరమైనప్పుడు పవన్ ను ఆకాశానికెత్తేస్తారు. అవసరం వద్దనుకున్నప్పడు మాత్రం రోత రాతలు ప్రారంభమవుతాయి. కొద్దిరోజుల కిందట ఆర్కే తన కొత్త పలుకులో పవన్ కు కేసీఆర్ రూ.1000 కోట్లు ఆఫర్ చేసినట్టు రాసుకొచ్చారు. టీడీపీతో కాకుండా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే పెద్ద మొత్తంలో ఆర్థిక ప్యాకేజీ అందిస్తారన్నది ఈ కథనం సారాంశం. దీనిపై ఇంటా బయటా ఆర్కే విమర్శలు ఎదుర్కొన్నారు. అటు బీఆర్ఎస్, ఇటు జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో రియాక్టయ్యాయి. మెగా బ్రదర్ నాగబాబు సైతం ఘాటుగా రియాక్టయ్యారు. దానిపై సంజాయిషి ఇచ్చుకునే క్రమంలో తాను కేసీఆర్ ఆఫర్ చేసిన విషయాన్ని మాత్రమే రాశానని.. పవన్ అమ్ముడుపోయినట్టు రాయలేదని వక్రభాష్యం చెప్పారు. ఇటీవల రాజ్దీప్ సర్దేశాయ్ కేసీఆర్ ఎన్నికల ఖర్చు భారీగా పెట్టడానికి సిద్ధమయ్యారని.. కలిసే వచ్చే పార్టీలకు ఎన్నికల ఖర్చు ఆఫర్ చేశారని పవన్ విషయం ప్రస్తావించారు. దీంతో తాను చెప్పిందే నిజమంటూ కొత్తగా వాదించడం మొదలు పెట్టారు. రాజ్దీప్ సర్దేశాయ్ కేవలం ఎన్నికల ఖర్చు గురించి ప్రస్తావించగా.. ఆర్కే మాత్రం రూ.1000 కోట్లు ఆఫర్ చేసినట్టు రాసుకొచ్చారు.

చంద్రబాబు కట్టడి చేయకుంటే…
ఏపీలో ఎల్లో మీడియా తీరే వేరు. తన ప్రసారాలకు, కథనాలకు, వార్తలకు పరామార్ధం ఒక్కటే. అదే తెలుగుదేశం విశాల ప్రయోజనాలు. వాటి కోసం ఈ మీడియా ఎంతకైనా తెగిస్తుంది. మరీ ముఖ్యంగా ఏబీఎన్ ఆర్కే రాతలు రోత పుట్టిస్తాయి. ఎదుటి వారిని మానసికంగా హింసిస్తాయి. తెలుగునాట ఎల్లో మీడియా బారిన పడి ఎంతో మంది మూల్యం చెల్లించుకున్నారు. వారికి కేవలం టీడీపీ అధికారంలో ఉండాలి… తాము డెవలప్ కావాలి. తమ సామాజికవర్గం హవా నడవాలి. అటువంటి ఆకాంక్షతోనే గడుపుతుంటారు. ప్రత్యర్థులపై విషయం చిమ్మే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఆర్కేఇటువంటి రాతలతో తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు. వారికి సంబంధం లేకపోయినా.. వారే తనతో రాయిస్తున్నట్టు అర్ధం వచ్చేలా వ్యవహరిస్తుంటారు. మున్ముందు ఆర్కేను చంద్రబాబు నిలువరించకపోతే టీడీపీని కబళించినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.