
KTR- PM Modi: దోస్తులకు లాభం చేయాలని దేశ ప్రధాని నరేంద్రమోదీ జాతికి నష్టం చేస్తున్నారని బీఆర్‌ఎస వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాక మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. తన మిత్రుడు అదానీ కోసమే విశాఖ ఉక్కు పరిశ్రమను నష్టాల్లోకి నెట్టారని, ప్రైవేటీకరణ చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నష్టాలను జాతికి, లాభాలను దోస్తులకు పంచడమే మోదీ విధానమని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిలా గనులను అదానీ దోచుకోకుండా అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు.
బయ్యారానికి వీలుకాదని చెప్పి.. ముంద్రాకు..
తెలంగాణకు పొరుగునే ఉన్న ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని బైలదిలా గనులపై అదానీ, కేంద్రంలోని పెద్దల కన్ను పడిందని, అందుకే 160 కి.మీ. దూరంలోని బయ్యారానికి ఐరన్ ఓర్ ఇచ్చేందుకు వీలుకాదని చెప్పి.. కానీ 1,800 కి.మీ. దూరంలోని ముంద్రా(గుజరాత్) తరలించేందుకు మాత్రం సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వరంగంలోని నవరత్నాలను.. మోదీ తన ఇద్దరి ఇష్టరత్నాలకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నాని పేర్కొన్నారు. నష్టాలను సాకుగా చూపి చౌకగా దోస్తులకు విక్రయించడమే ఆయన విధానమని తెలిపారు. బైలదిలా గనులు బయ్యారం, విశాఖకు సమీపంలో ఉన్నాయని తెలిపారు. బైలదిలా 1.34 బిలియన్ టన్నుల ఐరన్ ఓర్ లభించే గనులని. ఆ గనులు అదానీ చేతుల్లోకి వెళ్తే విశాఖ ఉక్కుకు, తెలంగాణకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.
ఏపీ వైఖరి కాదు.. కేంద్రం ఏం చేస్తుంది..?
బైలదిలా స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాలంటే విశాఖ స్టీల్‌ప్లాంట్ అవసరమన్నారు కేటీఆర్. అందుకే విశాఖ ఉక్కు కర్మాగారం బిడ్డింగ్‌లో పాల్గొనే అంశంపై అధ్యయనానికి బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ బృందం నివేదిక ఆధారంగా బిడ్డింగ్‌లో పాల్గొనడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజకీయాల కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నామనే ఆరోపణలను ఖండించారు. ప్రభుత్వ రంగ సంస్థల సంరక్షణ విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై తమకు ఆసక్తి లేదని, కేంద్రం ఏం చేస్తుందన్నదనేతే ముఖ్యమని స్పష్టం చేశారు.

ఆ పరిశ్రమలు తెరిపిస్తాం..
తెలంగాణ పరిశ్రమలు తెరవలేని సీఎం స్టీల్‌ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారని విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు. నిజాం చక్కెర పరిశ్రమను పునరుద్ధరించేందుకు, సిర్పూర్ పేపర్ మిల్లును మళ్లీ తెరిపించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రైతులు ఒక సహకార సంఘంగా ఏర్పడి నడిపించేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాటిని విక్రయిస్తే ఉద్యోగులు నష్టపోతారని, యువతకు ఉద్యోగాలు లేకుండా పోతాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాలపై మోదీ కుట్రను ఎండగడతామని స్పష్టం చేశారు.