Pawan Kalyan Volunteers Controversy: వలంటీర్లపై పవన్ కళ్యాణ్ స్టెప్ కరెక్టేనా?

వలంటీరు వ్యవస్థపై ఆది నుంచి అనుమానాలున్నాయి. కొన్నిచోట్ల వారి వ్యవహార శైలిపై అభ్యంతరాలున్నాయి. కానీ ఏంచేయలేని నిస్సహాయత.

Written By: Dharma, Updated On : July 11, 2023 12:02 pm

Pawan Kalyan Volunteers Controversy

Follow us on

Pawan Kalyan Volunteers Controversy: నాలుగేళ్లుగా పనిచేస్తున్న వలంటీర్లపై ఇప్పడు చర్చ జరుగుతుండడం విశేషం. అధికారంలోకి వచ్చిన తరువాత సమాంతర రాజకీయ వ్యవస్థను జగన్ ఏర్పాటుచేసుకున్నారు. ప్రతీ 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి పౌరసేవల వరకూ బాధ్యతలను వారికి అప్పగించారు. సొంత పార్టీ ప్రజాప్రతినిధులను సైతం నిమిత్తమాత్రులుగా మార్చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుండడంతో అదో పవర్ ఫుల్ వ్యవస్థగా మారిపోయింది. అందుకే వ్యవస్థను ప్రశ్నించడానికి ప్రతిఒక్కరూ భయపడుతున్నారు. ఇటువంటి సమయంలో ఈ తేనె తుట్టను పవన్ కదిలించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియాలో భాగమయ్యారంటూ పవన్ చేసిన ఆరోపణలు సంచలనాత్మకంగా మారాయి.

అయితే ఇందులో వాస్తవాలు ఎంతవరకు అన్నది పక్కనపెడితే… రాష్ట్ర వ్యాప్తంగా వలంటీరు వ్యవస్థపై చర్చకు పవన్ కారణమయ్యారు. అసలు వలంటీరు ఎవరు? వారి విధులు ఏమిటి? ప్రజల వ్యక్తిగత డేటా వారి వద్ద ఎందుకు ఉంటోంది? ఇవన్నీ ప్రజల్లో చర్చకు వస్తున్నాయి. వలంటీర్లు పాల్పడిన నేర ఘటనలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. వాటికి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పవన్ ఒక వ్యూహంతోనే వలంటీరు వ్యవస్థపై వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

వలంటీరు వ్యవస్థపై ఆది నుంచి అనుమానాలున్నాయి. కొన్నిచోట్ల వారి వ్యవహార శైలిపై అభ్యంతరాలున్నాయి. కానీ ఏంచేయలేని నిస్సహాయత. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుండడం, వారి చేతిలోనే సంక్షేమ పథకాలు, పౌరసేవలు పెట్టడం, అన్నింటికీ మించి వ్యక్తిగత గోప్యత సమాచారం వారి వద్దే ఉండడంతో ప్రజల్లో ఒక రకమైన భయం నెలకొంది. ఆయన వలంటీరే కానీ సాధరణ వ్యక్తే. కానీ వ్యవస్థగా మారడం, అదే వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రజలను తమ గుప్పెట్లో పెట్టుకోవడంతో అధికార వ్యవస్థకు మించినదిగా మారిపోయింది.

వైసీపీ రాజకీయ అవసరాలకు పెట్టుకున్న వలంటీరు వ్యవస్థపై అధికార పార్టీలో సైతం అభ్యంతరాలున్నాయి. ప్రజలు వలంటీరుకు ఇస్తున్న విలువ కూడా తమకు ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఏకంగా సీఎం జగన్ కే ఫిర్యాదు చేశారు. అయినా ఏం మార్పు లేదు. తనకు రాజకీయంగా గట్టెక్కించే వ్యవస్థ విషయంలో ప్రజాప్రతినిధుల విన్నపాలను సైతం సీఎం జగన్ బేఖాతరు చేశారు. దానిని పసిగట్టే పవన్ ఓ పద్ధతి ప్రకారం వలంటీర్ల గురించి వ్యాఖ్యలు చేశారు. చర్చకు కారణమయ్యారు. వారి పొట్ట కొట్టే ఉద్దేశ్యం తనకు లేదంటూనే… దాని వెనుక జగన్ దురుద్దేశ్యాన్ని బయటపెట్టారు. పవన్ తాజా వ్యాఖ్యలపై నీలి మీడియా, ఆపై వైసీపీ అనుకూల సోషల్ మీడియా చేస్తున్న అతి కూడా జగన్ అసలు ఉద్దేశాన్ని బయటపెడుతోంది. ఇలా ఎలా తీసుకున్న పవన్ తాను అనుకున్నది రీచ్ అయినట్టు కనిపిస్తోంది.