YCP: వైసీపీకి భారీ డ్యామేజ్ వెనుక అధికారి.. నేతల అంతర్మధనం.. గుణపాఠాలు నేర్చుకోని నాయకత్వం!

2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసిపి విజయం సాధించింది. కానీ ఎన్నికల్లో 11 స్థానాలకి పరిమితం అయ్యింది. ఎక్కడ 151.. ఎక్కడ 11 స్థానాలు. ఈ స్థాయిలో ఓటమి ఎదురవుతుందని వైసీపీ నేతలు కూడా ఊహించలేదు. అంతెందుకు తెలుగుదేశం పార్టీ నేతలు సైతం భావించలేదు. కనీసం 100 స్థానాలతోనైనా అధికారంలోకి వస్తామని వైసిపి నేతలు ధీమాతో ఉండేవారు. కానీ ప్రజలు దారుణంగా తిరస్కరించారు. వైసీపీని కనీస పరిగణలోకి తీసుకోలేదు.

Written By: Dharma, Updated On : July 18, 2024 8:41 am

YCP

Follow us on

YCP: వైసీపీ దారుణ పరాజయం వెనుక ఉన్న కారణాలేంటి? అది జగన్ వైఫల్యమా? ఆయనకు సలహాలు ఇచ్చిన అధికారుల వైఫల్యమా? అసలేం జరిగింది? ఇంతటి భారీ ఓటమికి కారణమేంటి? ఇప్పుడు వైసీపీలో ఇదే ఆసక్తికర చర్చ. ఇప్పుడిప్పుడే ఓటమి బాధ నుంచి వైసీపీ నేతలు బయటపడుతున్నారు. ఈ క్రమంలో వైఫల్యాలను బయట పెడుతున్నారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తమ కొంప ముంచిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో, భూ సర్వే కు సంబంధించి రాళ్లపై జగన్ ఫోటో చెక్కడం వంటివి ప్రతికూల ఫలితాలు ఇచ్చాయని.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపాయని.. అందుకే ప్రజలు ఏకపక్షంగా తిరస్కరించారని ప్రాథమిక నిర్ధారణకు వస్తున్నారు వైసీపీ నేతలు.

2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసిపి విజయం సాధించింది. కానీ ఎన్నికల్లో 11 స్థానాలకి పరిమితం అయ్యింది. ఎక్కడ 151.. ఎక్కడ 11 స్థానాలు. ఈ స్థాయిలో ఓటమి ఎదురవుతుందని వైసీపీ నేతలు కూడా ఊహించలేదు. అంతెందుకు తెలుగుదేశం పార్టీ నేతలు సైతం భావించలేదు. కనీసం 100 స్థానాలతోనైనా అధికారంలోకి వస్తామని వైసిపి నేతలు ధీమాతో ఉండేవారు. కానీ ప్రజలు దారుణంగా తిరస్కరించారు. వైసీపీని కనీస పరిగణలోకి తీసుకోలేదు. ఆ ప్రాంతం..ఈ ప్రాంతం అన్న తేడా లేదు. అన్ని చోట్ల ఇదే పరిస్థితి. అయితే దీనికి ప్రధాన కారణం తెలుస్తోంది. ముఖ్యంగా గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి దీనికి కారణమని వైసిపి నేతలు. వేరే రాష్ట్రంలో ఉన్న ఆయనను తెప్పించి మరి నియమించారని.. వైసీపీ సర్కార్ కుప్పకూలి పోవడానికి ప్రధాన కారణం ఆయనేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వైసిపి ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు తెరపైకి వచ్చారు. ఓటమిపై విశ్లేషించారు. పేర్ని నాని, కేతిరెడ్డి వెంకట్రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి వంటి నేతలు అధికారులను మితిమీరి నమ్మడం వల్లే ఓడిపోయామని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వెంకట్ రెడ్డి చేసిన వ్యవహార శైలి కారణంగానే ప్రభుత్వంపై విపరీతంగా వ్యతిరేకత పెరిగిందని అభిప్రాయపడ్డారు. అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన సలహాలపై ఇప్పుడు లోతైన చర్చ జరుగుతుండడం విశేషం. గనుల శాఖ డైరెక్టర్ గా ఉన్న వెంకట్ రెడ్డి అన్ని తానై.. ఇసుక, గనుల వ్యవహారాలను చక్కబెట్టారు. రైతులకు ఇచ్చే పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలు వేయించడంలోనూ.. భూముల రి సర్వే చేసిన తర్వాత సరిహద్దురాళ్లపై జగన్ బొమ్మలు వేయాలని ఆయనే సూచించారు. ఇది క్షేత్రస్థాయిలో పార్టీపైన, జగన్ కు ఉన్న ఇమేజ్ ను కూడా దెబ్బతీసింది. మీ భూములు మీకు కాకుండా పోతాయని ప్రతిపక్షాలు చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారు.

వెంకటరెడ్డి నిర్ణయాలను జగన్ గౌరవించారు. మారు మాట లేకుండా అమలు చేశారు. దాని ఫలితమే ఓటమి అని ఇప్పుడు వైసీపీ నేతలు బాధపడుతున్నారు. సహజంగా భూములు, ఆస్తుల విషయంలో ప్రజలు సీరియస్ గా ఉంటారు. అలాంటిది విషయంలో జగన్ వేలు పెట్టేలా చేసి.. 350 కోట్లతో సరిహద్దు రాళ్లకు టెండర్ ఇప్పించింది కూడా వెంకట్ రెడ్డి. దీనిలో సీఎం ప్రమేయం కానీ.. ఇతర అధికారుల ప్రమేయం కానీ లేదు. కేవలం 100 కోట్ల రూపాయల వరకు అవినీతి చేసేందుకే వెంకట్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వైసిపి నేతల్లో కూడా అనుమానం ఉంది.

సాధారణంగా వైసిపి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో.. గ్రామీణ ప్రాంత ప్రజలు ఏకపక్షంగా మద్దతు తెలుపుతారని అంతా భావించారు. కానీ భూములకు సంబంధించిన నిర్ణయాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ప్రతికూలత చూపాయి. వైసిపి ఓటు బ్యాంకు కూడా తుడుచుపెట్టుకుపోయింది. ఇప్పుడు ఓటమి నుంచి తేరుకుంటున్న వైసీపీ నేతలు.. అందుకు గల కారణాలు విశ్లేషించే పనిలో పడ్డారు. అయితే కేవలం నేతలే ఆ పని చేస్తున్నారు. నాయకత్వం మాత్రం గుణపాఠాలు నేర్చుకోకపోవడం పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు.