AP Employees:‘జీతమో.. రామచంద్రా’ అంటూ ఇప్పుడు ఏపీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి. ఠంచనుగా 1వ తేదీ జీతాలు పడితే ఇంటి కిరాయిలు, పిల్లల స్కూలు ఫీజులు, ఈఎంఐలు అన్నీ సాఫీగా సాగిపోయేవి. కానీ ఏపీ ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో ఇప్పుడు అప్పులు తెచ్చి తిప్పులు పడుతున్న పరిస్థితి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దాపురించింది. ప్రభుత్వ అధికారులకు 1వ తేదీ జీతాలు పడక చాలా రోజులవుతోంది. ఇప్పుడు వారంతా ‘అమ్మో 1వ తారీఖు’ అనేలా భయపడిపోతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ అష్టకష్టాలు పడుతోంది. విభజన చట్టం ప్రకారం ఏపీకి అందాల్సిన వనరులు అందకపోగా, కేంద్రం సైతం ఏపీపై చిన్న చూపు చూడడంతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతోంది. ఫలితంగా రాష్ట్రం అప్పుల కోరల్లో చిక్కుకుంటోంది. సంక్షేమ పథకాల కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు చెల్లించడంలో మాత్రం ఆలస్యం చేస్తోందని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు పడడం లేదంటున్నారు. మరికొందరికి రకరకాల పేరుతో సాలరీ ఇవ్వడం లేదని అంటున్నారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.
ప్రభుత్వాన్ని మార్చేయగల శక్తి ఉద్యోగులకు ఉంటుందని గత చంద్రబాబు హయాంలో ఒకసారి నిరూపతితమైంది. ప్రభుత్వం తరుపున ఉద్యోగులు నెగెటివ్ గా ఉంటే పాలకులు మారిపోతారు. పాజిటివ్ గా ఉంటే అధికారంలో ఉంటారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగులపై ఒత్తిడి తేవడంతోనే కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలను అధికారంలోకి తెచ్చారనే టాక్ ఉంది. అయితే ఇప్పుడు అదే ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు దేనికోసమైతే పనిచేస్తున్నారో.. అవే జీతాలు సరైన సమయంలో చెల్లించకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటున్నారు.
సాధారణంగా ప్రతీ ఉద్యోగి బదిలీలు, డీఏలు కోరుకుంటారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డీఏ విషయంలో ఎలాంటి సంతృప్తికర న్యూస్ అందించలేదని అంటున్నారు. అంతేకాకుండా సీపీఎస్ విధానాన్ని కూడా రద్దు చేస్తుందని వార్తలు వస్తున్నాయని, ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు తప్పదని అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రతీ నెల కనీసం 10వ తేదీ లోపు జీతాలు రావడం లేదని, దీంతో ప్రభుత్వ ఉద్యోగులు అత్యవసరాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత అభివృద్ధి పనులకు ఉద్యోగుల పాత్ర కూడా ఉంటుంది. పాలకులతో కలిసి ఉద్యోగులు వారితో సమానంగా పనిచేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా సమయానికి చెల్లించకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్నారని అంటున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం భారీగా నిధులు వెచ్చిస్తోందని, అదే సమయంలో ఉద్యోగుల బాగోగులను కూడా చూసుకోవాలని కొందరు కోరుతున్నారు.
మొన్నటి వరకు ప్రభుత్వంతో కలిసి పని చేసిన ఉద్యోగులు ఇక పోరుబాటకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతో పాటు సీపీఎస్ రద్దు ఆలోచనను విరమించుకోవాలని ఆందోళన దిశగా వెళుతున్నారు. ప్రభుత్వంలో కీలకంగా ఉండే ఉద్యోగులు సంతృప్తిగా ఉంటేనే అభివృద్ధి పనులు సాఫీగా సాగుతాయని, తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
రాష్ట్రం ఇప్పటికే తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిందని, ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి కూడా అప్పులు చేయాల్సి వస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు చెల్లించకపోవడంతో వీరికి ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు చెల్లించేందుకు పోరాడితే తాము మద్దతిస్తామని కొందరు పేర్కొంటున్నారు. కానీ ఉద్యోగులు మాత్రం నేరుగా తామే ప్రభుత్వంపై పోరాడుతామంటున్నారు.
ఉద్యోగుల జీతాల విషయంలో కొందరు పరోక్షంగా విమర్శలు చేస్తున్నా సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. తమ జీతాల విషయంలో ప్రభుత్వానికి విన్నవించాలని.. ఒత్తిడి తీసుకు రావడానికి ఆందోళనే సరైన మార్గంగా ఉద్యోగులు ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ప్రభుత్వం ఉద్యోగులకు ఎలాంటి హామీలు ఇచ్చి వారిని మచ్చిక చేసుకుంటుందో చూడాలి.