దేశంలో కోట్ల సంఖ్యలో వాహనదారులు బైక్ లేదా కారును కలిగి ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో వాహనదారులను టార్గెట్ చేసి కొంతమంది మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాహనదారులు కొన్ని వెబ్ సైట్లు ఫేక్ ఇన్సూరెన్స్ ప్రొడక్టులను విక్రయిస్తున్నాయని అలాంటి వెబ్ సైట్లు, ఈ మెయిల్స్ తో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
చాలామంది వాహనదారులకు digitalpolicyservices@gmail.com అనే జీమెయిల్ ఖాతా నుంచి తక్కువ ధరకే ఇన్సూరెన్స్ అందిస్తామని ఫేక్ ఆఫర్లతో ఈమెయిల్స్ వస్తున్నాయి. తక్కువ ధరకే ఇన్సూరెన్స్ వస్తుందని ఈ ఫేక్ ఆఫర్లను నమ్మితే మాత్రం మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫేక్ వెబ్ సైట్లను నమ్మితే డబ్బులు నష్టపోయే అవకాశం ఉండటంతో ఐఆర్‌డీఏఐ వాహనదారులను అప్రమత్తం చేస్తోంది.
కొంతమందికి ఫేక్ ఆఫర్లకు సంబంధించి ఫోన్ కాల్స్, మెసేజ్ లు కూడా వస్తున్నాయి. డిజిటల్ నేషనల్ మోటార్ ఇన్సూరెన్స్ పేరుతో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తోంది. మోసగాళ్లు తక్కువ ధరకే ఇన్సూరెన్స్ ఇస్తామని చెబితే అలాంటి ఆఫర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ఐఆర్‌డీఏఐ సూచనలు చేస్తూ వాహనదారులు మోసపోకుండా అలర్ట్ చేస్తోంది.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక ప్రత్యేక నంబర్ ను కేటాయించడంతో పాటు ప్రతి పాలసీకి ఒక యూఐడీ నెంబర్ ను కేటాయిస్తుంది. యూఐడీ నెంబర్ సహాయంలో ఇన్సూరెన్స్ పాలసీ ఒరిజినల్ పాలసీనో కాదో సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.