Electronic Waste: రోజు రోజుకు కొత్త కొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు పుట్టుకు వస్తుండడంతో “కొత్తకు చింత పాతకు రోత” అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఫలితంగా అప్పటిదాకా వాడిన ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పేరుకు పోతున్నాయి. ఇలా ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యర్థాలు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయి. రీసైక్లింగ్ నామమాత్రంగా జరుగుతుండడంతో పర్యావరణానికి తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తున్నాయి. పైగా అభివృద్ధి చెందిన దేశాలు ఎలక్ట్రానిక్ వ్యర్ధాలపై చట్టాలు చేసినప్పటికీ వాటి అమలుకు చర్యలు తీసుకోవడం లేదు. పైగా ఈ_ వ్యర్ధాలు భూమిలో కలిసిపోయేవి కాకపోవడంతో విషపూరితంగా మారి గాలిలో, భూమిలో, వీటిలో కలుస్తూ ప్రాణకోటిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సరైన విధానంలో వీటిని ధ్వంసం చేయకపోవడం, అవగాహన లేక తగలబెట్టడం వల్ల వాటి నుంచి విషవాయువులు వాతావరణంలో కలుస్తున్నాయి. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నా వీటిని ఉత్పత్తి చేస్తున్న సంస్థలు, వాడుతున్న వినియోగదారులు, పర్యవేక్షించాల్సిన అధికారులు, ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఏటా ఈ_ వ్యర్థాలు లక్షల మెట్రిక్ టన్నుల మేర పేరుకు పోతున్నాయి. తాజా అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ వ్యర్ధాలు ఉన్నాయి. ఇందులో కొంతమేర రీసైక్లింగ్ జరిగింది. గడచిన సెప్టెంబర్ చివరి నాటికి నికరంగా ఈ భూమి మీద 34.7 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ_ వ్యర్ధాలు ఉన్నాయి.

ఏడాదిలో 5.7 కోట్ల టన్నులు
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ ఏటికేడు పెరుగుతోంది. ఒక 2021 సంవత్సరంలోనే 5.7 కోట్ల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు జమ అయినట్లు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. వాస్తవంగా ఈ _ వ్యర్థాల ముప్పును గుర్తించిన తర్వాత 2014 నుంచి ప్రతి ఏటా మేరకు వ్యర్ధాలు ఉత్పత్తి అవుతున్నాయనే అంశం మీద వివిధ సంస్థలు కీలకంగా దృష్టి సారించాయి. 2014 కు ముందు ఎలక్ట్రానిక్ వ్యర్ధాలకు సంబంధించి పూర్తి సమాచారం లేకపోయినప్పటికీ అంచనాలు వేయగలిగారు. అయితే రీసైక్లింగ్ లో నిర్లక్ష్యం చేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఆధునికత పేరిట ప్రపంచం ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వస్తువుల వినియోగంపై పరుగులు తీస్తున్న నేపథ్యంలో.. వ్యర్ధాలు పెరిగేందుకు కారణమవుతోంది. ఆధునిక వస్తువులు మార్కెట్లోకి వస్తున్న కొద్దీ.. అప్పటివరకు వినియోగించుకున్న వస్తువులను పక్కన పడేస్తున్నారు. మార్కెట్లోకి కొత్తది వస్తే చాలు పాతది ఇక పని చేయదన్న భావనలో పడిపోతున్నారు. హరిత సౌకర్యవంతమైన వాటి వెంటపడుతున్నారు. అలా ప్రతి ఏడాది 20 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు అదనంగా వచ్చి చేరుతున్నాయి. అయితే ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వస్తువుల వినియోగం అధికంగా ఉన్న దేశాలు వీటిని రీ_సైకిల్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. వాటిని సక్రమంగా డిస్పోస్ చేయకుండా బాహ్య ప్రపంచంలో పారేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ_ వ్యర్థాలల్లో 17.4% మాత్రమే రీసైకిల్ అవుతున్నట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 71 శాతం జనాభా కలిగిన మొత్తం 78 దేశాలు ఈ_ వ్యర్థాల పై చట్టాలు, నియంత్రణ విధానాలు తీసుకొచ్చాయి. కానీ వాటి అమలు అంతంమాత్రం గానే ఉంది. అమెరికాలో దాదాపు 25 రాష్ట్రాల్లో ఈ వ్యర్ధాల రీసైక్లింగ్ కు సంబంధించి ఎటువంటి చట్టాలు లేకపోవడం గమనార్హం.
భారత్ మూడో స్థానం
చైనా, అమెరికా, భారత్ ఈ వ్యర్ధాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఏటా ఆసియాలో 2.4 కోట్ల మెట్రిక్ టన్నులు, అమెరికాలో 1.3 కోట్ల మెట్రిక్ టన్నులు, యూరప్ లో 1.2 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ వ్యర్ధాలు ఉత్పత్తి అవుతున్నాయి. తలసరి ఉత్పత్తి యూరప్ లో 16.2 కిలోలు, ఓషియానియా దేశాల్లో 16.1 కిలోలు, అమెరికాలో 13.3 కిలోలుగా ఉంది.. కానీ ఆఫ్రికా దేశంలో వ్యర్ధాల ఉత్పత్తి అతి తక్కువగా ఉంది. ఇక ఈ వ్యర్ధాల్లో మైక్రోవేవ్స్, వ్యాక్యూమ్ క్లీనర్లు, టోస్టర్లు, ఏవర్స్, హెయిర్ డ్రయ్యర్స్, వాషింగ్ మిషన్లు, టంబుల్ డ్రయ్యర్స్, స్టవ్ లు, డిష్ వాషర్లు, కుక్కర్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, హీట్ పంపులు, మానిటర్లు, టెలివిజన్లు, టాబ్లెట్స్, ఐటి టెలి ఎక్విప్మెంట్, సెల్ ఫోన్లు, వైర్లెస్ రూటర్లు, జిపిఎస్, క్యాలిక్యులేటర్లు, ఎల్ఈడీ బల్బులు ఉన్నాయి.. వీటి రీసైక్లింగ్ సక్రమంగా జరగకపోవడంతో వ్యర్ధాలు పేరుకుపోతున్నాయి.

గత ఏడాది కేరళలో సంభవించిన వరదల వల్ల అరేబియా సముద్రం నుంచి సుమారు టన్ను వరకు వ్యర్ధాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. ఈ రీతిన సముద్రాలలో ఏమేరా వ్యర్ధాలు కలుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి రకరకాల రసాయనాలు వినియోగిస్తుండడంతో వాటి ప్రభావం జీవులపై అధికంగా ఉంటున్నది. అభివృద్ధి చెందిన దేశాలు ఏటా ఉత్పత్తి చేసే ఈ వ్యర్ధాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే వ్యర్ధాలతో సమానంగా ఉంటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ భూమిపై ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు పేరుకుపోయి మనిషి మనుగడకే ముప్పు పొంచి ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.