Vijayasai Reddy On Film Industry: జగన్‌ ‘వ్యూహం’ కోసమే.. వైసీపీ ముందు జాగ్రత్త.. విజయసాయి మాటల్లో ఆంతర్యం అదేనా?

వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఈ చర్చలో పాల్గొన్నారు. బిల్లుకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు.

Written By: Raj Shekar, Updated On : July 28, 2023 12:58 pm

Vijayasai Reddy On Film Industry

Follow us on

Vijayasai Reddy On Film Industry: దేశంలో సినిమా కార్మికుల సమస్యలు.. దర్శక, నిర్మాతలపై కేసుల క్రిమినల్‌ విషయంలో వైసీపీ సడెన్‌గా తీసుకున్న స్టాండ్‌ అందినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సినిమా ఇండస్ట్రీ గురించి, కార్మికుల వేతనాలు, సంక్షేమం గురించి, నిర్మాతలకు జరుగుతున్న నష్టం గురించి ఏనాడూ పట్టించుకోని జగన్‌ సర్కార్, తాజాగా పార్లమెంట్‌లో ఇటు కార్మికులకు, అటు దర్శక, నిర్మాతలకు అనుకూలంగా చట్టంలో మార్పులు చేయాలని కోరడం ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్య పరుస్తోంది. ఇదంతా వైసీపీ ‘వ్యూహం’లో భాగమే అన్న అభిప్రాయం ఇటు సినీవర్గాల్లో.. అటు పొలిటికల్‌ సర్కిల్స్‌లో వ్యక్తమవుతోంది.

సామాన్యులకు ఛాన్స్‌లు ఎక్కడ..
నిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో గురువారం చర్చ జరిగింది. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఈ చర్చలో పాల్గొన్నారు. బిల్లుకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమను ఒక్కసారి పరిశీలిస్తే హీరోల కుమారులే హీరోలు అవుతున్నారు. హీరోల కుమార్తెలు మాత్రం హీరోయిన్లు అవుతున్న ఉదంతాలు చాలా తక్కువ కనిపిస్తాయని పేర్కొన్నారు. హీరోలు అయ్యే హీరోల కుమారులకంటే అందగాళ్లయిన అబ్బాయిలు దేశంలో లెక్కకు మించి ఉన్నారని తెలిపారు. కానీ, వారికి హీరోగా అవకాశాలు ఎందుకు దక్కడం లేదో అర్ధం కావడం లేదని అన్నారు.

సినిమానే చౌక వినోదం..
భారత దేశ జనాభా రూ.140 కోట్లతో చైనాను దాటి పోయింది. చైనాలో 80 వేల థియేటర్లు ఉంటే భారత్‌లో మాత్రం 8 వేల థియేటర్లు మాత్రమే ఉన్నాయని విజయసాయిరెడ్డి అన్నారు. సినిమా అనేది సామాన్యుడికి చౌకగా లభించే వినోదం. దీనిని సామాన్యులందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి దేశంలో థియేటర్ల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ప్రభుత్వం నుంచి కూడా తగిన ప్రోత్సాహం ఉండాలని ఆయన సూచించారు.

తనిఖీల పేరుతో థియేటర్ల మూత…
రెండేళ్ల క్రితం ఏపీలో సినిమా థియేటర్లపై వైసీపీ సర్కార్‌ అధికారులతో దాడులు చేయించింది. అనుమతుల పేరిట చాలా థియేటర్లను సీజ్‌ చేయించింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు తీవ్రంగా నష్టపోయారు. పెద్ద సినిమాల రిలీజ్‌ సమయంలో టికెట్‌ చార్జీల పెంపుకు ఏపీ సర్కార్‌ అనుమతి ఇవ్వడం లేదు. మరోవైపు తక్కువ బడ్జెట్, చిన్న సినిమాలకు ఎలాంటి సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. తన చర్యలతో ఏపీలో ఉన్న థియేటర్లే మూతపడేలా చేస్తున్న వైసీపీ సర్కార్‌.. దేశంలో థియేటర్ల సంఖ్య పెంచేలా ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలని కోరండం తెలుగు ఇండస్ట్రీ వర్గాలను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.

కేసులు నిరోధించేలా చట్ట సవరణ..
ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన మరో కీలక సూచన దర్శక, నిర్మాతలపై క్రిమినల్‌ కేసులు దాఖలు కాకుండా నిరోధించాలని కోరడం. ఒక చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుని విజయవంతంగా సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందినదంటే ఆ చిత్ర లేదా దర్శకుడికి కేసుల నుంచి పూర్తిగా రక్షణ కల్పించినట్లే పరిగణించాలి అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. సెన్సార్‌ బోర్డ్‌ సర్టిఫికెట్‌ పొందిన చిత్ర నిర్మాత లేదా దర్శకుడిపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు దాఖలు కాకుండా నిరోధించేలా సినిమాటోగ్రాఫ్‌ చట్టంలో సవరణ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సూచన మంచిదే కావొచ్చు.. కానీ, తనకు అనుకూలమైనప్పుడు ఒకలా.. వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒకలా మాట్లాడడమే విస్మయానికి గురిచేస్తోంది.

సూచన వెనుక ‘వ్యూహం’
వైసీపీ కేంద్రానికి చేసిన ఈ సూచన వెనుక జగన్‌ సినిమా ‘వ్యూహం’ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వ్యూహం సినిమా తెరకెక్కుతోంది. రిలీజ్‌కు ముందే.. కాంట్రవర్సీ మొదలైంది. ఈ నేపథ్యంలో రిలీజ్‌ తర్వాత ఎలాంటి ఆటంకాలు ఉండొద్దనే జగన్‌.. పార్లమెంట్‌లో విజయసాయిరెడ్డితో చట్ట సవరణ సూచన చేయించినట్లు తెలుస్తోంది.