HBD Superstar MaheshBabu: తెరపైనే కాదు.. తెరువెనుక కూడా సూపర్ స్టార్..

మహేష్ చేసే ముఖ్యమైన సేవా కార్యక్రమలో చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్స్ ఒకటి. మన సూపర్ స్టార్ దాదాపు గుండె సంబంధిత సమస్యలు ఉన్న 1000 మందికి పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించి ఎంతోమందికి ప్రాణదానం చేశారు.

Written By: Swathi, Updated On : August 9, 2023 11:28 am

HBD Superstar MaheshBabu

Follow us on

HBD Superstar MaheshBabu: క్లాస్, మాస్ అని తేడా లేకుండా ఎవరినైనా మెప్పించగలిగే హీరో మన మహేష్ బాబు. అమ్మాయిలు ఆయన్ని యువరాజు అంటే అబ్బాయిలు పోకిరి అంటారు. తన సినిమాలతో ఎన్నో రికార్డులు సాధించి.. టాలీవుడ్ సూపర్ స్టార్ గా మారిన ఈ హీరో తెరపైనే కాదు.. తెరు వెనక కూడా తన సేవా కార్యక్రమాలతో నిజంగానే సూపర్ స్టార్ అనిపించుకున్నారు.

మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చేసిన సేవా కార్యక్రమాల గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతెందుకు కృష్ణ సినిమా ఏదన్నా ఫ్లాప్ అయితే ఆయన రెమ్యూనరేషన్ కూడా తీసుకునేవారు కాదు. ఇక మహేష్ బాబు కూడా తన తండ్రి వారసత్వాన్ని తీసుకొని కేవలం సినిమాల్లో స్టార్ డం సంపాదించడమే కాక తన తండ్రిని మించి సేవా కార్యక్రమాల్లో రియల్ హీరోగా ఎదిగాడు. నేడు ఆగస్టు 9 మహేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈయన చేసిన గొప్ప పనులను ఒకసారి చూద్దాం..

మహేష్ చేసే ముఖ్యమైన సేవా కార్యక్రమలో చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్స్ ఒకటి. మన సూపర్ స్టార్ దాదాపు గుండె సంబంధిత సమస్యలు ఉన్న 1000 మందికి పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించి ఎంతోమందికి ప్రాణదానం చేశారు. అంతేకాకుండా ఈమధ్య గుండె సమస్య ఉన్న చిన్న పిల్లలు ఎంతమంది వచ్చినా తన సొంత ఖర్చులతో హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తానని ప్రకటించారు.

తన దగ్గర పని చేసేవాళ్ళ పిల్లల చదువులకి కూడా మహేష్ అవసరమైన సహాయాన్ని చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ దగ్గర పనిచేస్తున్న వారు ఎంతోమంది పలు సందర్భాలలో చెప్పారు.

కొన్ని సంవత్సరాల క్రితం హుదుద్‌ తుఫాను సమయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా మహేష్ బాబు రూ.2.5 కోట్లు, కరోనా సమయంలో సినిమా కార్మికులకు కోసం రూ. 25 లక్షలు అందించాడు. ఇలా ఎన్నో సార్లు ప్రభుత్వాలకు కష్టకాలంలో ప్రజల కోసం సహాయాన్ని అందించాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్దాపురం గ్రామాలను 2016 లో ఈ హీరో దత్తత తీసుకొని ఆ గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆ గ్రామాల్లో ఇప్పటికీ మహేష్ బాబు ప్రతి సంవత్సరం అనేక సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. అలానే బుర్రిపాలెం గ్రామంలోని ప్రజలకు ప్రతి సంవత్సరం తన తండ్రి కృష్ణ పుట్టిన రోజు న ఫ్రీ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తూ ఉంటారు మహేష్.

ఇంత గొప్ప మనసు ఉన్న మహేష్ బాబు ఇలాంటి అనేక పుట్టినరోజులు జరుపుకుంటూ మరింత పెద్ద స్థాయికి ఎదగాలని కోరుకుండాం.