Homeఅంతర్జాతీయంBritish Prime Minister race: బ్రిటన్ ప్రధాని రేసు: మనల్ని పాలించిన వాళ్లని మనమే పాలించే...

British Prime Minister race: బ్రిటన్ ప్రధాని రేసు: మనల్ని పాలించిన వాళ్లని మనమే పాలించే అరుదైన అవకాశం !

British Prime Minister race : రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ‘బ్రిటన్’ నెలకొల్పింది. తూర్పున చైనా, జపాన్ ల నుంచి అమెరికా దాకా అందరినీ ఆక్రమించేసి నలుచెరుగులా పాలించింది. దోచుకుంది. అనంతరం స్వాతంత్య్రాలు ఇచ్చి చేతులు దులుపుకుంది. కటిక దారిద్ర్యంతో ఆదేశాలన్నీ దశాబ్దాలుగా పోరాడుతూ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఆవిర్భవించింది.

ఇక బ్రిటీషర్లు మన దేశాన్ని 1947 వరకూ పాలించారు. అనంతరం దేశాన్ని పీల్చిపిప్పి చేసి స్వాతంత్ర్యం ఇచ్చి.. దేశాన్ని విభిజించి పాకిస్తాన్ ను వేరు చేసి చిచ్చు పెట్టి పంపించారు. ఇప్పుడు భారత్ అఖండంగా ఎదిగింది. ప్రపంచంలో మనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. భారతీయులు అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా తమ మేధాస్సుతో సీఈవోలు, చైర్మన్లుగా, పారిశ్రామికవేత్తలుగా ప్రపంచాన్ని శాసిస్తున్నారు.

ప్రవాస భారతీయులు ఇప్పుడు ప్రపంచం నలుచెరుగులా విస్తరించి ఆయా దేశాల్లో సత్తా చాటుతున్నారు. ఆధిపత్యం చెలాయించే స్థాయికి ఎదుగుతున్నారు. ఇప్పుడు బ్రిటన్ దేశంలోనూ భారతీయుల హవా కొనసాగుతోంది. ఇప్పుడు ఏకంగా మనల్ని పాలించిన బ్రిటీష్ వారిని మనే పాలించే అరుదైన అవకాశం దక్కింది. బ్రిటన్ దేశానికి భారత సంతతికి చెందిన హిందువు ప్రధాని అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో యూకే తదుపరి ప్రధానమంత్రిగా ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునక్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయన ప్రధాని రేసులో నిలబడి తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించారు. ట్వీట్లు, సోషల్ మీడియాలో పోస్టులతో ప్రజలకు చేరువ అవుతున్నారు. తన వలస వారసత్వం గురించి చెప్పుకుంటూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు.

బెంగళూరుకు చెందిన మన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి అల్లుడే ఈ రుషి సునక్. ఈ వారమే బోరిస్ జాన్సన్ పాలన నచ్చక ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేశారు.

-రిషి సునక్ బయోడేటా రిషి సునక్ ఎవరు? ఎక్కడి వారు?
రిషి సునక్ పూర్వీకులది భారత్ లోని పంజాబ్. వారు తొలుత తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి అక్కడి నుంచి పిల్లలతో సహా యూకేకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సునాక్ తండ్రి యశ్ వీర్ కెన్యాలో.. తల్లి ఉష టాంజానియాలో జన్మించారు. వీరి కుటుంబాలు బ్రిటన్ వలస వెళ్లాక వివాహం చేసుకున్నారు. వీరికి సంతానంగా రిషి పుట్టాడు. ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్ లో రిషి సునాక్ 1980 మే 12న జన్మించాడు. రిషి స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశాడు. తొలుత కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశాడు. కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతతో పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన 2015లో రిచ్ మాండ్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి రిషి గెలిచాడు. 2019లో జరిగిన కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో రిషి బోరిస్ జాన్సన్ కు మద్దతునిచ్చాడు. బోరిస్ ప్రధానిగా ఎన్నికయ్యాక రిషికి కీలకమైన ఆర్థికశాఖలో చీఫ్ సెక్రటరీగా కీలక బాధ్యతలు అప్పగించాడు.

బోరిస్ జాన్సన్ కు అత్యంత నమ్మకస్తుడిగా సునాక్ కు పేరుంది. ఆయన కేబినెట్ లో ‘రైజింగ్ స్టార్’ మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. దీంతో 2020 ఫిబ్రవరిలో ఇతడికి ఛాన్సలర్ గా పదోన్నతి కూడా దక్కింది. కేబినెట్ పూర్తిస్థాయి ఆర్థికమంత్రిగా ప్రమోట్ అయ్యాడు. తొలి బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టాడు. హిందువు అయిన సునాక్ పార్లమెంట్ లో భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం. కరోనా సమయంలో రిషి ప్రవేశపెట్టిన పథకాలు, వ్యాపారులు, ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచి ఆర్థిక ప్రయోజనం కలిగించాయి. అందుకే ప్రజల్లో రిషికి మంచి ఆదరణ వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

– ప్రధాని రేసులో రిషి సునాక్ తో పాటు భారత సంతతి కి చెందిన ప్రీతి పటేల్, సుయెల్ల బ్రవెర్మన్
భారత సంతతికి చెందిన ప్రీతిపటేల్, సుయెల్ల బ్రవెర్మన్ కూడా బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్నారు. ముఖ్యంగా రిషితోపాటు సుయెల్ల బ్రవెర్మన్ ప్రధానంగా పోటీపడుతున్నారు. 42 ఏళ్ల బ్రేవర్‌మాన్ ఒక న్యాయవాది. ప్రభుత్వంలో అత్యంత సీనియర్ లీగల్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆమె పార్టీకి చెందిన బ్రెక్సిట్ అనుకూల వర్గం నుండి కొంత మద్దతు పొందుతోంది. అటార్నీ జనరల్ గా వ్యవహరిస్తున్న సుయెల్లా బ్రేవర్‌మన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. పాంథియోన్-సోర్బోన్ విశ్వవిద్యాలయంలో యూరోపియన్ మరియు ఫ్రెంచ్ న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. ఆమె తర్వాత లండన్‌లోని నంబర్ 5 ఛాంబర్స్‌లో వాణిజ్య వ్యాజ్యం, న్యాయ సమీక్ష, ఇమ్మిగ్రేషన్ మరియు ప్లానింగ్ చట్టంలో నైపుణ్యం సాధించింది.

2005లో లీసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన సుయెల్లా బ్రేవర్‌మన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె లేబర్ అభ్యర్థి కీత్ వాజ్ చేతిలో ఓడిపోయింది కానీ చివరికి ఫేర్‌హామ్‌లో కన్జర్వేటివ్ అభ్యర్థిగా ఎంపికైంది. 2015లో ఫేర్‌హామ్ ఎంపీగా హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికైంది. ఆమె 56.1% ఓట్లతో.. 22,262 మెజారిటీతో గెలిచింది.

ఎన్నికైనప్పటి నుండి ఆమె ఎడ్యుకేషన్ సెలెక్ట్ కమిటీలో ట్రెజరీకి పార్లమెంటరీ ప్రైవేట్ సెక్రటరీగా.. బ్రెగ్జిట్ మంత్రిగా పనిచేశారు. నవంబర్ 2018లో ఆమె ‘ఉపసంహరణ ఒప్పందం యొక్క ఆమోదయోగ్యం కాని నిబంధనలు’గా అభివర్ణించినందుకు బ్రెక్సిట్ మంత్రిగా తన పదవికి రాజీనామా చేసింది.

ఇక ప్రీతీ పటేల్ కూడా భారతీయ సంతతి గల వారే. ఈమె బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో యూకే హోం సెక్రటరీగా కొనసాగారు. బోరిస్ జాన్సన్ కు వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేశారు. కానీ రిషి, బ్రేవర్మన్ తో పోలిస్తే ఈమెకు మద్దతు తక్కువగానే ఉంది. కానీ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటే మాత్రం ప్రతీకి ఛాన్స్ ఉంది.

వీరిలో ఒకరికి ఈ అధికారం దక్కుతుందని ఆశిద్దాం! కాకపోయినా, భారత సంతతి వారు బ్రిటన్ లో నిర్ణయాత్మక శక్తి గా ఎదగడం మాత్రం మన వారి ప్రతిభ, పట్టుదల కి ఒక తార్కాణం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular