Corporate tax : అంతర్జాతీయ సంస్థలపై కార్పొరేట్ పన్ను విధించాలన్న ప్రతిపాదనకు భారత్ అంగీకరించింది. ఇటీవల ఈ ఒప్పందానికి అంగీకారం తెలుపుతున్నట్లు ప్రకటించింది. పన్ను’ పీకడంలో ఆరితేరిన మోడీ సర్కార్ ఈ కార్పొరేట్ కంపెనీల పన్ను విషయంలో వెంటనే ఓకే చెప్పేసింది. ఇకపై అంతర్జాతీయ కంపెనీల లాభాల్లో 15 శాతం పన్నును ఆయా దేశాల ప్రభుత్వాలు విధిస్తాయన్నమాట. ఈ ఒప్పందానికి శ్రీలంక, పాకిస్తాన్, నైజిరియా దేశాలు దూరంగా ఉన్నాయి. ఆ దేశాలు దీనిని అంగీకరించలేదు. అయితే ఇలా అంతర్జాతీయ సంస్థపై పన్నును ఎందుకు విధిస్తున్నారు..? దీనిపై భారత్ ఎందుకు అంగీకారం తెలిపింది..? అసలు కారణాలేంటనే దానిపై స్పెషల్ ఫోకస్..

ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ నిర్వహించిన సమావేశంలో కార్పొరేట్ బహుళ జాతి సంస్థలకు 15 శాతం పన్ను విధించాలని అమెరికా ప్రతిపాదించింది. అంతర్జాతీయ పన్ను వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి, బహుళ జాతి సంస్థలు పన్ను ఎగ్గొట్టకుండా ఉండడానికి ఈ ప్రతిపాదనను చేసింది. దీనికి భారత్ సహా 136 దేశాలు అంగీకారం తెలిపాయి. రోమ్ నగరంలో అక్టోబర్ చివరి వారంలో జరిగిన జీ 20 సదస్సులో ప్రపంచంలోని 20 ప్రధాన ఆర్తిక వ్యవస్థల అధినేతలు దీనికి ఆమోదం తెలిపారు. 2023 నుంచి ఇది అమల్లోకి రానుంది. సాధారణంగా బహుళ జాతి కంపెనీలు ఏ దేశంలో ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని అక్కడ లాభాలు ప్రకటిస్తాయో ఆయా దేశాలు పన్నును విధిస్తాయి. అయితే ఆ సంస్థ ఇతర దేశాల్లో సంస్థలు ఏర్పాటు చేస్తే అనుబంధ సంస్థగా పరిగణించి అక్కడి లాభాలను అనుబంధ సంస్థకు తరలిస్తున్నారు. దీంతో మొదటి దేశం ఆదాయాన్ని కోల్పోతోంది.
కంపెనీలు ఇలా చేయడంతో ప్రభుత్వాలు కొత్త చట్టం తీసుకొచ్చే పనిలో పడ్డాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ , ఫేస్ బుక్ లాంటి దిగ్గజాల నుంచి పన్ను రాబట్టేందుకు ఈ ప్రతిపాదనను చేసినట్లు తెలుస్తోంది. తాజాగా చేసిన చట్టం ప్రకారం.. ఎక్కడైతే లాభాలు ప్రకటిస్తారో అక్కడే పన్నులు విధించాల్సి ఉంటుంది. ప్రధాన కార్యాలయాలు, పేటెంట్ హక్కులతో పనిలేకుండా విక్రయాలు జరిగిన చోటే పన్ను చెల్లించాలి. కంపెనీ లాభాలపై పన్ను స్వర్గాలుగా పిలిచే కొన్ని దేశాల్లో పన్ను విధించకపోయినా, తక్కువగా విధించినా ఆ లాభాలపై స్వదేశం ‘టాప్ ఆప్ ట్యాక్స్’ విధించవచ్చు. అలా సంస్థపై మొత్తంగా 15 శాతం పన్ను విధిస్తారు.
భారత్ లో ఇంటర్నెట్ ఆధారంగా చేసే వ్యాపార సంస్థలపై కేంద్రం 6 శాతం డిజిటల్ పన్ను విధిస్తోంది. 2016లో దీనిని ప్రవేశపెట్టింది. భారత్లో ఆన్లైన్ వ్యాపారాలు నిర్వహించే సంస్థలపై దీనిని విధిస్తారు. అంటే టెక్ కంపెనీల వార్షిక ఆదాయం రూ.2 కోట్లు దాటితే ఈ పన్ను పరిధిలోకి వస్తాయి. గూగుల్, అమెజాన్, ఫేసు బుఖ్, నెట్ ఫ్లిక్స్ వంటి కంపెనీలు ఈ పన్ను పరిధిలోకి వస్తాయి. అయితే తాజాగా ప్రవేశపెట్టిన కార్పొరేట్ పన్ను అమల్లోకి వస్తే డిజిటల్ పన్ను రద్దు చేయాల్సి ఉంటుంది. 2019లో భారత్ కార్పొరేట్ పన్నును తగ్గించింది. 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గించింది. రాయితీలు, ప్రోత్సాహకాలు వద్దనుకునే దేశీయ కంపెనీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 2019 అక్టోబర్ 1 నుంచి ఉత్పత్తి రంగంలో కొత్తగా ఏర్పాటయ్యే దేశీయ సంస్థలు రాయితీలు తీసుకోకుంటే 15 శాతం పన్ను విధిస్తారు.
గ్లోబల్ పన్నులు భారత్ కు మేలే చేస్తాయని కొందరు నిపుణులు అంటున్నారు. ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్ నర్ కన్నల్టింగ్ సంస్థ ఈ విషయాన్ని చెప్పింది. అయితే కార్పొరేట్ పన్ను కనీస పరిమితి 15 శాతం నిర్దేశించడాన్ని చారిటీ సంస్థ ఆక్స్ ఫామ్ విమర్శించింది. ఇది చాలా తక్కువ అని, దీని వల్ల ఏమీ ఉపయోగం ఉండదని తెలిపింది.