IND vs BAN : 145 పరుగుల లక్ష్యం.. 70 పరుగులకే 7 వికెట్లు కోల్పోయాయి.. మరో 75 పరుగులు చేయాలి. చేతిలో 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి సమయంలో టీమిండియా రెండో టెస్ట్ లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోతుందని అంతా టీవీలు కట్టేశారు. కానీ ఆ ఇద్దరు టీమిండియాను ఒడ్డునపడేశారు. స్పిన్ తో గింగిరాలు తిరుగుతున్న పిచ్ పై.. ప్రమాదకరంగా దూసుకొస్తున్న బంతులను కాచుకొని మరీ టీమిండియాను గెలిపించారు.

రెండో టెస్టులో బంగ్లాదేశ్ పై విజయంలో టీమిండియా బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ లు మొండిగా నిలబడి విజయం కట్టబెట్టారు. నిజానికి 1 పరుగుకే స్లిప్ లో క్యాచ్ ఇచ్చిన అశ్విన్ బతికిపోయాడు. ఆ క్యాచ్ ను బంగ్లా ఫీల్డర్ అందుకుంటే టీమిండియా కథ వేరేలా ఉండేది. ఓడిపోయేది. కానీ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోకుండా అశ్విన్, శ్రేయాస్ అయ్యర్ భారత్ ను ఒడ్డున పడేశారు. గెలిపించారు.
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి టీమిండియా తీవ్రంగా కష్టపడింది. స్వల్ప వ్యధిలోనే వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది.
45/4 స్కోరుతో నాలుగో రోజు ఆట సాగించిన టీమిండియాకు ఆదిలోనే బంగ్లా బౌలర్లు దెబ్బతీశారు. మెహదీ హాసన్, షకీబ్ మూడు వికెట్లు కూల్చి 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. విజయానికి మరో 70 పరుగులకు పైగా కావాల్సిన దశలో అయ్యర్ (29), అశ్విన్ (42) నిలకడగా ఆడి టీమిండియాకు కీలకమైన భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
శ్రేయాస్ అయ్యర్, అశ్విన్ కీలక సమయంలో చివర్లో దూకుడు పెంచి బంగ్లా ఆశలపై నీళ్లు చల్లారు. చివర్లో ఇద్దరూ ఫోర్లు, సిక్సులు కొట్టి టీమిండియాకు ఓటమి ముప్పు తప్పించారు. ముఖ్యంగా చివర్లో అశ్విన్ రెండు సిక్సులు ఫోర్లు కొట్టి ఒత్తిడి తగ్గించాడు. అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. రెండు టెస్టుల్లో రాణించిన పూజారాకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ దక్కింది.