
Rahul Gandhi vs Gautam Adani : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ‘పప్పు’ అంటూ బీజేపీ ఫోకస్ చేసింది. ఆ ఆపపత్రను తొలగించుకోవడానికి ఇప్పటికీ రాహుల్ తపన పడుతున్నారు. 2014, 2019లో కాంగ్రెస్ ను అధికారంలోకి రాహుల్ తీసుకురాలేకపోయాడు. రాహుల్ గాంధీ పిల్ల చేష్టలు కూడా ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. బీజేపీ దీన్ని వాడుకొని ఎందుకు కొరకరాని కొయ్యగా రాహుల్ ను జనాల దృష్టిలో అభాసుపాలు చేశాయి.
దేశమంతా పాదయాత్ర చేసి తనను తాను నిరూపించుకున్నాడు రాహుల్ గాంధీ. జనాలతో మమేకంలో కాస్త పరిణతి కనబరిచాడు. తాజాగా పార్లమెంట్ కు హాజరైన రాహుల్ గాంధీ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. మోడీని, బీజేపీని డిఫెన్స్ లో పడేసింది. మోడీకి మాయని మచ్చగా మిగిలిన ‘అదానీ’ వ్యవహారంపై రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు బీజేపీకి బాగా తగిలాయి.
మోడీతో సంబంధాల వల్లే గౌతం అదానీ అనతికాలంలోనే ప్రపంచ కుబేరుడిగా ఎదిగాడంటూ రాహుల్ గాంధీ ఆధారాలతో సహా వ్యాఖ్యానించడం సంచలనమైంది. లోక్ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ ఈ సందర్భం చెప్పిన కొన్ని పచ్చి నిజాలు చర్చనీయాంశమయ్యాయి.
‘ఎయిర్ పోర్టుల నిర్వహణలో అనుభవం ఉన్నవారికే బాధ్యతలు అప్పగించాలన్న నిబంధనలు మోడీ మార్చాడు. ఎలాంటి అనుభవం లేని గౌతం అదానీ గ్రూప్ కోసం ఇలా మోడీ సర్కార్ చేసింది. ఏకంగా దేశంలోని ఆరు ఎయిర్ పోర్టులను అదానీకి కట్టబెట్టారు. అత్యంత లాభదాయకమైన విమానాశ్రయాల్లో ఒక్కటైన ముంబై ఎయిర్ పోర్టును అదానీకి అప్పగించారు. ఈ ఎయిర్ పోర్టును పట్టిన జీవీకే గ్రూప్ పై సీబీఐ, ఈడీలను ప్రయోగించారు’ అంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి.
ఆస్ట్రేలియాకు వెళ్లిన మోడీ అక్కడ కూడా లాబీయింగ్ చేసి కాంట్రాక్టులు ఇప్పించారని.. అదానీ గ్రూప్ కు ఎస్బీఐ నుంచి 1 బిలియన్ డాలర్ల రుణం ఇందుకోసం మంజూరు చేశారని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మోడీ బంగ్లాదేశ్ వెళ్లితే అక్కడ పవర్ డెవలప్ మెంట్ బోర్డు అదానీకి 25 ఏళ్ల కాంట్రాక్ట్ అప్పగించిందని.. ఇదేం మ్యాజిక్’ అంటూ రాహుల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ 20 ఏళ్లలో బీజేపీకి అదానీ ఎంతిచ్చారో తేల్చండి అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇలా రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే ఓవైపు కేంద్రమంత్రి రిజిజు అడ్డుకోవడం.. స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరాలు చెప్పడం చేస్తూ ఉండిపోయారు. రాహుల్ ప్రసంగానికి బీజేపీ ఉక్కిరిబిక్కిరి అయ్యింది.
