Telangana Budjet : ఇది ఎన్నికల సంవత్సరం.. పాత పథకాలకు నిధులు పెంచాలి. మళ్ళీ అధికారంలోకి రావాలి. కనుక కొత్త పథకాలు ప్రవేశపెట్టాలి.. సంక్షేమానికి పెద్దపీట వేయాలి.. ప్రజాకర్షణకు తివాచీ పరచాలి.. ఈసారి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఖమ్మం సభ ముగిసిన అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తన ఇంట్లో అధికారులతో మథనం జరుపుతున్నారు.. గత బడ్జెట్ తో పోలిస్తే ఈసారి ఏకంగా 40 వేల కోట్లకు పైగా పెంచేసి… 2023_24 ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల కోట్ల మేర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయన్నది అధికార వర్గాల సమాచారం.. ఈసారి గిరిజన బంధు వంటి కొత్త పథకానికి బడ్జెట్లో చోటు లభించబోతున్నట్టు తెలుస్తోంది.. అసలు దళిత బంధు నిధులనే విడుదల చేయని ప్రభుత్వం గిరిజన బంధు నిధులను ఎలా విడుదల చేస్తుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలవేళ ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టవచ్చన్న అభిప్రాయలూ వ్యక్తమవుతున్నాయి.. గిరిజన ఓటర్లు దూరం కావడం వల్లే ఎస్టీ రిజర్వుడు ఆదిలాబాద్ లోక్ సభ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకుందని, అందుకే ఈసారి గిరిజన బంధును అమల్లోకి తేవడం ద్వారా వారిని తమ వైపు తిప్పుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.

రుణమాఫీ ఏది
2018 ఎన్నికల సందర్భంగా లక్షలు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.. కానీ ఇంతవరకు ఆ హామీ నెరవేరలేదు. ఏటా కొంతమేర మాఫీ చేసుకుంటూ వస్తోంది.. మొదట 25 వేల లోపు రుణాలు మాఫీ చేసింది.. తర్వాత 50 వేల లోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ 37 వేల లోపు రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 75 వేల వరకు ఉన్న అన్ని రుణాలలో మాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ అది అమలుకు నోచుకోలేదు.. ఎన్నికల సంవత్సరం కాబట్టి లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ఆ మేరకు నిధులు కేటాయింపును ప్రభుత్వం చూపిస్తుందని అధికారులు అంటున్నారు.
ఇక మన ఊరు మనబడి పథకానికి సంబంధించి గత బడ్జెట్లో 3497 కోట్లను ప్రభుత్వం కేటాయించినప్పటికీ… నిధులు విడుదల కాలేదు.. అయినప్పటికీ రెండో దశ కింద బడ్జెట్లో నిధులు కేటాయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే సొంత జాగా ఉన్నవారు ఇల్లు నిర్మించుకుంటామంటే మూడు లక్షల ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని గత బడ్జెట్లో ప్రకటించింది.. ప్రతి నియోజకవర్గంలో మూడు వేల మందికి దీనిని వర్తింపజేయాలని, రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి అందించాలని నిర్ణయించింది. కానీ ఈ పథకం కూడా ముందుకు సాగలేదు.. అయినప్పటికీ కొత్త బడ్జెట్లో నిధులు కేటాయించబోతున్నట్లు సమాచారం. దళిత బంధుకు సంబంధించి 11,728 కోట్లు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు నయా పైసా ఖర్చు చేయలేదు. అయినప్పటికీ రాబోయే బడ్జెట్లో ఈ పథకానికి అంతే మొత్తాన్ని మంచి అవకాశం కల్పిస్తోంది.. మరోవైపు వయోపరిమితి తగ్గించిన నేపథ్యంలో పింఛన్లకు అనుగుణంగా ఈసారి బడ్జెట్ మరింత పెంచక తప్పదు.. రైతుబంధు పథకానికి ఎప్పటిలాగే 14,800 కోట్లు కేటాయించనుంది. ఇక మిగతా పథకాలకు కేటాయింపులు తప్పనిసరి.
పైసలు ఎలా
గత బడ్జెట్లో చాలా ప్రజా ఆకర్షక పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ నిధులు లేకపోవడంతో ప్రభుత్వం వాటిని పక్కన పెట్టింది.. మరోవైపు అప్పుల పై ఆంక్షలు విధించడంతో పలు పథకాలు ముందుకు సాగలేదు. 2022_ 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ₹2,56,958 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.. ఇందులో అప్పుల ద్వారా 53, 970 కోట్లు, కేంద్ర గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ ల ద్వారా 41,001 కోట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ డిసెంబర్ నాటికి 30 వేల కోట్లు మాత్రమే అప్పులు వచ్చాయి.. ఆంక్షల కారణంగా మరో 7,650 కోట్లు మాత్రమే రానున్నాయి.. నవంబర్ నాటికి వచ్చిన గ్రాంట్లు 6,623 కోట్లు మాత్రమే.. మిగిలిన నాలుగు నెలల్లో కొన్ని గ్రాంట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన అప్పులు, గ్రాంట్ల రూపంలో నలభై నాలుగు వేల కోట్ల వరకు లోటు ఏర్పడే అవకాశం ఉంది.. ప్రభుత్వం ప్రధానంగా ఆధారపడేది స్వీయ రాబడులపైనే.. వీటిపై ప్రభుత్వం భారీ పెరుగుదల ఉంటుందని అంచనా వేసినప్పటికీ… నవంబర్ నాటికి కాగ్ ప్రకటించిన రాబడులు 63.86 శాతమే. స్వీయ పన్ను రాబడుల కింద 1,26, 606 కోట్లు వస్తాయని అంచనా వేస్తే నవంబర్ నాటికి 80, 853 కోట్లు వచ్చాయి.. పన్నేతర రాబడుల కింద 25,421 కోట్లను అంచనా వేస్తే 9,138 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే పనులు, పన్నేతర రాబడుల కింద 90 వేల కోట్లు సమకురాయి.. అప్పులు, గ్రాంట్లు కలుపు కుంటే 1,26,623 కోట్లు గా తేలుతున్నది. మార్చి వరకు వచ్చే రాబడులను తీసుకుంటే ప్రభుత్వం అంచనా వేసిన 2,56,958 బడ్జెట్ కల నెరవేరడం సందేహమే. ఈసారి కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం భారీ బడ్జెట్ దిశగా అడుగులు వేస్తోంది.. ఎందుకో నిధులు ఎక్కడి నుంచి తెస్తారనే ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు..