Lakshmi Narasimha : మనం ఈరోజు బతుకుతున్న బతుకు ఎంతో మంది త్యాగాల ఫలితం. ఈ సమాజానికి మనం ఏదైనా చేయాలనుకుంటే అది మన బాధ్యత అవుతుంది. అంతేగానీ సేవ కాదు. ఇవి ఏదో తెలుగు సినిమా డైలాగులు కాదు. ఓ తాతమ్మ తన మనవడితో చెప్పిన మాటలు. తాతమ్మ మాటలు ఆ మనవడి మనస్సులో బలమైన ముద్ర వేశాయి. సిటీ నుంచి పల్లెబాట పట్టించాయి. భారమైన వ్యవసాయాన్ని అందరూ వదిలిపోతుంటే.. అతను భుజానికెత్తుకున్నాడు. పల్లెసీమలో సిరులు పండించేందుకు కంకణం కట్టుకున్నాడు. పల్లెల్లో సాగిలబడ్డ వ్యవసాయాన్ని నూతన సాంకేతికతతో ఉరకలుపెట్టించాడు.

లక్ష్మి నరసింహ ఇక్కుర్తి.. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మంచి జీతంతో జీవితం సాగిపోతోంది. చీకూచింత లేదు. ఉద్యోగంలో మంచి వృద్ధి ఉంది. అమెరికా వెళ్లేందుకు కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. ప్రయాణానికి అవసరమైన డాక్యుమెంట్స్ కోసం సొంతూరికి వచ్చాడు. లక్ష్మీ నరసింహ సొంతూరు గుంటూరు జిల్లాలోని యాజిలి. ఇంటికి రాగానే ఓ చేదువార్త విన్నాడు. ఈ మధ్య కాలంలో ఆరేడుగురు యువకులు డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదవశాత్తూ చనిపోయారని వాళ్ల అమ్మ చెప్పింది. వీరందరూ వేర్వేరు ప్రమాదాల్లో చనిపోయారని వాళ్ల అమ్మ చెప్పింది. ఊళ్లో పెద్దమనుషులు కూడా ఇదే విషయం చెప్పారు. దీంతో తన అమెరికా ప్రయాణం వాయిదా వేసుకున్నాడు. ఊరికి ఏదో చేయాలని నిశ్చయించుకున్నాడు.

వ్యవసాయం భారమైంది. రైతు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. గిట్టని వ్యవసాయాన్ని వదిలేసాడు. పొట్టకూటి కోసం ఊరొదిలి వెళ్లాడు. యాజిలి నుంచి వందలాది కుటుంబాలు ఊరొదిలాయి. పొట్టచేతపట్టుకుని దూరప్రాంతాలకు వెళ్లిపోయాయి. దీనికి ప్రధాన కారణం వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం. ఇది లక్ష్మినరసింహను ఆలోచింపజేసింది. వ్యవసాయం గిట్టుబాటైతే రైతు ఊరెందుకు వదులుతాడు అన్న ప్రశ్న పుట్టింది. ఆచార్య ఎన్జీరంగా యూనివర్శిటీ అధ్యాపకుల సాయంతో రైతులకు సాగు పై మెళుకువలు నేర్పించాలని ప్రయత్నించాడు.

సాగులో ఆరితేరిన రైతులు ల్యాప్ టాప్ లో వ్యవసాయంపై నేర్పడంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తమకు తెలియని విద్యా అంటూ నిట్టూర్చారు. దీంతో లక్ష్మీనరసింహ నిరాశకు గురయ్యాడు. కానీ పట్టుదల వదల్లేదు. ఎక్కడైతే రైతులు మంచి మెళుకువలతో వ్యవసాయాన్ని గిట్టుబాటు చేసుకుంటున్నారో అక్కడికి వెళ్లి చాలా విషయాలు నేర్చున్నాడు. పలు అంశాల పై క్షణ్ణంగా అధ్యయనం చేశాడు. తానే సొంతంగా వ్యవసాయం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. సాఫ్ట్వేర్ జాబ్ వదిలి పొలాల్లో వ్యవసాయం చేయడానికి దిగాడు.

సొంతంగా భూమి తీసుకుని సాగు మొదలుపెట్టాడు లక్ష్మీనరసింహ. ద్రాక్ష, దోస, మిరప వంటి పంటలు వేశాడు. నేల స్వభావం కారణంగా మొదట్లో దిగుబడి సరిగా రాలేదు. ఆ తర్వాత కొన్ని పద్దతులను అనుసరించి మంచి దిగుబడిని సాధించాడు. మిగిలిన రైతులను భాగస్వాముల్ని చేసి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. తనకున్న నాలెడ్జీని ఉపయోగించి రైతులు పండించే పంటను వినియోగదారులకు అందించేందుకు కృషి చేశాడు. యాజిలిలో పండించే రకరకాల పంటలను ప్రత్యక్షంగా కస్టమర్లకు అందించారు. యాజిలి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లో దాదాపు 400 మంది రైతులు ఉన్నారు. కరోనాతో లాక్ డౌన్ ఏర్పడిన సమయంలో ఈ రైతు సంస్థ 7 కోట్ల టర్నోవర్ సాధించిందంటే అతిశయోక్తికాదు.

వ్యవసాయ రంగంలో లక్ష్మీనరసింహ ఇక్కుర్తి చేస్తున్న సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది. అతని సేవలకు గాను రూరల్ అచీవర్ అవార్డును 2018లో ప్రధాని మోదీ చేతుల మీదుగా అందించింది. ఇటీవల ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్ షిప్ ప్రోగ్రాంలో పాల్గొనాలని అమెరికా నుంచి లక్ష్మీనరసింహ ఇక్కుర్తికి ఆహ్వానం అందింది. ఇదొక ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమానికి ఆహ్వానం రావడం లక్ష్మీనరసింహ కృషికి నిదర్శనం.

` మనం తినే తిండి ఎక్కడి నుంచి మన ప్లేట్ లోకి వస్తుందో మనకు తెలియాలి. అప్పుడే దాని విలువ తెలుస్తుంది. దానిని పండించే చేతుల కష్టం గురించి తెలిస్తేనే రైతుల పై గౌరవం పెరుగుతుంది ` అని లక్ష్మీనరసింహ ఇక్కుర్తి చెబుతారు. నిజమే మనం తినే తిండి ఎక్కడి నుంచి వస్తుందో ప్రస్తుత తరానికి తెలియదు. అదొక వస్తువుగానే కనిపిస్తోంది తప్ప దాని వెనుక కష్టం కనిపించదు. రైతుల కష్టాన్ని దళారీ వ్యవస్థ దోచుకుంటోంది. ప్రభుత్వ నియంత్రణ లోపం రైతుల పాలిట శాపంగా మారుతోంది . ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవడంలో తాత్సారం చేస్తున్నారు. ఊరికొక్క రైతు ఉత్పత్తి సంస్థలు రావాలి. తమ పంట తామే మార్కెట్లో అమ్మాలి. రైతు ఒక ఎంట్రప్రెన్యూర్ అవతారమెత్తితే గానీ బాగుపడడు.అదే లక్ష్మీనారాయణ నేర్పిన నీతి..