Pawan Kalyan Ippatam : గుంటూరు జిల్లా ఇప్పటంలో నిన్న మున్సిపల్ అధికారులు కూల్చిన ఇళ్లను జనసేనాని పవన్ కళ్యాణ్ ఈరోజు పరిశీలించారు. రోడ్డు విస్తరణ పేరుతో గతంలో జనసేన సభకు వ్యవసాయ భూములు ఇచ్చిన రైతుల ఇళ్లను కూల్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడా రోడ్లు వేయకుండా.. రాష్ట్రమంతా గుంతలతో ఉంటే.. ఇప్పటంలో రోడ్డు విస్తరణ పేరిట కూల్చడాన్ని కక్షసాధింపు చర్యగానే జనసేనాని పవన్ భావించారు. అందుకే హైదరాబాద్ నుంచి కదిలి వచ్చి నిరసన తెలిపారు. స్థానికుల ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసి బ్రేక్ వేయించిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ గ్రామంలో పర్యటించారు.

అంతకుముందు పవన్ ను అడ్డుకొని జనసేన కార్యాలయంలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ఇప్పటం బాధితులను కలిసేందుకు అనుమతించారు. కూల్చివేసిన ప్రతి ఇంటిని పరిశీలించిన పవన్ వారిని ఓదార్చారు. స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా అధికారుల తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు. ‘మార్చిలో మా సభకు భూమి ఇస్తే, ఏప్రిల్ లో ఇళ్లను కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే కక్షతోనే ఇళ్లను కూల్చారు. ఎమ్మెల్యే ఆర్కే ఇళ్లు పెదకాకానిలో కేవలం 15 అడుగుల రోడ్డే ఉందని.. అక్కడ రహదారి విస్తరణ లేదా? కనీసం మాట్లాడనీయకుండా ఆపడానికి మీరెవరు? కాకినాడ లేదా రాజమహేంద్రవరం రోడ్లు వెడల్పు చేయరా?’ అంటూ మండిపడ్డారు.

ఈ సందర్భంగా వైసీపీ నాయకులారా ఖబర్దార్ అంటూ పవన్ హెచ్చరించారు. ‘ఇలాగే చేస్తే పులివెందులలో మీ మీద నుంచి హైవే వేస్తాం.. అధికారంలోకి రాగానే ఇడుపుల పాయ మీద నుంచి హైవే పోనీస్తాం.. అన్నీ కూలగొడతాం అంటూ’ పవన్ హెచ్చరించారు. మా ఇళ్లు కూల్చారు.. మీ కూల్చివేత తథ్యమని పవన్ హెచ్చరించారు.
గుంతలు పూడ్చలేరు ఇళ్లను కూల్చుతారంటూ పవన్ నిప్పులు చెరిగారు. పోలీసులు కూడా మన సోదరులేనని.. వారికి చేతులు కట్టుకొని నిరసనలు చేపట్టండి అంటూ ప్రజలకు పవన్ పిలుపునిచ్చారు.