Rani TaaraDevi: ఢిల్లీలోని కుతుబ్ మినార్ మన దేశ చారిత్రక సంపదకు తార్కాణంగా ఇప్పటికీ నిలిచి ఉంది. 11వ శతాబ్ధంలో కుతుబిద్దన్ ఐబక్ నిర్మించిన ఈ స్తూపం ఇప్పటికీ ఢిల్లీలో చెక్కుచెదరకుండా సందర్శకులను ఆకర్షిస్తూనే ఉంది. నగరానికే తార్కాణంగా ఉంది. అయితే దాదాపు 75 ఏళ్ల క్రితం కపుర్తలాకు చెందిన ‘రాణి తారాదేవి’ తన రెండు పెంపుడు కుక్కలతో కలిసి కుతుబ్ మినార్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆమె ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? చరిత్రలో దాగిన విషాదాలపై ప్రత్యేక కథనం..

-రాణి తారాదేవి చెక్ రిపబ్లిక్ నివాసి
వాస్తవానికి చెక్ రిపబ్లిక్ కు చెందిన రాణి తారా దేవి అసలు పేరు ‘యూజీనియా మరియా గ్రోసుపోవై.’ ఆమె కపుర్తలా మహారాజ్ జగ్జిత్ సింగ్ ఆరవ భార్య. వీరిద్దరూ ఫ్రాన్స్‌లో కలుసుకున్నారు. మరియా తల్లిదండ్రులు నటులు.. క్రైస్తవ మతాన్ని నమ్మేవారు. మరియా అద్భుతంగా అందంగా ఉంటుంది. మహారాజ్ జగ్జీత్ సింగ్ యూరప్ పర్యటించినప్పుడు.. అతను ఆమె అందానికి ఆకర్షితుడయ్యాడు.ఈ క్రమంలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
– పెళ్లి తర్వాత తారా దేవి పేరు మారింది.
మారియా తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించిన మహారాజ్ పెళ్లికి ఒప్పించాడు. ఇందుకుగానూ లక్ష రూపాయల మొత్తాన్ని బహుమతిగా ఇచ్చారు. తల్లిదండ్రులు అంగీకరించిన తర్వాత యుజెనియా మారియా గ్రోసుపోవాయ్ 1942లో మహరాజ్ జగ్జిత్ సింగ్‌తో కలిసి భారతదేశానికి చేరుకున్నారు. కపుర్తలా చేరుకున్న తర్వాత, వారిద్దరూ సిక్కు ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమె కొత్త పేరు రాణి తారా దేవిగా మార్చబడింది.
రాణి తారా దేవి వివాహం తర్వాత అసంతృప్తిగా ఉంది.
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. రాణి తారా దేవి తన వివాహంతో సంతోషంగా లేరట.. దీనికి కారణం మహారాజ్‌కి ఆమెకు మధ్య ఉన్న వయస్సు తేడానే. మహారాజ్ ప్రశాంత స్వభావం గల వ్యక్తి. రాణి తారా దేవి యవ్వనంలో ఉండగా… మహారాజ్ వృద్ధాప్యంతో ఆమెను సరిగ్గా చూసుకోలేకపోయాడు. క్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.
– 1946 డిసెంబర్ 9న కుతుబ్ మినార్ కు చేరుకున్న తారాదేవి
1946లో రాణి తారా దేవి తన రెండు పెంపుడు కుక్కలు.. సిబ్బందితో ఢిల్లీ చేరుకుంది. దాదాపు నెల రోజుల పాటు ఢిల్లీలోని ఓ హోటల్‌లో బస చేసింది. 9 డిసెంబర్ 1946న ఆమె తన సిబ్బందితో కలిసి కుతుబ్ మినార్‌ని సందర్శించారు. ఆమె తన హ్యాండ్‌బ్యాగ్‌ని తన డ్రైవర్‌కి ఇచ్చి, రెండు పెంపుడు కుక్కలతో కలిసి కుతుబ్‌మినార్ పైకి షికారుకు వెళ్లింది.
– కుతుబ్ మినార్ నుంచి దూకి తారాదేవి ఆత్మహత్య
రాణి తారా దేవి రెండు పెంపుడు కుక్కలతో కుతుబ్ మినార్ ఎక్కాలని నిర్ణయించుకుంది. మెల్లగా మెట్లు ఎక్కి పైకి చేరి అక్కడ నుండి రెండు కుక్కలతో దూకింది. ఈ ఘటనలో రాణి తారా దేవి, ఆమె పెంపుడు కుక్కలు రెండూ చనిపోయాయి.
– 3 సంవత్సరాల తర్వాత మహారాజ్ జగ్జీత్ సింగ్ మరణించాడు
మహారాజ్ జగ్జిత్ సింగ్ కు ఈ విషయం తెలిసి అతను లోలోపల కృంగిపోయాడు. ఆ షాక్ ను తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే 3 సంవత్సరాల తర్వాత 1949 సంవత్సరంలో మరణించాడు. డిసెంబర్ 9న కుతుబ్ మినార్ నుంచి దూకిన రాణి తారా దేవి సంఘటనకు నేటితో 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ క్రమంలోనే కుతుబ్ మినార్ నుంచి దూకిన ఈ రాణి చరిత్ర మరుగునపడిపోయింది. తాజాగా అది వెలుగులోకి వచ్చింది.