Homeజాతీయ వార్తలుGujarat Eletions 2022 : రేపు గుజరాత్ తొలిదశ పోలింగ్: ఓటర్ల మొగ్గు ఏ పార్టీ...

Gujarat Eletions 2022 : రేపు గుజరాత్ తొలిదశ పోలింగ్: ఓటర్ల మొగ్గు ఏ పార్టీ వైపో?

Gujarat Eletions 2022 : మరోసారి కమలం అధికారాన్ని దక్కించుకుంటుందా? ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ మాదిరే ప్రభావం చూపుతోందా? హస్తం తన పూర్వ వైభవాన్ని చాటుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానం గురువారం ఈవీఎం ల లో నమోదవుతుంది. దక్షిణ గుజరాత్, కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో గురువారం మొదటి దశ పోలింగ్ జరుగుతుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్ర భద్రత దళాలు ప్రత్యేకంగా పహారా కాస్తున్నాయి.

పోటీ ఎలా ఉందంటే

ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రధాన పోటీ దారులుగా ఉన్నాయి. కానీ ఈసారి తెరపైకి ఆప్ వచ్చింది. పోటాపోటీగా ప్రచారం చేసింది. భారతీయ జనతా పార్టీకి పేటెంట్ రైట్ ఉన్న హిందుత్వ ఎజెండాను తలపైకి ఎత్తుకుంది. అంతేకాదు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ను ప్రచారంలోకి దింపింది. ఢిల్లీ మోడల్ ని విస్తృతంగా ప్రచారం చేసింది. అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు విరివిగా అమలు చేస్తామని ప్రకటించింది. ఫలితంగా పట్టణ ప్రాంత ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది.. అయితే బిజెపి మాత్రం తన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే అని ప్రచారం చేసింది.

రాహుల్ గాంధీ లేకుండానే..

ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫునుంచి రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. కానీ ఈసారి గుజరాత్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ లేకుండానే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. ఖామ్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు గుజరాత్ రాష్ట్రాన్ని తాము ఎలా అభివృద్ధి చేశామో ఓటర్లకు అర్థమయ్యేలా చెప్పింది. 2002 నుంచి 2017 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన స్థానాలను, ఓటు బ్యాంకు ను పెంచుకుంటూ వస్తోంది.. అయితే ఈసారి అధికారం మాదే అని ధీమా వ్యక్తం చేస్తోంది.

భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే

ప్రధానమంత్రి అయినప్పటికీ… నరేంద్ర మోడీ గతంలో ఎన్నడూ లేనివిధంగా కాలికి బలపం కట్టుకుని గుజరాత్ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేశారు.. లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.. వేదాంత ఫోక్స్ కాన్ చిప్ తయారీ కేంద్రం నుంచి గిఫ్ట్ సిటిల వరకు గుజరాత్ రాష్ట్రానికి ఎడాపెడా వరాలు కురిపించారు. గుజరాత్ అభివృద్ధి ప్రధాతను నేనే అని స్వయంగా చెప్పుకున్నారు. మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా విస్తృతంగా ప్రచారం చేశారు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా వంటి వారు గుజరాత్ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేశారు.

క్షేత్రస్థాయిలో ఇలా

గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణ ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు.. చదువుకున్న యువకులను ఆకర్షించారు.. అయితే బిజెపి మాత్రం పారిశ్రామిక ప్రాంతాల్లో ఓట్లు తమకే పడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నది.. అయితే గత ఎన్నికల్లో పాటి దార్ల ఉద్యమం భారీగా జరిగింది.. అప్పుడు చాలా వరకు సీట్లను బిజెపి కోల్పోయింది.. అయితే ఈసారి పాటిదారులు తమవైపే ఉన్నారు కాబట్టి.. విజయం సాధిస్తామని బిజెపి ధీమా వ్యక్తం చేస్తోంది.. అయితే డిసెంబర్ ఐదో తేదీన రెండో విడత ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎవరు విజయం సాధిస్తారో ఒక అంచనాకు రాగలరు రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version