KA Paul : మునుగోడు ఉప ఎన్నికల వేళ అంతటి హీట్ లోనూ నియోజకవర్గ ప్రజలకు సీరియస్ కామెడీ పంచాడు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్. ఆయన రాజకీయ కామెడీకి జనాలు, ఇతర పార్టీ నేతలందరూ ఫిదా అయిపోయారు. నవ్వుల్లో విహరించారు. ఓ రోజు నడిరోడ్డుపై ఐటెం సాంగ్ కు డ్యాన్స్ చేయడం.. చిన్న పిల్లలతో కలిసి పిల్లాడిలా కలిసి అల్లరి చేయడం.. రైతులా మారి పొలాల్లోకి వెళ్లి పంట కోయడం.. ఇలా ఒక్కటేమిటీ కేఏ పాల్ వేశాలకు నవ్వులు పూశాయి.

మునుగోడు ఉప ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచిన కేఏ పాల్ చేసిన కామెడీ అందరికీ ఎంటర్ టైన్ మెంట్ పంచింది. తనదైన శైలిలో కామెంట్లు, హావభావాలతో వార్తల్లో నిలిచారు.
ఈరోజు మునుగోడు ఉప ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాలను పరిశీలించడానికి వచ్చినప్పుడు కూడా అందరి అభ్యర్థుల కంటే కూడా కేఏ పాల్ విభిన్నంగా కనిపించారు. ఏకంగా చేతికున్న 12 వేళ్లకు 12 బంగారు ఉంగరాలు తగిలించుకున్నాడు. అది సెంటిమెంట్ నో లేక మరేంటో కానీ అన్నేసి ఉంగరాలు పెట్టుకొని పోలింగ్ కేంద్రాల్లో హడావుడి చేశారు.
నియోజకవర్గంలోని 100 పోలింగ్ కేంద్రాలను చుట్టి రావాలని డిసైడ్ అయ్యి పోలింగ్ కేంద్రాల వద్ద పరుగులు పెట్టిన కేఏ పాల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
కేఏ పాల్ కు మునుగోడు ఎన్నికల్లో కేటాయించిన గుర్తు ‘ఉంగరం’ అందుకే ఆయన తన రెండు చేతులకున్న 12 వేళ్లకు బంగారు ఉంగరాలు ధరించి పోలింగ్ కేంద్రాల్లో తిరిగారు. దీనిపైనే మీడియా ప్రశ్నించగా ఆసక్తికరంగా స్పందించారు. ‘టీఆర్ఎస్ గుర్తు కారు అని వాళ్లంతా 30వేల కార్లలో వస్తే.. తన గుర్తు ఉంగరం పెట్టుకొని వస్తే తప్పేంటని’ పాల్ ఎదురు ప్రశ్నించారు. మొత్తానికి పాల్ పోలింగ్ వేళ కూడా కామెడీ చేస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు.