
దేశంలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 50,000 రూపాయలకు అటూఇటుగా ఉంది. గత కొన్ని రోజులుగా బంగారం ధర తగ్గుతుండగా పసిడి ధర మరింత తగ్గితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ ప్రాంతంలోని ప్రజలకు మాత్రం ఉచితంగా బంగారం లభిస్తోంది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో ఒక బంగారు కొండ వెలుగులోకి వచ్చింది. ఆ కొండను తవ్వే కొద్దీ బంగారం వస్తుండటం గమనార్హం.
కొండంతా బంగారం ఉందని తెలియడంతో గ్రామస్తులు పెద్దపెద్ద సంచుల్లో బంగారాన్ని తవ్వుకుని ఇంటికి తెచ్చుకుంటున్నారు. సౌత్ కివు ప్రావిన్స్, లుహిహిలో ఉన్న కొండ దగ్గర జనం బారులు తీరారు. ఆ కొండ మట్టిలో 60 శాతం నుంచి 90 శాతం వరకు బంగారం ఉందని సమాచారం. కొండను ప్రజలు తవ్వుకుంటున్న విషయం కాంగో ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆ దేశ ప్రభుత్వం ప్రజలు బంగారాన్ని తవ్వుకోకుండా ఆంక్షలు విధించింది.
అయితే ప్రభుత్వ ఆంక్షలను స్థానిక ప్రజలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కలప, వజ్రాలు, ఖనిజాలు వంటి సహజ నిక్షేపాలు, బంగారం నిక్షేపాలకు కాంగో ప్రసిద్ధి చెందింది. అక్కడి ప్రజలు బేసిక్ టూల్స్ తోనే విలువైన ఖనిజాలు బయటకు తీస్తారు. టింబర్, వజ్రాలు, మినరల్స్ లాంటివి ఇక్కడ పుష్కలంగా లభిస్తాయి. కాంగోలో ప్రజలు బంగారం తవ్వుకుంటున్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
లక్షల విలువ చేసే బంగారం లుహిహి కొండ దగ్గర నివశిస్తున్న ప్రజల సొంతమైంది. ప్రజలు తవ్వుకున్న బంగారం విషయంలో అక్కడి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. అక్కడి ప్రజలు పెద్ద, పెద్ద సంచుల్లో బంగారాన్ని తవ్వుకొని ఇంటికి తెచ్చుకుంటున్న దృశ్యాలను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.