
ప్రస్తుత కాలంలో సరైన ఆహారపు అలవాట్లను అలవరచుకున్నా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఒకవేళ విషపూరిత ఆహారం తింటే మాత్రం ప్రజలు ఆస్పత్రులలో చేరాల్సి వస్తుంది. కొంతమంది వ్యాపారులు లాభం కోసం చేసే పనుల వల్ల ప్రజల ప్రాణాలే ప్రమాదంలో పడుతున్నాయి. చేపలు పెంచేవాళ్లు చేపలకు ఆరోగ్యకరమైన మేత వేసి పెంచాలి. అలా కాకుండా కుళ్లిన కోళ్ల మాంసం, పశు వ్యర్థాలు వేసి పెంచితే మాత్రం ఆ చేపలు తిన్నవాళ్లు వ్యాధుల బారిన పడతారు.
అయితే వ్యాపారులు మాత్రం లక్షల్లో లాభాలు పొందడానికి కుళ్లిన కోళ్ల మాంసం, పశు వ్యర్థాలు తిని పెరిగిన విషపూరిత చేపలను విక్రయిస్తున్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని పొలంపెల్లి గ్రామం దగ్గర ఉన్న చికెన్ దుకాణాల నుంచి కుళ్లిన కోళ్ల మాంసంను సేకరించి చేపల పెంపకందారులు చేపలకు దాణాగా ఇస్తున్నారని తెలుస్తోంది. ఆ చేపలను గోదావరి నదిలో పట్టిన చేపలు అని చెప్పి వ్యాపారులు ఎక్కువ మొత్తానికి విక్రయిస్తున్నారు.
నిజానికి చేపలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ ఇలా పశు వ్యర్థాలు, కుళ్లిన కోళ్ల మాంసంతో పెరిగిన చేపలు తింటే మాత్రం ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. చేపలకు ఆరోగ్యకరమైన జొన్న, మొక్కజొన్న పిండి వేస్తే మాత్రమే అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. అధికారులు ఈ విషపూరిత చేపలపై దృష్టి పెట్టాల్సి ఉంది. గతంలో కూడా పశువుల వ్యర్థాలను చేపలకు వేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
చేపల అక్రమ పెంపకందార్లపై అధికారులు దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.