
కోటా శ్రీనివాసరావు.. తెలుగు తెరపై ఉత్తమ విలన్, నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా. ఒకప్పుడు తెలుగువారికే సినిమాల్లో కీలకమైన పాత్రలు దక్కేవి. కానీ ఇప్పుడు పరభాష నటులను నెత్తిన పెట్టుకుంటూ తెలుగు నటులను పక్కనపెడుతున్నారు.ఈ కోవలోనే కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం లాంటి వాళ్లకు అవకాశాలు రావడం లేదు.
సామాన్యుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు కోటా శ్రీనివాసరావు. చిరంజీవి హీరోగా నటించిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో కోటా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగులోనే కాదు.. దక్షిణాది భాషల్లోనూ కీలక పాత్రల్లో కోటా నటించారు. తనలోని గొప్ప నటుడిని ఆవిష్కరించారు.
అయితే తాజాగా తెలుగులోని దిగ్గజ నటులకు అవకాశాలు తగ్గిపోయాయి. కొత్తవారు, జబర్ధస్త్ ఆర్టిస్టులతోనే సినిమాలు నడుస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ తో ఏడాది పాటు సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమయ్యారు. కోటా కూడా ఏడాది పాటు బోరింగ్ గా ఫీలయ్యాడని.. ఈ క్రమంలోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్, వినాయక్ లకు తాను ఫోన్ చేసి అవకాశాలు ఇప్పించాలని కోరానని కోటా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘పవన్ ’ హీరోగా రానున్న సినిమాలోనూ తాను ఓ పాత్ర పోషిస్తున్నట్టు కోటా చెప్పారు. చాలా రోజుల తర్వాత పవన్ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని.. అవకాశాలు వస్తే తాను నటించడానికి సిద్ధమని ప్రకటించారు.