![]()
viral content vloggers : యూట్యూబ్లో వీక్షకుల సంఖ్యను పెంచుకోవడానికి, తమ వీడియోలను మరింత వైరల్ చేయడానికి చిత్రవిచిత్రమైన విన్యాసాలకు పాల్పడుతున్నారు పలువురు యూట్యూబర్లు. ముఖ్యంగా కొంతమంది చిన్నారులు లక్ష్యంగా చేసుకుని వీడియోలు చేస్తుండడం, కొన్నిసార్లు ఆది వారి జీవితాలకు ప్రమాదాన్ని కలిగించే స్థాయిలో ఉంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్య కాలంలో అలా వైరల్ అయిన కొన్ని వీడియోలను చూస్తుంటే ఆందోళన కలిగించక మానదు.
ప్రముఖ యూట్యూబర్ రైడర్ సల్మాన్ ఛానల్ నుంచి వచ్చిన వీడియో కంటెంట్ చూస్తే ఆందోళన కలిగించే రీతిలో కనిపించింది. ఈ వీడియోలో డ్రైవర్ సుమారు 12 ఏళ్ల వయసు ఉన్న అబ్బాయికి లిఫ్ట్ ఇచ్చాడు. ఆ కుర్రాడు కారులోకి వచ్చిన తర్వాత ఒకరికి కాల్ చేసి.. ఒక అబ్బాయి దొరికాడని.. మంచిగా ఉన్నాడు అని చెబుతాడు. అదే సమయంలో వెనుక సీట్లో కూర్చున్న డ్రైవర్ స్నేహితులు సిరంజి బయటికి తీస్తారు. భయపడిన ఆ పిల్లవాడు వారిని ఆపమని వేడుకుంటాడు. సహాయం కోసం అరుస్తూ కదులుతున్న వాహనం నుంచి దూకడానికి ప్రయత్నిస్తాడు. యూట్యూబ్ నుండి ఈ వీడియో తొలగించినప్పటికీ.. క్లిప్పింగ్లు మాత్రం ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ తరహా వీడియోలకు 50 వేల నుంచి 5 లక్షల వరకు వ్యూస్ ఉండడం గమనార్హం. ఇదే తరహా కంటెంట్తో పదుల సంఖ్యలో వీడియోలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది.
కాకినాడ ఫ్రాంక్ స్టర్ ఛానల్ లో మరో వీడియో..
అలాగే, కాకినాడ ఫ్రాంక్ స్టర్ చానల్లో పెట్టినవో వీడియో మరింత ఆందోళన కలిగించింది. ఈ వీడియోలో కుర్రాడికి లిఫ్ట్ ఇచ్చిన కారు డ్రైవర్.. కారులో కూర్చున్న పిల్లాడి చొక్కా పైకి ఎత్తే సీన్ ఉంటుంది. డ్రైవర్ చేస్తున్న చర్యలకు భయభ్రాంతులకు గురైన పిల్లాడు.. సెక్స్ ట్రాఫికింగ్ మరియు భిక్షాటనలోకి నెట్టడం గురించి మాట్లాడాడు. ఇలా పిల్లలను అడ్డం పెట్టుకుని వీడియోలు చేయించడం, చేయడం పట్ల ఆందోళన కలిగిస్తోంది.

పోలీసులు ఏం చెబుతున్నారంటే..
పిల్లలను కిడ్నాప్ చేయడం వంటి ఫ్రాంక్ వీడియోలు కనిపించడం ఇబ్బందికరమైన అంశమని, ఈ తరహా వీడియోలు చేసేటప్పుడు పిల్లలు , తల్లిదండ్రుల సమ్మతి కీలకమని పోలీసులు చెబుతున్నారు. కొన్నిసార్లు పిల్లలు అటువంటి వీడియోలో పాల్గొనేందుకు అంగీకరిస్తారు. సమ్మతి ఉన్నప్పటికీ అటువంటి వీడియోలు తీయడాన్ని తప్పనిసరిగా నిరాకరించాలి. ఇది అవగాహన కోసం మాత్రమే చేసిన వీడియోలుగా భావించి.. పిల్లలు వారి తల్లిదండ్రులు వద్ద నుంచి అనుమతి తీసుకోకపోతే మాత్రం జువైనల్ జస్టిస్, ఐపీసీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ తరహా వీడియోలు మరిన్ని నేరాలకు అవకాశాన్ని కల్పిస్తాయి అన్న విషయాన్ని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా కాకినాడలో జరిగిన ఘటనకు సంబంధించి అప్రమత్తమైన పోలీసులు.. ఇటువంటి వీడియోలను వెరిఫై చేసేందుకు ఐటి కోర్ టీంకు బాధ్యతలను అప్పగించామని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని కాకినాడ ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు తెలిపారు.
రాష్ట్రస్థాయిలో మరింత పరిశీలన అవసరం..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా వీడియోలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో మరింత పరిశీలన అవసరమని బాలల హక్కుల కార్యకర్తలు అంటున్నారు. వీడియోలు తల్లిదండ్రులు, పిల్లలు సమ్మతి లేకుండా చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. పిల్లల భయాలను ఆసరాగా చేసుకుని డబ్బును ఆర్జించే ఇలా వీడియోలను నిషేధించాలని.. చేయకుండా చూడాలని కోరుతున్నారు.. అటువంటి యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలి అని బాలల హక్కుల కార్యకర్త హిమబిందు డిమాండ్ చేశారు.
పోస్ట్ ట్రోమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ..
ఈ తరహా ఘటనలు పిల్లలను లోతైన పోస్టు ప్రామాటిక్ ట్రస్ట్ డిజార్డర్ కు గురిచేస్తుందని వారి తప్పు లేకుండా జీవితాంతం చాలా అపరాధ భావంతో బాధపడాల్సి వస్తుందని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులోని హెల్త్ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ మీనా హరిహరన్ చెప్పారు. అటువంటి పిల్లలు సైకలాజికల్ గా డిప్రెషన్ లోకి వెళ్లొచ్చు. క్రూరంగా తయారు కావచ్చు. ఇది దుర్వినియోగానికి కూడా కారణం అవుతుంది. వారిని తక్షణమే సపోర్ట్ గ్రూప్ కు అనుసంధానం చేయాలి ,ఈ మనస్తత్వ గాయాన్ని ఎలా నిర్వహించాలో నేర్పించాలని ఆమె తెలిపారు.