CM Jagan: ఉద్యోగుల సమ్మెలు.. ఎమ్మెల్యేల రాజీనామాలు.. జగన్ సర్కార్ కు కష్టాలు

గత నెల రోజులుగా అంగన్వాడీ కార్మికులు రోడ్లు పైకి వచ్చి పోరాడుతున్నారు. ఆశా కార్యకర్తల సైతం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పారిశుద్ధ్య పనులు నిలిపివేసి మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు.

Written By: Dharma, Updated On : January 9, 2024 8:40 am

CM Jagan

Follow us on

CM Jagan: ఎన్నికల సమీపిస్తున్న కొలది జగన్ సర్కార్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. సొంత పార్టీ నేతల నుంచి రాజీనామాలు, ప్రభుత్వ ఉద్యోగుల నుండి సమ్మె నోటీసులు, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో జగన్ ఈసారి గెలుపొందుతారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతుండడంతో.. నిన్నటి వరకు జగన్ ను ఆకాశానికి ఎత్తేసిన నేతలు సైతం పార్టీని వీడుతున్నారు. విమర్శలు చేస్తున్నారు. తమను బలి పశువులుగా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత నెల రోజులుగా అంగన్వాడీ కార్మికులు రోడ్లు పైకి వచ్చి పోరాడుతున్నారు. ఆశా కార్యకర్తల సైతం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పారిశుద్ధ్య పనులు నిలిపివేసి మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. మరోవైపు 104, 108 ఉద్యోగులు సైతం సమ్మెకు సిద్ధమవుతున్నారు. సక్రమంగా వేతనాలు చెల్లించకపోవడం, ఉద్యోగ భద్రత కల్పించకపోవడం వంటి కారణాలు చూపుతూ సమ్మెకు దిగుతున్నారు. ఈనెల 23 నుంచి సమ్మె చేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ సీఈఓ కు నోటీసుల అందించారు. ఈ రెండు విభాగాల ఉద్యోగుల సమ్మెబాట పడితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వక మానవు. ఇప్పటికే జగన్ సర్కార్ కు ప్రైవేట్ సైన్యంగా భావిస్తున్న వాలంటీర్లు కూడా వేతనాలు పెంచాలంటూ సమ్మె అస్త్రాన్ని సంధించిన సంగతి తెలిసిందే.

మరోవైపు పెద్ద ఎత్తున నాయకులు వైసీపీని వీడుతున్నారు. టికెట్లు నిరాకరించడంతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు ఉద్యోగుల సమ్మె నోటీసులు, మరోవైపు ఎమ్మెల్యేల రాజీనామాలతో జగన్ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. రాష్ట్రంలో 90 శాతం ప్రజలకు మేలు చేశామని.. ఆ కుటుంబాలన్నీ సంతోషంగా ఉన్నాయని.. జగన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని నిన్నటి వరకు ధీమా నడిచింది. కానీ పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వానికి ఆశలు అడుగంటుతున్నాయి. మరోసారి జగన్ అధికారంలోకి రావడం అనుమానమేనని తేలుతోంది.