Women Voters : ఏపీలో రాజ్యాధికారం దక్కాలంటే ఇక పార్టీలు మహిళలను అడుక్కోవాల్సిందే.. ఎందుకంటే ఏపీలో గెలుపును నిర్ధేశించేది మహిళలే.. మహిళలకే ఏపీకి మహారాణులు.. ఏపీ జనాభా లెక్కల్లో ఇప్పుడు మహిళా ఓటర్లే అత్యధికంగా ఉండడం విశేషం. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వాన్ని నిర్ణయించే శక్తి కూడా మహిళలకే వచ్చింది. అంటే ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. ఏ పార్టీని ఓడించాలన్నా మహిళలే నిర్ణయించే పవర్ ఉంది. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. ఇందులో కొంత మంది పురుషుల ఓట్లను తొలగించింది. దీంతో మహిళా ఓటర్లు విపరీతంగా పెరిగారు. ఇదే సమయంలో మహిళల్లోనూ రాజకీయ పరిణతి పెరుగుతుండడంతో ఓటు నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

రాష్ట్రంలో తాజాగా ఎన్నికల సంఘం ఓటరు జాబితాను ప్రకటించింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,07, 06,804 మంది ఓటర్లున్నారు. ప్రత్యేక సవరణ చేపట్టిన అనంతరం ఇందులో కొత్తగా 1,69,916 మందిని జాబితాలో చేర్చింది. 1,40,372 మందిని తొలగించింది. తుది జాబితా ప్రకారం మొత్తం ఓటర్లలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు 4,62,880 మంది ఎక్కువగా ఉన్నారు. దీంతో తాజాగా రాష్ట్ర ఓటర్లు 4,07,36,279 మందిగా తేల్చారు. మొత్తం 13 జిల్లాల్లో 9 జిల్లాల్లో ఓటర్లు కొత్తగా నమోదు చేసుకున్నవారున్నారు. నాలుగు జిల్లాలో తగ్గుదల ఉన్నట్లు గుర్తించారు.
అత్యధికంగా ఓటర్లు ఉన్న జిల్లాగా తూర్పుగోదావరి నిలవగా, ఆ తరువాతి స్థానంలో గుంటూరు,విశాఖ, కృష్ణ జిల్లాలు ఉన్నాయి. అలాగే తక్కువ ఓటర్లు ఉన్న జిల్లాలను చూస్తే విజయనగరం, కడప, శ్రీకాకుళం, నెల్లూరు ఉన్నాయి. కాగా మొత్తం జిల్లాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 17,343 మంది ఉండగా.. ప్రకాశం 8,268, విశాఖపట్నంలో 7,897 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. అతి తక్కువ ఓటర్లు ఉన్నది నెల్లూరు జిల్లాగా తేలింది.. ఇక విశాఖట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 3,29,669 మంది ఓటర్లు ఉన్నారు. గాజువాకలో 3,29,540 మంది, కర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో 3,11,272 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
2019 సాధారణ ఎన్నికల ఓటర్ల జాబితాతో పోలిస్తే అదనంగా 13,85, 239 మంది ఓటర్లు పెరిగారు. 2019లో 3,93,51,040 మంది ఉండగా ప్రత్యేక సవరణ ద్వారా 2022లో 4,07,36,279కి చేరింది. ఇందులో విదేశీ ఓటర్లు 7,033, సర్వీసు ఓట్లు 67,935 ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో ప్రతి వెయ్యి మందికి 743 మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు. ప్రతి వెయ్యి మంది పురుషులకు 1,026 మంది మహిలా ఓటర్లు ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్లు ఉండి ఓటు హక్కును వినియోగించుకునే యువ ఓటర్ల సంఖ్య 2,07,893గా ఉంది. 1,500 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రం ఉండగా కొత్తగా 33 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికాకరి కె. విజయానంద్ తెలిపారు.
ఇక రాష్ట్రంలో మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారు. ఒక్క శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలో మినహా మిగిలిన 11 జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో సర్వీసు ఓటర్లతో కలిపి మొత్తం ఓటర్ల మహిళా ఓటర్ల సంఖ్య 4,07,36,279 ఉన్నారు. వీరిలో 4,071 థర్డ్ జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు.తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 43,45,322 మంది ఓటర్లు ఉన్నారు. మహిళ్లలో ఓటుపై అవగాహన పెరుగుతుండడంతో పాటు రాజకీయ చైతన్యం రావడంతో యువతలు ఓటు హక్కు వినియోగించుకోవడంపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
దీన్ని ఏపీలో ప్రభుత్వాన్ని ఉంచాలన్నా.. దించాలన్నా మహిళలే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. వారిని ప్రసన్నం చేసుకుంటేనే వచ్చే ఎన్నికల్లో గెలుపు. అందుకే దిగిపోయే ముందు చంద్రబాబు ‘పసుపు కుంకుమ’ పథకం పెట్టారు. ఇక జగన్ మధ్యపాన నిషేధం వల విసిరారు. అమ్మఒడి లాంటి పథకాలు పెట్టారు. ఇప్పుడు మహిళలే మరింత మంది పెరగడంతో ఏపీలో అధికారం దక్కాలంటే వారిని పార్టీలు శరణు వేడాల్సిందే..