Hyderabad Capital: ‘హైదరాబాద్ ఏపీ రాజధాని’ అని ఏపీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ ఫీల్ అవుతున్నారు. కేవలం ఆయన మాత్రమే అలా అనుకుంటున్నారు. ఏపీ ప్రజలు అసలు హైదరాబాద్ మా రాజధాని అన్న విషయాన్ని ఎప్పుడో మరిచిపోయారు. తెలంగాణ వారైతే హైదరాబాద్ కేవలం మా రాజధాని అని మాత్రమే అని ఖరాఖండీగా చెబుతున్నారు. అందరూ మరిచిపోయిన హైదరాబాద్ గురించి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పలుకులు ఇటీవల వైరల్ అయ్యాయి. ‘2024 వరకూ ఏపీ రాజధాని హైదరాబాద్ యే కదా?’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు నవ్వుల పాలయ్యాయి. మంత్రి సత్యనారాయణ ఏపీ రాజధానిగా హైదరాబాద్ ను భావిస్తున్నా ఏపీ ప్రజలు ఎవరూ అలా ఫీలవ్వడం లేదన్న విషయాన్ని గుర్తెరగాలి. ఎందుకంటే హైదరాబాద్ ను ఎప్పుడో తెలంగాణ సీఎం కేసీఆర్ టేకోవర్ చేసేసి నాటి సీఎం చంద్రబాబును ‘ఓటుకు నోటు’ కేసులో ఇరికించేసి అమరావతికి సాగనంపారు.

ఇక జగన్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పై ఉన్న ‘ప్రేమతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం’తో ఏపీకి కేటాయించిన సెక్రటేరియట్ భవనాలు, హైదరాబాద్ లోని ఉమ్మడి ఆస్తులు, కేసీఆర్ కోరిన స్థలాలు, భవనాలు అన్నింటిని ఇచ్చేశారు. ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడంలో కేసీఆర్ చేసిన ‘సహకారానికి’ కృతజ్ఞతగా వీటిని ఇచ్చేశారని రాజకీయవర్గాల్లో ఓ టాక్ నడిచింది. దీంతో ఎంచక్కా ఇప్పుడు కేసీఆర్ పాత సచివాలయాన్ని కూల్చేసి అక్కడ కొత్త సచివాలయం కట్టేస్తున్నారు. ఏపీకి కేటాయించిన సచివాలయాన్ని ఆయన ఆక్రమించేశారు.
ఇక ఉమ్మడి ఆస్తులుగా విభజించిన హైదరాబాద్ లోని విలువైన భవనాలు, స్థలాలు అన్నింటిని తెలంగాణ ప్రభుత్వమే అనుభవిస్తోంది. ఏపీకి రూపాయి చెల్లించడం లేదు. అప్పుల్లోనూ భాగస్వామ్యం అవ్వడం లేదని స్వయంగా ఇటీవల జగన్ కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. అయినా కూడా మంత్రి బొత్స సత్యానారాయణ ఇంకా హైదరాబాదే 2024 వరకూ ఏపీకి రాజధాని అంటూ బాంబు పేల్చడం బూమరాంగ్ అయ్యింది. అమరావతి, హైదరాబాద్ అని రెండు రాజధానులు లేవని..త మ ప్రభుత్వం ప్రకారం అమరావతి అనేది శాసన రాజధాని మాత్రమేనని బొత్స అనడం రాజకీయ దుమారం రేపింది.
శివరామకృష్ణ కమిటీ హైదరాబాద్ నే ఉమ్మడి రాజధానిగా పేర్కొందని.. ఈ మేరకు విభజన చట్టం కూడా చేశారని.. పార్లమెంట్ ఆమోదించడంతో 2024 వరకూ ఏపీకి హైదరాబాదే రాజధాని అని బొత్స మాటలు ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఓవైపు ఏపీకి రాజధాని లేక.. నోటిఫై చేయలేక అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. కేంద్ర సంస్థలు పెట్టలేకపోతోంది. నిధులు లేక అమరావతి పడకేసింది. జగన్ ఏమో మూడు రాజధానులు అంటూ అమరావతిని గాలికొదిలేశాడు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రాజధాని లేని ఏపీ విషయంలో బొత్స ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టు ఏపీకి రాజధాని హైదరాబాద్ అనడం ఏపీ ప్రజలను, నేతలను, ప్రతిపక్షాలను షాక్ కు గురిచేసింది.
హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణలో ఇమిడిపోయింది. కేసీఆర్ హైదరాబాద్ ను ఓన్ చేసుకొని భారీగా పెట్టుబడులు చేస్తూ అక్కడ ఈగ వాలకుండా కాపు కాస్తున్నాడు. సచివాలయ భవనాలు ఏపీ నుంచి తీసేసుకున్నాడు. కరోనా వేళ ఏపీ నుంచి వచ్చే కరోనా రోగులను రానీయలేదు. సరిహద్దుల్లోనే ఏపీ అంబులెన్సులను ఆపేసి మరీ సరిహద్దులు మూసివేశాడు. ఇన్ని చేసినా కూడా.. ఏపీ వారిని తెలంగాణలో ఎంట్రీ ఇవ్వకుండా.. ఆంక్షలు పెట్టి అసలు పక్క దేశంలాగా ఏపీ ని కేసీఆర్ ట్రీట్ చేస్తున్నారు. ఏపీ ప్రజలు తెలంగాణలో వివక్షకు గురైనట్టే కరోనా టైంలో ఉన్నారు. ఇంతగా హైదరాబాద్ తెలంగాణ సొంతమైంది. వారిదే అధికారం నడుస్తోంది. అస్సలు అధికారాలు లేని హైదరాబాద్ పై బొత్స వ్యాఖ్యలు నవ్వుల పాలయ్యాయి. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై బొత్స వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ ప్రజలను మేధావులను విస్మయానికి గురిచేశాయి. ఆంధ్ర రాష్ట్రం పట్ల వైసీపీ మంత్రులు, ప్రభుత్వం ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారో ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.