Kumari Aunty: కుమారి ఆంటీ.. నెట్ ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ

వాస్తవానికి నెట్ ఫ్లిక్స్ ఇటీవల కాలంలో కేరళ రాష్ట్రంలో ఆరు హత్యలు చేసిన ఓ మహిళపై డాక్యుమెంటరీ తీసింది. అది ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది.

Written By: Anabothula Bhaskar, Updated On : February 6, 2024 3:32 pm

Kumari Aunty

Follow us on

Kumari Aunty: సోషల్ మీడియా వల్ల ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఫేమస్ అవుతున్నారో తెలియడం లేదు. అలా ఇటీవలి కాలంలో ఫేమస్ అయిన వారిలో కుమారి ఆంటీ ఒకరు. మాదాపూర్ ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఎక్కువగా విస్తరించి ఉన్న ఏరియాలో ఆమె తన ఆహార వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాపారం ఆమె కొనసాగిస్తున్నప్పటికీ.. ఎవరో ఒక ఔత్సాహికుడు ఆమె సాగిస్తున్న ఆహార వ్యాపారానికి సంబంధించి చిన్న వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది దెబ్బకు చర్చనీయాంశం అయిపోయింది. యూట్యూబర్లు, యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ చానల్స్ ఆమె వెంట పడ్డాయి. ఆహార వ్యాపారాన్ని టెలికాస్ట్ చేశాయి. ఫలితంగా ఆమె ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయారు. దీంతో మాదాపూర్ లో ఆమె నిర్వహించే ఆహార వ్యాపారం భారీగా పెరిగింది. రోడ్డు పక్కనే ఆమె ఆహారం విక్రయిస్తుంది కాబట్టి అక్కడ రద్దీ పెరిగింది. పోలీసులు రంగంలోకి దిగి ఆమె ఆహార వ్యాపారాన్ని నిలుపుదల చేశారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చింది. ఇంకేముంది కుమారి ఆంటీ వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం.. కుమారి ఆంటీ ఆహార విక్రయశాల వద్దకు తాను వస్తానని చెప్పడంతో.. కుమారి ఆంటీ పాపులార్టీ మరింత పెరిగింది. దీంతో అక్కడికి కొంతమంది నిరుద్యోగులు రావడం.. జీవో 56 ను రద్దు చేయాలని కుమారి ఆంటీకి వినతిపత్రం సమర్పించడం ఇటీవల కాలంలో చోటుచేసుకున్నాయి. స్వల్ప వ్యవధిలోనే సెలబ్రిటీగా మారిన కుమారి ఆంటీ పై డాక్యుమెంట్ తీసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్లు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

వాస్తవానికి నెట్ ఫ్లిక్స్ ఇటీవల కాలంలో కేరళ రాష్ట్రంలో ఆరు హత్యలు చేసిన ఓ మహిళపై డాక్యుమెంటరీ తీసింది. అది ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో డాక్యుమెంటరీలను మరిన్ని తీయాలని భావించి.. అందులో తెలుగు ప్రాంతానికి చెందిన కుమారి ఆంటీ జీవితంపై నెట్ ఫ్లిక్స్ బృందం ఫోకస్ చేసినట్టు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ వచ్చిన నేపథ్యం కుమారి ఆంటిది. ఆస్తమా వ్యాధి ఇబ్బంది పెడుతున్నప్పటికీ తాను బతకడానికి, తన కుటుంబం ఎదగడానికి మొదట్లో ఆమె ప్రముఖ గాయకుడు హేమచంద్ర వాళ్ళ ఇంట్లో పనిచేసింది. హేమచంద్ర వాళ్ళ అమ్మ ఇచ్చిన డబ్బులతో మొదట్లో తక్కువ స్థాయిలో ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టింది. ఇలా అంచలంచలుగా ఎదిగింది. మాదాపూర్ ప్రాంతంలో కుమారి ఆంటీ అనే బ్రాండ్ సృష్టించుకుంది.. మాదాపూర్ ప్రాంతంలో పనిచేసే ఐటీ ఉద్యోగులకు మాత్రమే కాదు ఆ ప్రాంతానికి వచ్చే వారు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద తినకుండా వెళ్లరంటే అతిశయోక్తి కాక మానదు. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ కర్రీ, మటన్ కర్రీ, తలకాయ కూర, బోటి, చాపల కూర, రొయ్యల కూర వంటి నాన్ వెజ్ వంటకాలతో పాటు బగారా రైస్, లెమన్ రైస్, టమాటా రైస్, పప్పు, సాంబార్, చట్నీలు, రసం, ఫ్రై లు.. ఇలా చాంతాడంత మెనూతో కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ నిర్వహిస్తోంది.

సాధారణ రోజుల్లో అయితే ఆమె వద్ద రోజుకు 1000 కి తక్కువ మంది కాకుండా తింటారు. ఇప్పుడు ఇక సెలబ్రిటీ హోదా వచ్చింది కాబట్టి 2000 నుంచి 3000 మంది దాకా తింటున్నారని తెలుస్తోంది. అయితే అక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని కొంతమంది వ్యాఖ్యానిస్తుంటే.. కొంత మందేమో రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే మటన్, చికెన్ రేట్లు పెరిగినప్పుడు ఆమె మాత్రం ఏం చేస్తుందని ఇంకొందరు వెనకేసుకొస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాదులో పనిమనిషిగా తన జీవితాన్ని ప్రారంభించి, ఇప్పుడు కుమారి ఆంటీ అనే సెలబ్రిటీగా మారడం వెనక.. ఆమె కష్టం దాగి ఉంది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇవన్నీ డాక్యుమెంటరీకి సరిపోతాయని నెట్ ఫ్లిక్స్ భావించి.. ఆమె జీవితంపై నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు నెట్టింట వార్తలు వస్తున్నాయి. దీనిపై నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అంటే కొంతమంది నెటిజన్లు ఇలా చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కుమారి ఆంటీ పై డాక్యుమెంటరీ తీస్తే అది సూపర్ హిట్ అవుతుందని ఈ పోస్టర్ చేసిన నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.