AP CM Jagan: ఒక రాష్ట్రానికి సీఎం అయ్యాక ఎంత బిజీగా ఉంటారు.ఇక ప్రజల్లోంచి వచ్చి.. వారి కష్టాలు స్వయంగా చూసి.. దేశంలోనే ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలకు పురుడుపోసిన జగన్ ఇంకా ఎంత బిజీగా ఉంటారు. ఎప్పుడూ వరుస సమావేశాలు, పర్యటనలు, అధికారులతో రివ్యూలు, పరిపాలన వ్యవహారాలు, పథకాల ప్రారంభోత్సవాలు.. ఇలా నిత్యం బిజీగా ఉంటున్న సీఎం జగన్ కు వైద్యులు తాజాగా పరీక్షలు చేసి ఆయన ఆరోగ్యపరిస్థితిపై కంగారు పడినట్టు తెలిసింది.

సీఎం జగన్ కు ఆరోగ్య పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరం స్పష్టం చేశారు. ఇంతకీ జగన్ కు ఏమైంది? ఎందుకు విశ్రాంతి అవసరం అన్నది మాత్రం తెలియరాలేదు.
దాదాపు 3వేల కి.మీలకు పైగా ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు జగన్. అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు, పాలనలో బిజీగా ఉన్నారు. రెండున్నరేళ్లు తీరికలేకుండా గడిపారు. మధ్యలో కరోనాతో పని ఒత్తిడి మరింత అధికమైంది.
తాజాగా ఏపీ-ఒడిషా సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు స్వయంగా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య దశాబ్ధాలుగా ఉన్న సమస్యలపై జాయింట్ కమిటీ ఏర్పాటు చేశారు.
ఇక అక్కడి నుంచి వచ్చాక శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే కూతురు వివాహానికి జగన్ హాజరయ్యారు.
ఒడిషా పర్యటన నుంచి వచ్చాక కూడా జగన్ బిజిగానే గడిపాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన కాలు బెణికినట్టు తెలిసింది. ఉదయం వ్యాయామ సమయంలో కాలు బెణకడంతో వైద్యులు చికిత్స చేసి విశ్రాంతి తీసుకోవాలని.. రోజువారీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవద్దని సూచించారట..
గత పాదయాత్ర సమయంలో కాలునొప్పి ఉండేది. ఈసారి బెణకడంతో అది మరింత తీవ్రమైన ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఈరోజు మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు స్కానింగ్ తీసి కాలు బెణికిందని తేల్చారు. దీంతో అధికార, వైసీపీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. జగన్ కు విశ్రాంతి చాలా అవసరం అని వైద్యులు తేల్చారు.