Munugode Bypoll: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. గురువారం ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు. ఈనెల 6న ప్రజాతీర్పును అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల దృష్టి మొత్తం మునుగోడు ఉపఎన్నికపైనే ఉంది. మూడు పార్టీలూ పోటాపోటీగా ఉండడంతో ఇక్కడ ఎవరు గెలుస్తారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి. ప్రతీ పార్టీకి కొన్ని ప్లస్సులు, మైనస్‌లు ఉన్నాయి. అయినా ఎవరూ తగ్గట్లేదు. గెలుపు తమదేననే ధీమాతో నేతలు ఉన్నారు. ఇందుకోసం అస్త్రశస్త్రాలూ ప్రయోగిస్తున్నాయి. అయినా ఎక్కడో ఏదో భయం ఆయా పార్టీలను వెంటాడుతున్నాయి. అందుకే అంతర్గతంగా రోజువారీగా సర్వేలు చేయించుకుంటున్నాయి. తమ పరిస్థితిని అంచనా వేసుకుంటున్నాయి.

– ముందుగా అధికార టీఆర్‌ఎస్ గురించి మాట్లాడుకుందాం. ఈ బైపోల్ టీఆర్‌ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. వాస్తవానికి ఈ ఉపఎన్నికలో గెలవకపోయినా ఆ పార్టీకి కలిగే నష్టం పెద్దగా ఉండదు. ఎందుకంటే ఇది ఆ పార్టీ సిట్టింగి స్థానం కాదు. అలాగని ఈ బైపోల్‌లో ఓడితే ప్రభుత్వం పడిపోయే పరిస్థితి కూడా కాదు. కానీ ఈ ఎన్నికలో గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మునుగోడు ఉపఎన్నిక తర్వాత కేసీఆర్ సర్కార్ పడిపోతుందని బీజేపీ చెప్తోంది. బుల్డోజర్లు వస్తాయని భయపెడుతోంది. అ భయాలన్నింటినీ పటాపంచలు చేయాలంటే కచ్చితంగా ఇక్కడ బీజేపీని ఓడించాలి. తాము గెలవాలి.. ఇదే టీఆర్‌ఎస్ ఆలోచన. ఇక్కడ కచ్చితంగా గెలుపు తమదేనని కేసీఆర్ చెప్తున్నారు. 51 శాతం ఓటర్లు తమవైపే ఉన్నారని ఆయన బహిరంగంగానే ప్రకటించారు.
– ఇక బీజేపీ విషయానికొస్తే ఏరికోరి తీసుకొచ్చిన ఉప ఎన్నిక ఇది. దుబ్బాక, హుజూరాబాద్ బైపోల్స్‌లో విజయం సాధించిన ఉత్సాహంతో ఇక్కడ కూడా గెలిచి తీరాలని భావిస్తోంది కమలం పార్టీ. ఇక్కడ విజయంతో హ్యాట్రిక్ కొట్టి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఎలాగైనా ఇంటికి పంపాలనుకుంటోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని లాక్కొచ్చి మరీ ఇక్కడ ఉపఎన్నికను అనివార్యం చేసింది. అయితే ఇక్కడ బీజేపీ పరిస్థితి అంతంతమాత్రమే. ఇక్కడ బీజేపీ గెలిస్తే అది తమదేనని పార్టీ చెప్పుకోలేదు కానీ.. ఆ గెలుపు కచ్చితంగా రాజగోపాల్‌రెడ్డిదే. ఇక్కడ కోమటిరెడ్డి కుటుంబానికి మంచి పట్టుంది. అందుకే ఇక్కడ గెలుపు తమదేననే ధీమా ఆ పార్టీలో ఉంది. కోమటిరెడ్డి పట్టు, పార్టీ అండ.. కచ్చితంగా తమను విజయతీరాలకు చేరుస్తాయనే నమ్మకంతో కమలం నేతలు ఉన్నారు.

– ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.. ఇది ఆ పార్టీకి సిట్టింగ్ స్థానం. ఇక్కడ గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుంది. లేకుంటే ఎన్నికల ముందు కచ్చితంగా ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తప్పవు. అంతేకాదు.. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డికి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఎవరూ అటు వైపు చూడట్లేదు. అందుకే భారమంతా రేవంత్‌రెడ్డి, అభ్యర్థి పాల్వాయి స్రవంతిపైనే పడ్డాయి. అయినా గెలుపు తమదేనని ధీమాగా ఉంది కాంగ్రెస్ పార్టీ. పాల్వాయి కుటుంబానికి ఉన్న పట్టు, కోమటిరెడ్టి కుటుంబంపై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీపై ఉన్న సానుభూతి తమకు కలిసొస్తాయని నమ్ముతోంది.
సర్వేలు ఏం చెబుతున్నాయి…
ఇలా.. ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు తమదేనని నమ్ముతున్నాయి. మరి వాస్తవమేంటి..? పార్టీ సర్వేలను పక్కన పెట్టి.. థర్డ్ పార్టీ సర్వేలను ఆరా తీస్తే క్లియర్ పిక్చర్ వస్తుంది. కానీ థర్డ్ పార్టీ సర్వేల్లో కూడా అంతు చిక్కట్లేదని తెలుస్తోంది. ఇక్కడ బీజేపీ – టీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోందని ప్రముఖ సర్వే చెప్తున్న మాట. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పలు పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చిన ఓ సంస్థ మునుగోడులో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తోంది. తాజాగా ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో బీజేపీ కంటే టీఆర్‌ఎస్‌కు ఒకటి రెండు శాతం ఓట్లు ఎక్కువ వచ్చి గట్టెక్కవచ్చని అంచనా వేసింది. అయితే పోలింగ్ రోజు పరిస్థితులు ఎటు మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎందుకంటే కీలక నేతలు గోడ దూకుతుండడం, పార్టీలు ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుతుండడం.. లాంటి కారణాల వల్ల తుది ఫలితం తారుమారయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం 20 నుంచి 25 వేల ఓట్లు వస్తాయని.. అంతకుమించి గెలిచే పరిస్థితి లేదని లెక్కగట్టింది. మరి ఫలితం ఎలా ఉంటుందో.. మునుగోడు మొనగాడు ఎవరవుతారో తేలాలంటే ఈనెల 6వ తేదీ వరకు ఆగాల్సిందే!