BRS Politics : హామీ.. నెరవేరదేమీ? ‘కారు’ దిగేద్దాం సుమీ!

ఇటీవల మోత్కుపల్లి నర్సింహులు తన అనుచరులతో యాదగిరిగుట్టలో సమావేశమయ్యారు. బూడిద భిక్షమయ్యగౌడ్‌ కూడా తనతో కలిసివచ్చే నేతలతో చర్చించినట్టు సమాచారం.

Written By: Bhaskar, Updated On : September 3, 2023 9:10 pm

BRS Dissident Leaders

Follow us on

BRS Politics : ‘‘రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, పార్టీ అభివృద్ధి దృష్ట్యా టికెట్‌ ఇవ్వలేకపోతున్నాం.. భవిష్యత్తులో మీకు కచ్చితంగా గౌరవం ఉంటుంది. నామినేటెడ్‌ పోస్టుగానీ, ఎమ్మెల్సీ పదవిగానీ ఇస్తాం.. రాజ్యసభకైనా పంపిస్తాం’’ ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ బీఆర్‌ఎస్‌ నేతలకు అధిష్ఠానం ఇస్తున్న హామీలివి. పార్టీలో మొదటినుంచీ ఉంటూ ప్రతి ఎన్నికల్లోనూ టికెట్‌ ఆశించడం, అధిష్ఠానం మొండిచేయి చూపిస్తూ సర్ది చెప్పడం అలవాటుగా మారిపోయింది. వచ్చే ఎన్నికలకుగాను ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోనూ స్థానం దక్కకపోవడంతో పార్టీలోని సీనియర్‌ నేతలు ఇక తమకు ఎప్పటికీ అవకాశం దక్కదా? అని ఆందోళన చెందుతున్నారు. తమకు గౌరవప్రదమైన పదవులు ఇస్తారా? లేక పార్టీని వీడాలా? అంటూ అదిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో అధిష్ఠానం మంత్రులను రంగంలోకి దించుతోంది. అసంతృప్తులతో చర్చించి, పార్టీలోనే కొనసాగేలా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు, సొంత పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలను బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం గతంలో పార్టీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. కాగా, చేరిక సందర్భంగా వారికి పలు హామీలు ఇచ్చింది.

ఉండాలా? వీడాలా?
ఇలా చేరిన వారిలో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్‌ బీజేపీ నుంచి వచ్చారు. ఇక భువనగిరికి చెందిన డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరారు. వీరే కాకుండా మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్‌ నియోజకవర్గాల నుంచి కూడా పలువురు నేతలు వచ్చి కారెక్కారు. కానీ, పార్టీలో చేరే వరకు హడావుడి చేసిన అధిష్ఠానం.. గులాబీ కండువా కప్పుకొన్నాక ఆయా నేతలను పట్టించుకున్న పాపాన పోవడంలేదన్న విమర్శలున్నాయి. వారంతా పార్టీలో ఉండాలా? వీడాలా? అనే సందిగ్ధంలో పడ్డారు.

అనుచరులతో సమావేశాలు..
ఇటీవల మోత్కుపల్లి నర్సింహులు తన అనుచరులతో యాదగిరిగుట్టలో సమావేశమయ్యారు. బూడిద భిక్షమయ్యగౌడ్‌ కూడా తనతో కలిసివచ్చే నేతలతో చర్చించినట్టు సమాచారం. భువనగిరి టికెట్‌ కోసం బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన చింతల వెంకటేశ్వర్‌రెడ్డి పట్టుబదుతున్నారు. ఈయనతో పాటు భువనగిరి టికెట్‌ తనకే వస్తుందన్న ఆశతో కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఇటీవల పార్టీలో చేరారు. అయితే అధిష్ఠానం మళ్లీ సిటింగ్‌ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికే అవకాశం కల్పించింది. అనిల్‌కుమార్‌రెడ్డికి భువనగిరి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. చింతల వెంకటేశ్వర్‌రెడ్డికి అధిష్ఠానం ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో ఆయన పార్టీని వీడాలన్న ఆలోచనలో ఉన్నారు. మరోవైపు అనిల్‌కుమార్‌రెడ్డి కూడా బీఆర్‌ఎస్ ను వీడి తిరిగి కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని అధికార పార్టీ నేతలు ఖండిస్తున్నారు.

బీజేపీలోకి చిత్తరంజన్‌ దాస్!
బీఆర్‌ఎస్‌ అధిష్ఠానంపై కినుక వహించిన మాజీ మంత్రి, కల్వకుర్తిలో ఎన్‌టీఆర్‌ను ఓడించిన చిత్తరంజన్‌ దాస్ ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. బీసీల్లో బలమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న చిత్తరంజన్‌ దాపం చేరికతో తమ పార్టీ నేత ఆచారి గెలుపు సునాయాసమవుతుందని బీజేపీ భావిస్తోంది. జాతీయ స్థాయిలో చైర్మన్‌ పదవితో పాటు జడ్చర్లలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తామని బీజేపీ నేతలు చిత్తరంజన్‌ దాస్ కు చెబుతున్నట్లు సమాచారం.

శంభీపూర్‌ రాజు అసమ్మతి రాగం!
కుత్బుల్లాపూర్‌ అభ్యర్థిగా ఎమ్మెల్యే కేపీ వివేకానందను ప్రకటించడంపై ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు అసమ్మతి రాగం అందుకున్నారు. బహదూర్‌పల్లిలో నిర్వహించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల ప్రారంభోత్సవానికి గైర్హాజరయ్యారు. కార్యక్రమానికి రాజును ఆహ్వానించలేదని ఆయన వర్గం గుర్రుగా ఉంది. పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వెళ్లవద్దంటూ ఫోన్లు చేసి మరీ వెనక్కి పిలిపించారు. తమ అండదండల్లేకుండా వివేక్‌ ఎలా గెలుస్తారో చూద్దామని వారు అనుకున్నట్లు తెలిసింది.