
Vizag Steel Bid : “విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు” అనే నినాదంతో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం అప్పట్లో ఉద్యమాలు జరిగాయి. ఆ కర్మాగారాన్ని దక్కించుకునేందుకు ఎన్నో నిరసనలు కూడా చెలరేగాయి. అనేకానేక ధర్నాల ఫలితంగా విశాఖ ఉక్కు ఆంధ్ర ప్రజలకు హక్కయింది. కానీ ఇప్పుడు అవి విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారం దర్జాగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తోంది.. మొన్నటిదాకా విశాఖ కర్మగారానికి ముడి పదార్థాలు, మూలధనం సమకూర్చేందుకు కేంద్రం ఆసక్తి వ్యక్తీకరణ అనేదాన్ని తెరపైకి తీసుకొచ్చింది.. ఇందులో పాల్గొనేందుకు రకరకాల కార్పొరేట్లు తెరపైకి వచ్చారు.. ఇందులో పాల్గొంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి ద్వారా ప్రకటన ఇప్పించారు. తీరా అసలు విషయానికి వచ్చేసరికి వెనకడుగు వేశారు. ఇదంతా జరిగిన తర్వాత అసలు ఉక్కు కర్మాగారం ఎవరి చేతుల్లోకి వెళుతుంది? కేంద్రం ఎవరికి అప్పగిస్తుంది? వీటన్నింటికీ వస్తున్న సమాధానం జిందాల్ స్టీల్.
బహిరంగ మార్కెట్లో వైజాగ్ స్టీల్ కు మంచి పేరుంది. ఖచ్చితమైన నాణ్యత కలిగి ఉంటుందని వినియోగదారుల నమ్మకాన్ని పొందింది. మూడు మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 90వ దశకంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటయింది. ఇప్పటిదాకా నాణ్యత విషయంలో ఆ సంస్థ రాజీ పడలేదు.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు గతంలో మూడు మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం ఉండేది.. ఇప్పుడు ఆది 6.2 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఈ సామర్థ్యంతో విస్తరణకు వెళ్తున్నామని, మార్కెట్ ను మరింత విస్తృతం చేసుకునేందుకు కొత్త రకాల ఉత్పత్తులు తయారు చేస్తామని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వైజాగ్ స్టీల్ లో అప్పటివరకు రౌండ్స్, స్క్వేర్స్, రీ బార్స్, వైర్ రాడ్స్ తయారవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా తెరపైకి ఫ్లాట్స్ అంటే షీట్లు, పైపులు తయారు చేస్తామని ప్రతిపాదించింది. ఒకవేళ ఇవి కనక తయారైతే ప్రైవేట్ కంపెనీలు తమ ప్లాంట్లు మూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడే తెలివిగా జిందాల్ స్టీల్స్ ఢిల్లీలో పావులు కదిపింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ బోర్డులోని అధికారులను మేనేజ్ చేసింది. కొత్త ఉత్పత్తులు తెరపైకి రాకుండా తొక్కి పెట్టింది. ఇప్పటికీ 16 వేల కోట్లు పెట్టి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని విస్తరించినా పాత ఉత్పత్తులకే పరిమితం కావలసి వచ్చింది.. అయినప్పటికీ విశాఖ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులు మాత్రమే పెరిగింది. సరిగ్గా ఇక్కడే అంటే విశాఖ ప్లాంట్ కంటే ఆరు సంవత్సరాల వెనుక శంకుస్థాపన చేసుకున్న కర్ణాటకలోని జిందాల్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 19 మిలియన్ టన్నులకు చేరుకుంది.
దీన్ని చూసే జిందాల్ స్టీల్ కు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది.. కేంద్రం పేరుకు ఆసక్తి వ్యక్తి కరణ అని చెబుతున్నప్పటికీ.. ప్లాంటును మొత్తం జిందాల్ స్టీల్ కు కట్టబెడతారని తెలుస్తోంది. ఇదే జరిగితే విశాఖ స్టీల్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం జిందాల్ హస్తగతం అవుతుంది. అలాంటప్పుడు దక్షిణాదిలో జిందాల్ రాజ్యం నడుస్తుంది. వాస్తవానికి జిందాల్ స్టీల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణలో పాల్గొనే ముందు ఢిల్లీలో డీల్ కుదిరిందని, ఆ తర్వాతే బిడ్ దాఖలు చేసిందని సమాచారం.
ఇక కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టీల్ ప్లాంట్లు దాదాపు ఉత్తర భారతదేశం లోనే ఎక్కువగా ఉన్నాయి. సెయిల్( స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) కు అసాన్ సోల్, భిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా లో ప్లాంట్లు ఉన్నాయి. కర్ణాటకలోని స్పెషల్ స్టీల్ తయారీ కోసం భద్రావతి లో విశ్వేశ్వరాయ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేసింది.. అయితే ఈ ప్లాంట్ ను కేంద్రం మూసివేసింది. పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకు నాలుగేళ్ల క్రితమే ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీ చేసింది. దీని వెనుక కూడా జిందాల్ స్టీల్ ప్రయోజనాలు కాపాడాలనే లక్ష్యం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దక్షిణాదిలో ప్రభుత్వ రంగంలో మిగిలింది వైజాగ్ స్టీల్ మాత్రమే. దీన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం ఎప్పటినుంచో భావిస్తోంది. సరిగ్గా టైం చూసుకొని తెరపైకి ఆసక్తి వ్యక్తీకరణ అనే ప్రకటన జారీ చేసింది.. తెరపైకి జిందాల్ స్టీల్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు ఇక ఈ స్టీల్ ఫ్యాక్టరీ హస్తగతం కావడంతో జిందాల్ స్టీల్ కు దక్షిణాదిలో ఇక తిరుగు ఉండదు.
వాస్తవానికి రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలోని బయ్యారంలో ఒకటి, కడపలో మరో స్టీల్ ప్లాంట్ నిర్మించాలని ఒప్పందం జరిగింది. ఈ రెండు కర్మకారాలను సెయిల్ ఆధ్వర్యంలో నిర్మించాలని అప్పట్లో ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు.. కానీ ఇక్కడ తెలివిగా సెయిల్ ను పక్కకు తప్పించారు.. ఇందుకు తెర వెనుక భారీ లాబియింగ్ నడిచినట్టు తెలుస్తోంది.. జిందాల్ కు ఎవరూ అడ్డుపడకుండా ఉండేందుకు ఆంధ్రలోని వైయస్ జగన్ ప్రభుత్వం సహకరించింది. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరంభశూరత్వం లాంటి పోరాటాలు చేస్తుండడంతో ఇక్కడ కూడా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కావడం లేదు. పైగా ఉద్యమ సమయంలో బయ్యారం ఉక్కు ఖనిజాన్ని దోచి ఆంధ్రాలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. తీరా భారత రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు బిడ్ సింగరేణి ద్వారా వేస్తామని ప్రకటించారు. చివరి నిమిషంలో వెనకడుగు వేశారు. ఇలా నేతల మధ్య అనైక్యతను కేంద్రం తనకు అనుకూలంగా మలుచుకుంటున్నది. దర్జాగా నష్టాల పేరుతో స్టీల్ కర్మాగారాలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది.