CM KCR- Sriram Sagar Project: తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇన్నాళ్లు తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే కచ్చితంగా నిలబడి మాట్లాడిన పార్టీ.. కొన్ని విషయాలను పక్కన పెడితే తెలంగాణ స్వాభిమానాన్ని చాటి చెప్పిన పార్టీ… ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి అయిపోయిందో, జాతీయ రాజకీయాల పాట అందుకుందో.. తెలంగాణ కోణం దాటిపోయింది. అవసరార్థం మునుపెన్నడూ లేనంత రాజనీతిజ్ఞత, ఔదార్యం, పరిణతి కేసీఆర్ మాటల్లో కనిపిస్తోంది. బాబ్లీ అనేది పెద్ద ఇష్యూనే కాదు.. వేరే టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. టీఎంసీ కూడా లేని బాబ్లీ పంచాయితీ దేనికి? అదొక డ్రామా… నీటి లభ్యత ఉందని తెలంగాణ ప్రభుత్వానికి నచ్చచెప్పి శ్రీరామ్ సాగర్ నీళ్లను ఎత్తిపోసుకోండి, పెద్ద మనసుతో చెబుతున్నా అని… కెసిఆర్ ఇటీవల నాందేడ్లో ప్రకటించాడు.

దీన్ని చూడగానే అప్పట్లో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు కొన్ని గుర్తుకు వస్తున్నాయి.. ఇన్నాళ్లు నాకు తిండి పెట్టింది, చెన్నై దాహం తీర్చకపోతే ఎలా అంటాడు? అందుకే తెలుగు గంగా చేపడుతున్నాం. చెన్నైకి తాగునీరు ఇస్తాను అని ఎన్టీఆర్ ఆ రోజుల్లో ప్రకటించాడు. నీకు తిండి పెడితే, నీకు ఆశ్రయం ఇస్తే, నీకు అడ్డగా మారితే, దానికి కృతజ్ఞతగా ఒక ప్రాజెక్టే చేపడతావా? నీ సొంత జేబులో డబ్బులు అనుకున్నావా కృష్ణా జలాలు అంటే… అప్పట్లో ఇలాంటి విమర్శలు కూడా వచ్చాయి. సరే ఆ పేరుతో అనేక ప్రాంతాలకు కృష్ణా జలాలు తరలించారు. అది వేరే కథ.. కానీ ఒక ముఖ్యమంత్రి స్థూలంగా రాష్ట్ర ప్రయోజనాలను, తన వ్యక్తిగత రాగద్వేషాలతో లింక్ పెట్టొచ్చా అనేది ప్రశ్న. ఎన్టీఆర్ పెద్ద స్టేట్స్ మెన్ కాదు కాబట్టి, ఎవరూ అడగలేదు కాబట్టి, అడిగినా జవాబు చెప్పే అలవాటు లేదు కాబట్టి ఆ చర్చ అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ కెసిఆర్ ఎన్టీఆర్ బాటనే అనుసరిస్తున్నాడు.. రాజకీయ స్వలాభం కోసం తెలంగాణ ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టు పెడుతున్నాడు.
వాస్తవానికి శ్రీరామ్ సాగర్ మిగులు జలాలను బాబ్లీ వాడుకుంటున్నది. అసలు బ్యాక్ వాటర్స్ లో ఓ లిఫ్ట్ పెట్టడమే అబ్సర్డ్.. అందుకే తెలంగాణ గానీ, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గానీ ఆ ప్రాజెక్టును వ్యతిరేకించాయి. ఇక్కడ ఒక టీఎంసీయా, అర టీఎంసీయా అనేది లెక్క కాదు. కానీ మహారాష్ట్ర పోకడ చాలా అభ్యంతరకరం. ఇదే గోదావరి జలాల పై మనకూ, మహారాష్ట్రకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నాడు కాలేశ్వరానికి మహారాష్ట్రను ఒప్పించాం, చర్చిస్తే సానుకూల ఫలితాలు వస్తాయని.. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాళ్లకు నష్టం లేదు కాబట్టి అంగీకరించారు. సో బాబ్లీ తో మన నీళ్లను ఎంత తీసుకుపోతున్నారు అనేది ప్రశ్న కాదు.. దిగువ రాష్ట్ర ప్రయోజనాలను బేఖాతరు చేస్తూ… బాబ్లీకి ఎగువన అనేక ప్రాజెక్టులు కట్టింది మహారాష్ట్ర. దిగువకు రావలసిన బోలెడు నీటిని వాడుకుంటుంది. మరి బాబ్లీ డ్రామా ఎలా అవుతుంది? బాబ్లీ, దాని దిగువ ప్రాజెక్టులన్నీ కచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలకు నష్టదాయకాలే.. అలాంటిది బాబ్లీ విషయమే కాదు.. అవసరమైతే శ్రీరామ్ సాగర్ నీటిని ఎత్తిపోసుకోండి. పెద్ద మనసుతో చెప్తున్నానని అని ముఖ్యమంత్రి ఎలా అంటాడు? కొంచమైనా సోయి ఉండాలి కదా!

అసలే వాతావరణం మారుతున్నది.. ఎన్నడూ కరువు కాటకాలు చూడని యూరప్ లాంటి ప్రాంతాలు తీవ్రమైన ఎండలతో మండిపడుతున్నాయి. నదులు ఎండిపోతున్నాయి.. కాలుష్యం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ స్థాయి వర్షాలు కురుస్తాయో, కురువయో తెలియదు. స్థూలంగా చెప్పాలంటే రాబోయేవన్నీ నీటి తగదా రోజులే.. ప్రతీ చుక్కకూ పంచాయితీ తప్పదు. అలాంటప్పుడు ఇప్పుడు నీకు అవసరం కాబట్టి మహారాష్ట్ర పట్ల ఔదార్యం చూపించాలా? ప్రతి దానికీ ఒక లెక్క ఉంటుంది. అంతే తప్ప ముఖ్యమంత్రికి ఓట్ల అవసరం రాగానే అర్జెంటుగా పెద్ద మనసు వచ్చేసి, మా నీళ్ళనూ మీరు ఎత్తిపోసుకోండి అనాలా? తెలంగాణ ప్రజల హక్కు… గోదావరి జలాలపై మనకూ వాటాలు ఉన్నాయి. ఎగువ నుంచి రావాల్సిన నీళ్ళు ఉన్నాయి. అవన్నీ వదిలేసి,నాకు మనసు అయింది, మీ ఇష్టం వచ్చినట్టు నీళ్ళను తీసుకొండి అనడం ఎలా సబబు.