Hindi vs Non Hindi: అప్పట్లో తమిళనాడులో ద్రావిడ ఉద్యమం తీవ్రంగా సాగుతున్న రోజులవి. పెరియార్, కరుణానిధి వంటి వారు హిందీకి వ్యతిరేకంగా నిరసన గళం విప్పారు. ద్రావిడులు, ఆర్యులు ఎప్పటికీ ఒకటి కాలేరని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పటివరకు తమిళనాడులో హిందీ అనేది లేదు. అప్పటి ఉద్యమం దాటికి కేంద్రం లో ఉన్న ఏ ప్రభుత్వం కూడా హిందీ గురించి, దాని అమలు గురించి ఆలోచించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు బిజెపి అధికారంలోకి రెండోసారి వచ్చిన తర్వాత హిందీపై చర్చ సాగుతోంది. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనగళం విప్పుతున్నాయి. మరి ముఖ్యంగా తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఒక అడుగు ముందుకేసి దేశంలో అధికారిక భాష అంటూ ఏమీ లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

-ఇంతకీ ఎందుకు ఈ వివాదం అంటే
కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటి, ఐఐఎం, టెక్నికల్ లేదా నాన్ టెక్నికల్ విద్యా సంస్థల్లో హిందీని తప్పనిసరి చేయాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా బిజెపేతర ముఖ్యమంత్రులు భగ్గుమంటున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. హిందీని దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా రుద్దొద్దని హితవు పలికారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కమ్యూనిస్టు పార్టీల నాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ” దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. అలాంటప్పుడు హిందీని అధికార భాష చేసి, మిగతా భాషల ప్రాధాన్యాన్ని తగ్గించొద్దు. ఇటీవల కేంద్రం కూడా దేశానికి ఒక అధికారిక భాష అంటూ ఏమీ లేదని ప్రకటించింది. ఇలాంటి సమయంలో మళ్లీ హిందీ పై రాద్దాంతం ఎందుకు చేస్తున్నారని” ముఖ్యమంత్రి పినరై విజయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. భిన్నత్వంలో ఏకత్వంలా ఉండే భారత దేశ సమాఖ్య స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం కాపాడాలని ఆయన హితవు పలికారు. ఇక అన్ని రాష్ట్రాల భాషలను సమానంగా చూడాలని, ఇందులో ఏ ఒక్క భాషకు అందలం ఎక్కించవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అభిప్రాయపడుతున్నారు. గతంలో కేంద్రంలో ఉన్న పాలకులు హిందీ విషయంలో ఇలానే చేశారని, ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో భంగపడ్డారని గుర్తు చేస్తున్నారు. దేశంలో హిందీ మాట్లాడే వారి కంటే మాట్లాడని వారే ఎక్కువ ఉన్నారని దీనిని కేంద్ర ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని ఆయన చెబుతున్నారు. హిందీని బలవంతంగా రుద్దితే తమిళనాడే కాకుండా మిగతా రాష్ట్రాలూ దీనిని వ్యతిరేకిస్తాయని ఆయన హెచ్చరిస్తున్నారు.
మరో వైపు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు. దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో హిందీని బలవంతంగా రుద్ది, ఏం సాధించాలనుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటన తాలూకు వార్తను ఉటంకిస్తూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ” దేశంలో అన్ని భాషలు సమానమే. ఆశ ఎక్కువ మరో భాష తక్కువ అనడానికి లేదు. భిన్నత్వంలో ఏకత్వంలో కలిసి ఉండే భారతదేశం సమాఖ్య స్ఫూర్తికి నిలువుటద్దం. ఇలాంటి దేశంలో భాషా యుద్ధాన్ని తీసుకురావద్దని” హితవు పలికారు.
సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వెల్లడించారు. హిందీని ఎట్టి పరిస్థితుల్లో జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టకూడదని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కాగా జాతీయస్థాయి విశ్వవిద్యాలయాలు, ఐఐటి, ఐఐఎం వంటి విద్యాసంస్థల్లో హిందీ తప్పనిసరి చేయాలంటూ ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీని, మిగతా ప్రాంతాల్లో అక్కడి స్థానిక భాషను, ఇంగ్లీషును మాత్రం ఐచ్చికం చేయాలని పేర్కొన్నది. నివేదికను గత నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. కాగా ఇప్పుడు ఈ సూచనలపైనే దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి. అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం మౌనంగా ఉంటున్నాయి. అయితే హిందీ అనేది జాతిని ఏకం చేసిన భాష అని, భాష విషయంలోనూ ప్రతిపక్ష పార్టీలు లేకిగా వ్యవహరిస్తున్నాయని బిజెపి ప్రతినిధులు అంటున్నారు. జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో హిందీని ప్రవేశపెడితే ప్రాంతీయ భాషలకు వచ్చిన నష్టం ఏమిటని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లోని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషలకు ప్రాచీన హోదా ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశానికైనా ఒక అధికారిక భాష ఉంటుందని, భారతదేశానికి హిందీ అయితే తప్పు ఏమిటని వారు నిలదీస్తున్నారు.
కాగా హిందీ భాష విషయంలో కొందరు ఆర్ఎస్ఎస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సూచనల మేరకే హోంమంత్రి అమిత్ షా నడుచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాగా ఇప్పుడు బిజెపి అంటేనే ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్న తమిళనాడు, కేరళ, తెలంగాణ ప్రభుత్వాలు.. మున్ముందు ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాయో వేచి చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.