Controversy over rice crop: తెలంగాణ రాష్టంలో మరోసారి రాజకీయ చిచ్చు రేగింది. మొన్నటి వరకు హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోటా పోటీగా ఆరోపణలు, దూషణలు చేసుకున్న పార్టీలు తాజాగా వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఒకరిపై ఒకరు ఆందోళనలు, విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్రం వరిధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేయాలని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఈ పార్టీల మధ్య ఆరోపణలతో వ్యవసాయంలో సంక్షోభం ఏర్పడనుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీల మధ్య మొదలైన చిచ్చుతో మధ్యలో రైతులు బలవుతున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది..? దీనికి రాష్ట్ర ప్రభుత్వం కారణమా..? లేక కేంద్ర ప్రభుత్వమా..? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో వరిసాగు విపరీతంగా పెరిగింది. 2020-2021 రబీలో వరిసాగు విస్తీర్ణం 237.85 శాతం పెరిగిందని వ్యవసాయ లెక్కలు చెబుతున్నాయి. సాధారణంగా రబీలో 22,19,326 ఎకరాల్లో వరి సాగు చేస్తారు. కానీ గతేడాది 52,78,636 ఎకరాలకు పెరిగింది. వరిపంటలో తెలంగాణ నెంబర్ వన్ అయిందని, దేశానికంతా ‘రైస్ బోల్’ అని భారత ఆహార సంస్థ చైర్మన్ డీవీ ప్రసాద్ గతేడాది మే నెలలో అభినందించారు. అంతేకాకుండా 2020 రబీ సీజన్లో మొత్తం 52.23 లక్షల టన్నుల వరిధాన్యం సేకరించారు. అంటే మొత్తం సేకరించిన ధాన్యంలో తెలంగాణ నుంచే 63 శాతం వచ్చింది.
ఈ క్రమంలో వచ్చే రబీకి ఎవరైనా వరి పంట వేసినా, వరి విత్తనాలు విక్రయించినా కఠిన చర్యలు ఉంటాయని సిద్ధిపేట కలెక్టర్ ప్రకటించడంతో వివాదంమొదలైంది. ఇది అప్రజాస్వామికమని ప్రతిపక్షాలు ఆరోపించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల రెండు రోజుల పాటు ప్రెస్ మీట్లు పెట్టారు. ఇందులో వరిధాన్యాన్ని కేంద్రం కోనుగోలు చేయడం లేదని, వరిధాన్యం కొనుగోలు చేయాలని 12 నుంచి ధర్నాలు చేస్తామని ప్రకటించి, శుక్రవారం నుంచి ఆందోళన కార్యక్రమాలు మొదలు పెట్టారు. అయితే ఒకప్పుడు తెలంగాణ వరితో పండుగ అని ప్రకటించిన ప్రభుత్వం ఇక వరి వేయొద్దు అనడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.
అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం దేశంలో వరిధాన్యం నిల్వలు పెరిగిపోయాయని, ఇక బియ్యం కొనలేమని తెలంగాణ రైతులకు చెప్పారు. వరిధాన్యం నిల్వలు పెరిగితే పేదలకు ఉచితంగా పంపిణీ చేయండి.. అప్పుడు గోడౌన్లు ఖాళీ అవుతాయని కొందరు వాదిస్తున్నారు. దీంతో ఈ సమస్యను రెండు పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మిగతా పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఈ సమస్య తెలంగాణలోనే లేదు. వరి పండించే ఒడిశా, ఛత్తీస గఢ్ లలోనూ సంక్షోభం మొదలైంది. ఈ రాష్ట్రాల నుంచి కూడా కేంద్రం వరి కొనుగోలు చేయడం మానేసింది. కేంద్ర వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఒడిశా ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి లేఖ రాశారు. అయితే ఇలాంటి రాజకీయ వాతావరణం ఏర్పడలేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో వరి ధాన్యానికి విలువ పెరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరిసాగును ప్రోత్సహించేందుకు ఉచిత విద్యుత్ ను ప్రకటించారు. ఇదే సమయంలో నీటి పారుదల పెరగడంతో వరి సాగు విస్తీర్ణాన్ని పెంచారు. అయితే ఈ క్రమంలో వరి వేసిన పొలాలు ఇతర పంటలు వేయడానికి పనికి రాకుండా పోయాయి. మరోవైపు వరి పంటపై ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీ ఇస్తుంది. ఇతర పంటలపై సబ్సిడీ రాదు. దీంతో ఇక్కడి రైతులు ఇతర పంటలను వేయడానికి సాహసం చేయరు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని విధానాలు కూడా వరి సాగుపై మక్కువ పెరిగిందిన ప్రొఫెసర్ కోదండరాం అంటున్నారు. ‘ప్రభుత్వం వరి, పత్తి తప్ప మిగతా పంటలను ప్రోత్సహించడం లేదు. నిజామాబాద్ లో చెరుకు పంట బాగా పండుతుంది. అయితే అక్కడి షుగర్స్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వాటిని తెరిచే సాహసం చేయడం లేదు. తెలంగాణ రైతులు అంతకుముందు పల్లీలు, నువ్వులు వేసేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం వరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో రైతులు ఆ పంటలను వేయడం మానేశారు. రైతులు ఏ పంట వేసినా ప్రభుత్వం కొనాలి.. అప్పుడే వారు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్తారు’ అని అన్నారు.