Etela Rajender: తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఎన్నికల కంటే ముందు స్థబ్దుగా సాగిన రాజకీయాలు.. ఆ ఎన్నికల తరువాత మారిపోతున్నాయి. ఏడేళ్ల నుంచి ప్రత్యామ్నాయమే లేకుండా ఏకచక్రాధితప్యం వహించిన టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కొంత గడ్డు పరిస్థితులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి ఆ పార్టీ అధినేత తీసుకున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రేవంత్ రెడ్డి జోరుకు కళ్లెం..
రేవంత్‌రెడ్డి.. టీపీపీసీ చీఫ్ పగ్గాలు చేతపట్టిన నుంచి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు రాష్ట్రమంతా తిరుగుతున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కేడర్ ను కింది నుంచి బలోపేతం చేసుకుంటూ రావాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన అదే ఆలోచనలో ఉన్నారు. ఈ సందర్భంలోనే హుజూరాబాద్ ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో ఈటెల రాజేందర్ ను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. ఈటెల బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. అయితే ఈటెలకు, రేవంత్ కు మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల హుజూరాబాద్‌లో కాంగ్రెస్ బలంగా పోరాడలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈటెలకు లబ్ది చేకూర్చడానికి, టీఆర్ఎస్‌ను నిలువరించడానికి కావాలని ఆయన అలా చేశారనే విమర్ళలు ఉన్నాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ హైకమాండ్ గుర్రుగా ఉంది. నిజానికి ఆయన పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఈ ఎన్నికలు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ గట్టిగా పోటీ చేసి ఉంటే ఇప్పుడొచ్చిన ఓట్ల కంటే కచ్చితంగా మంచి ఓట్లే వచ్చేవి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డికి దాదాపు 60 వేల ఓట్లు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోయినా.. ఇప్పుడొచ్చిన ఓట్లు కంటే ఎక్కువే వచ్చేవి.
ఈ ఆరోపణలు, విమర్శలు పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుపోతున్నారు. పార్టీ క్యాడెర్‌కు బలం చేకూర్చి, వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డీఎస్‌ను కలిశారు. ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి మంత్రిగా పని చేశారు. డీఎస్‌కు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆయనను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. దీనికి డీఎస్ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలిసింది.
Also Read: AP Govt: జగన్ సర్కార్ బిగ్ షాక్.. ఇండియన్ మెడికల్ డివైసెస్ రెడ్ నోటీసు
రేవంత్ కు ఈటెల బ్రేక్స్..
రేవంత్ రెడ్డి ప్లాన్‌కు ఈటెల రాజేందర్ బ్రేక్ వేసేలా కనిపిస్తున్నారు. హుజూరాబాద్‌లో విజయం సాధించిన తరువాత ఈటెల రాజేందర్ బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. టీఆర్ఎస్ ను బలహీన పర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఆయన డీఎస్‌ను కలిశారు. డీఎస్‌ను మర్యాదపూర్వకంగానే కలిశామని బయటకు చెప్పినా.. దాని వెనక అంతరార్థం మాత్రం వేరే ఉందని తెలుస్తోంది. డీఎస్‌ను బీజేపీలోకి ఆహ్వానించేందుకే ఈటెల చర్చలు జరిపారని రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. అయితే రేవంత్ రెడ్డి ఆహ్వానం కంటే, ఈటెల ఆహ్వానానికే డీఎస్ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. దీంతో రేవంత్ ఆలోచనలకు ఈటెల బ్రేక్ వేసినట్టు అయ్యింది. మరి ఎవరి ప్లాన్ సక్సెస్ అవుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాల్సి ఉంటుంది.
Also Read: AP VS Telangana: ఏపీ వర్సెస్ తెలంగాణ: అప్పులు, బిచ్చం ఫైట్