Congress – Chiranjeevi : కాంగ్రెస్ పార్టీలో పశ్చాత్తాపం కనిపిస్తోంది. రాష్ట్ర విభజనతో పాటు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో హైకమాండ్ ఫెయిలైనట్టు నేతలు అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా విభజన విషయంలో ఏపీని కనీస పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జరిగిన పరిణామాలతోనే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో పార్టీ అచేతనం కావడానికి నాడు తీసుకున్న నిర్ణయాలే కారణంగా చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేయడంతోనే పార్టీకి పరిస్థితి వచ్చిందని మెజార్టీ కాంగ్రెస్ నాయకులు అంగీకరిస్తున్నారు.
2009లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. అధికార కాంగ్రెస్ తో పాటు మహా కూటమి, పీఆర్పీ త్రిముఖ పోటీలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అధికారాన్ని హస్తగతం చేసుకుంది. పీఆర్పీ కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. అయితే కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కు దాటినా.. పీఆర్పీని కలుపుకోవాలని డిసైడ్ అయ్యింది. కాంగ్రెస్ లో పీఆర్పీ విలీనమైంది. కేంద్ర మంత్రిగా చిరంజీవి ఎంపిక కాగా.. రాష్ట్ర కేబినెట్ లో సైతం ఆ పార్టీకి చోటు దక్కింది. అక్కడకు కొద్దిరోజులకే రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. కేబినెట్ లో సీనియర్ మంత్రి అయిన రోశయ్యను హైకమాండ్ సీఎం చేసింది. తరువాత మార్చే క్రమంలో చిరంజీవి పేరు తెరపైకి వచ్చినా.. అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డికి పదవి వరించింది.
అయితే నాడు సీనియర్ అనే ప్రాతిపదికన కిరణ్ కు మార్గం సుగమమైంది. చిరంజీవికి మైనస్ గామారింది. అయితే ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్లు ఇప్పటికీ తప్పుపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతా మోహన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బంగారంలాంటి అవకాశాన్ని చేజేతులా వదులుకుందన్నారు. చిరంజీవి రూపంలో కాపులకు సీఎం చేసే చాన్స్ వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి బదులు చిరంజీవిని సీఎం చేసి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరోలా ఉండేదని చింతా మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అనిశ్చితి వాతావరణం నెలకొని ఉందని మోహన్ చెప్పారు. జగన్ సర్కారు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఉందన్నారు. కానీ ఆ పార్టీని ఎదుర్కోవాలంటే విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరముందన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ముందుపెడితేనే కూటమి వర్కవుట్ అవుతుందన్నారు. జగన్ కు మరో అవినీతి నేత చంద్రబాబు ప్రత్యామ్నాయంగా తెరపైకి తెస్తే మాత్రం వైసీపీ గెలుస్తుందన్నారు. అటువంటి తప్పిదం జరగకుండా చూసుకోవాలన్నారు. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. మొత్తానికైతే నాడు చిరంజీవిని వదులుకొని పెద్ద తప్పేచేసినట్టు కాంగ్రెస్ పశ్చాత్తాప పడుతోంది. పవన్ తోనే ఈ రాష్ట్రం గాడిలో పడుతుందని చెబుతోంది. చూడాలి మరీ ఏం జరుగుతుందో?