Kaleshwaram Project : కాళేశ్వరం పై కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. బీఆర్ఎస్ గుండెలు గుభేల్

అధికారం, విపక్ష పార్టీలు ఒకేసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరొకసారి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Written By: Anabothula Bhaskar, Updated On : December 29, 2023 1:42 pm
Follow us on

Kaleshwaram Project : కాళేశ్వరం అంత గొప్ప ప్రాజెక్టు లేదు. నా మెదడును రంగరించి, నా రక్తాన్ని ఖర్చు చేసి ఈ ప్రాజెక్టుకు డిజైన్ ఇచ్చాను. ప్రతిపక్షాలకు సోయిలేదు. ఎన్నడైనా వారి ముఖాలకు ఇలాంటి ప్రాజెక్టు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును డిస్కవరీ ఛానల్ పొగిడింది. ఈ ప్రపంచంలోనే మానవ అద్భుత నిర్మాణం అంటూ కొనియాడింది. తెలంగాణకు జీవధార కాళేశ్వరం..ఇలానే కదా కేసీఆర్ నుంచి కేటీఆర్ దాకా పదే పదే చెప్పింది. వెళ్లిన చోటల్లా కాళేశ్వరం తొలి ఫలితం ఈ ప్రాంతానికే వస్తుంది అన్నది. కానీ ఒక మేడిగడ్డ కుంగుబాటుతో ఆ ప్రాజెక్టు గొప్పతనం ఏమిటో.. అన్నారం బ్యారేజీలో ఏర్పడిన ఇసుకమేటలతో.. అందులో ఉన్న నాణ్యత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అప్పటి అధికార భారత రాష్ట్ర సమితికి ఒక విధంగా కంటగింపుగానే మారింది. చివరికి ఆ ప్రాజెక్టు ప్రస్తావన లేకుండానే వారు ఎన్నికల ప్రచారం చేశారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మేడిగడ్డ కుంగుబాటు తర్వాత కాంగ్రెస్ మంత్రులు శుక్రవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను వారు వెల్లడించారు.

కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం 93,872 కోట్లను వెచ్చించింది. కొత్తగా 98,570 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించింది. ఐదు సంవత్సరాలలో దాదాపు 1053 టీఎంసీల నీటిని ఎత్తిపోసింది. 215 టీఎంసీల గోదావరి జలాలను తరలించి 19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించడం, 18.8.2 లక్షల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించడం, 18,64,970 ఎకరాల ఆయకట్టును సృష్టించడం. ఎత్తిపోతల పథకం లక్ష్యం. ఈ ప్రాజెక్టు కాలుల ద్వారా 456 చెరువులను ఇప్పటివరకు నింపగా.. వాటి పరిధిలో 39,146 ఎకరాలకు సాగునీరు అందించాలి. కాలేశ్వరం నీళ్లను ఎస్సారెస్పీ_1,2 నిజాంసాగర్ కు తరలించి వాటి కాలవల ద్వారా 2,143 చెరువులకు మీరు సరఫరా చేశారు. ఈ నీరు ఒక లక్ష అరవై ఏడు వేల 50 ఎకరాలకు అందింది. ప్రాజెక్టుకు సంబంధించి 97,417 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. 66,190 ఎకరాల సేకరణ మాత్రమే పూర్తయింది. మిగతా భూమి సేకరణకు 5,438 కోట్లు అవసరం. అంతేకాదు దిగువ మానేరు జలాశయం కింద ఎస్సారెస్పీ స్టేజి_1 పాత ఆయకట్టుతో పాటు ఎస్సారెస్పీ స్టేజి 2, నిజాంసాగర్ కింద పాత ఆయకట్టుకు 2023_24 వానకాలం, యాసంగి సీజన్లలో కాలేశ్వరం ద్వారా సాగునీరు అందింది. దీంతో మొత్తం 17 లక్షల 8,230 ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకృతమైంది. 2020_21 యాసంగి నుంచి 2023_24 ఖరిఫ్ వరకు కుందెల్లి, హల్దీ వాగులు, 66 చెక్ డ్యామ్ ల కింద మొత్తం 20వేల 576 ఎకరాలకు కాలేశ్వరం జలాలు విడుదల చేశారు.

కాలేశ్వరం పథకంలో మేడిగడ్ద, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీల నిర్మాణ వ్యయం 7,516.31 కోట్లు. ఇందులో మేడిగడ్డకు 3,625.82 కోట్లు, అన్నారానికి 2,228.43 కోట్లు, సుందిళ్ళకు 1,662.06 కోట్లు ఖర్చయింది. అయితే అక్టోబర్ 21న భారీ శబ్దంతో మేడిగడ్డ ఏడవ బ్లాక్ లోని 20వ నెంబర్ పిల్లర్ కృంగిపోవడంతో బ్రిడ్జి స్లాబు వంగిపోయింది. పక్కనే ఉన్న 19, 21 నెంబర్ పిల్లర్లు కూడా కుంగిపోయాయి. అయితే మరుసటి రోజే అధికారుల బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించింది. కుంగిన ప్రాంతాన్ని తామే పునరుద్ధరిస్తామని ఎల్ అండ్ టి బృందం ప్రకటించింది. అంతేకాదు ఈ డ్యాం కుంగుబాటుకు సంబంధించి జాతీయస్థాయి నిపుణుల బృందం కూడా పరిశీలించింది.. ప్రాజెక్టు నిర్మాణం సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్లానింగ్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోని లోపాలు దీనికి కారణమని ప్రకటించింది.

ఈ కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జాబ్ నేషనల్ బ్యాంక్ కన్సర్షియం, బ్యాంక్ ఆఫ్ బరోడా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, నాబార్డ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ల ద్వారా 87449.16 కోట్ల రుణం మంజూరయింది. ఇందులో 71,565.69 కోట్ల రుణం తీసుకుంది. ఇంకా 15,698.91 కోట్లు విడుదల కావలసి ఉన్నాయి. తీసుకున్న అప్పు కు సంబంధించి 4696.33 కోట్లను ప్రభుత్వం తిరిగి చెల్లించింది. ఈ ఐదు సంవత్సరాలలో తెచ్చిన అప్పులకు వడ్డీగా 16201.94 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి . ఇక ఈ మొత్తం కలిపితే 21,157 కోట్లను ప్రభుత్వం తిరిగి చెల్లించింది. కాలేశ్వరం కార్పొరేషన్ లో భాగమైన పాలమూరు రంగారెడ్డికి ఎత్తి పోతల పథకానికి పదివేల కోట్ల రుణం మంజూరవగా.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 7,721.51 కోట్ల రుణం ఇచ్చింది. ఇక మేడిగడ్డను సందర్శించిన మంత్రుల్లో ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఉన్నారు.. ఉదయం 11 20 నిమిషాలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు.. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీ ల నష్టం పై సమీక్ష నిర్వహించారు. సాయంత్రం ఈ బ్యారేజీలను సందర్శించే అవకాశం ఉంది.

అయితే కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో కౌంటర్ గా భారత రాష్ట్ర సమితి కూడా మరో పిపిటి సిద్ధం చేసింది. తుమ్మిడిశెట్టి వద్ద నీరు లభ్యం కాకపోవడం వల్లే మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించినట్టు భారత రాష్ట్ర సమితి వర్గాలు తెలిపాయి. జల వనరుల శాఖ పొందుపరిచిన నివేదికల ఆధారంగానే తాము ఈ బ్యారేజ్ నిర్మించామని భారత రాష్ట్ర సమితి వర్గాలు ప్రకటించాయి. అంతేకాదు కాలేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ చెప్పినవన్నీ అబద్ధాలు అని భారత రాష్ట్ర సమితి వర్గాలు ఎదురుదాడికి దిగాయి. అధికారం, విపక్ష పార్టీలు ఒకేసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరొకసారి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.