KCR: సీఎం కేసీఆర్ చండ్ర ప్రచండం అయ్యారు. కేంద్రంలోని బీజేపీపై నిప్పులు చెరిగారు. కేంద్ర బడ్జెట్ దారుణంగా ఉందంటూ విరుచుకుపడ్డారు. మోడీని, బీజేపీని కడిగిపారేశారు. ఈ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ ఈ మేరకు బీజేపీ ప్రభుత్వ విధానాలను తూర్పార పట్టారు. దేశాన్ని మార్చాల్సిన అవసరం ఉందని.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని అందుకోసం ఖచ్చితంగా ఒక కార్యకర్తగా పాటుపడుతానని సంచలన ప్రకటన చేశారు.

తాను ముంబై వెళుతున్నానని.. బీజేపీయేతర నేతలతో చర్చలు జరిపి కేంద్రంపై పోరాటం జరుపుతున్నానని కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. కలిసి వచ్చేవారందరి నేతలతో చర్చలు జరిపి కేంద్రంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కలిసి వచ్చేవారందరినీ కలుపుకుంటూ దేశంలో అద్భుతమైన గుణాత్మకమైన మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేసింది ఏమీ లేదని కేసీఆర్ ఆడిపోసుకున్నారు. మత పిచ్చి రేపుతూ.. ప్రజల మధ్య కొట్లాటలు పెడుతూ సమాజ వాతావరణాన్ని కలుషితం చేస్తూ దేశాన్ని విభజించాలని చూస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సమస్యలపై మోడీకి చెప్పినా.. గోడకు చెప్పినా ఒకటేనన్నారు. బీజేపీ తీరు దున్నపోతు మీద వాన కురవడంలా ఉందని.. బీజేపీ దేశానికి పట్టిన దరిద్రమని కేసీఆర్ విమర్శించారు. బీజేపీ యూపలో గెలవొచ్చని.. అయితే తతద్వారా బీజేపీలో అహంకారం పెరుగుతుందన్నారు. అహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు బుద్ది చెబుతారని కేసీఆర్ చెప్పారు.
కేసీఆర్ తీరు చూస్తే స్పష్టంగా బీజేపీపై నరనరాన వ్యతిరేకత వ్యక్తమైంది.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరుపులను కుక్కలతో పోల్చిన వైనం చర్చనీయాంశమైంది. బీజేపీ సోషల్ మీడియా దుమారాన్ని అణిచివేస్తానని.. దానిపై తీవ్రంగా సీరియస్ అయ్యారు. గులకరాళ్లు వేసి ఊపినట్టుగా ఆ చప్పుడు ఉందని మండిపడ్డారు.
జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు దిశగా కేసీఆర్ ఆలోచనలు ఉన్నాయి. తెలంగాణ సాధించినట్టే జాతీయ స్థాయిలో ప్రత్యామ్మాయం దిశగా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఓవరాల్ గా బీజేపీ విధానాలు, నిర్ణయాలను కేసీఆర్ చీల్చిచెండాడాడు. తెలంగాణను మార్చినట్టే దేశాన్ని మారుస్తానని.. ప్రజల సరళి మారాలని.. యువతలో మార్పు రావాలని.. కొత్త రాజ్యాంగం రావాలని జాతీయ మీడియాలో తీవ్ర చర్చ పెట్టారు. చూస్తుంటే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పెద్ద కసరత్తునే చేస్తున్నట్టు కనిపిస్తోంది.
ఇక త్వరలోనే హైదరాబాద్ లో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో కలిసి సమావేశం పెట్టి జాతీయ స్థాయి మార్పునకు శ్రీకారం చుడుతానని సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్ తీరు చూస్తుంటే వచ్చే 2024 జాతీయ ఎన్నికల్లో ఒక కూటమి దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
#Live: ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి మీడియా సమావేశం https://t.co/EtMcUlRpPO
— BRS Party (@BRSparty) February 1, 2022