Union Budjet 2022: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అన్ని వర్గాలు, మేధావులు, రాజకీయ నేతల నుంచి విమర్శల వాన కురుస్తోంది. వార్షిక బడ్జెట్ లో కేటాయింపులు చూసి అందరూ నిరాశ చెందుతున్నారు. ఇక కొన్ని రాష్ట్రాలకైతే చిప్ప చేతికి ఇచ్చినట్టుగా ఉందని ఆరోపిస్తున్నారు. ఇక అప్పుల్లో ఉన్న ఏపీకి ఏమీ ఇవ్వలేదన్న ఆవేదన ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది.

ఏపీకి నెరవేర్చాల్సిన సమస్యలను కూడా కేంద్రం బడ్జెట్ లో పక్కనపెట్టి షాకిచ్చింది. ప్రత్యేక హోదాను పట్టించుకున్న పాపాన పోలేదు. 2012లో విభజన సమయంలో ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించింది. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ కేంద్రంలోని పెద్దలను కలిసి ఎన్నిసార్లు హోదాపై ప్రశ్నించినా.. అది ముగిసిన అధ్యాయమని కేంద్రం చెబుతోంది.
ఇక ప్యాకేజీ ప్రకారం చూసుకున్నా పోలవరం, రాజధాని నిధులు.. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు ఇవ్వాల్సి ఉంది. చంద్రబాబు హయాంలో మిత్రలాభంతో కొన్ని నిధులు తీసుకొచ్చారు. అయితే వైసీపీ ప్రత్యేకహోదా తెస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. దానిని ఇప్పటివరకూ సాధించలేకపోయారు. ఇప్పుడు వైసీపీ పెద్దలు అసలు ప్యాకేజీ, హోదాను పక్కనపెట్టారు.
హోదా రాక.. ప్యాకేజీ కూడా లేక ఆర్థికంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటివరకూ ఎలాంటి పెట్టుబడులు ఆశించిన విధంగా రాలేదు. అంతేకాదు.. అప్పులు చేసుకొని దినదిన గండంగా పాలనను ముందుకు తీసుకెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
తాజాగా బడ్జెట్ పై వైసీపీప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు పెరిగిన అంచనాల మేరకు నిధులు కేటాయిస్తారా? అని ఎదురుచూసింది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు కూడా నిధులు ఇస్తారని ఆశించాను. తాజాగా బడ్జెట్ లో మాత్రం ఒక్క రూపాయి కూడా ఆయా అంశాలకు కేటాయించలేదు. రాష్ట్రానికి ప్రత్యేకంగా బడ్జెట్ లో కేటాయింపులు చేయలేదు. బడ్జెట్ అంటే అన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు జరిపేవారు.. ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం మోడీ కేంద్రంగా కేటాయింపులు జరిపారు. రాష్ట్రాలను అసలు పట్టించుకోలేదు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలకే కేటాయింపులు చేశారు. రాష్ట్రాలను పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఏపీకి తీరని అన్యాయమే జరిగిందని అంటున్నారు. ఏపీనే కాదు.. ఏ రాష్ట్రానికి ఈ బడ్జెట్ ఏమాత్రం ప్రయోజనకరంగా లేదని అంటున్నారు.