CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందా? జనాల నాడిని తప్పుగా అర్థం చేసుకున్నారా? ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడుతుందని బలంగా నమ్మిన కేసీఆర్ ఫలితం తేడా కొట్టడంతో తప్పులు సరిదిద్దుకుంటున్నారా? అందుకే అపరిష్కృతంగా ఉన్న ప్రధాన సమస్యలను తీర్చే పనిలో పడ్డారా? మైనస్ లన్నీ కూడా కరెక్ట్ చేసుకోవడానికి కారణం అదేనా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

దేశ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరొందిన కేసీఆర్ కూడా ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకపోవడం నిజంగా అందరినీ షాక్ కు గురిచేసే అంశమే. యూపీలో బీజేపీ ఓడిపోతుందని.. ఐదు రాష్ట్రాల్లో ఖచ్చితంగా దెబ్బపడుతుందని కేసీఆర్ భావించినా ఆయనకే స్ట్రోక్ తగిలిన పరిస్థితి. బీజేపీ ఓడిపోతే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి వచ్చేసారి ప్రధాని రేసులోకి దూసుకుపోదామని కేసీఆర్ ఎన్నో కలలు గన్నారు. కానీ అవన్నీ అడియాసలయ్యాయి.
Also Read: Hijob: హిజాబ్ వివాదం.. ఎవరిది రైట్? ఎవరిది రాంగ్?
ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. అందుకే కేసీఆర్ టర్న్ అయ్యారు. ఎన్నికల మూడ్ లోకి వెళ్లారు. ఇంతకాలం పట్టించుకోని సమస్యలను అసెంబ్లీ వేదికగా పరిష్కరిస్తున్నట్టు ప్రకటించేశారు. బడ్జెట్ పై అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్ బీజేపీనే టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని వారి ఆగ్రహ జ్వాలలకు బలికాకూడదని డిసైడ్ అయ్యారు. రెండేళ్ల క్రితం వీరిని ఉద్యోగాల్లోంచి కేసీఆర్ సార్ తీసేశారు. ఇప్పుడు అనూహ్యంగా మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ నిర్ణయంతో 7651మంది ఫీల్డ్ అసిస్టెంట్లు కేసీఆర్ నిర్ణయంతో మళ్లీ ఉద్యోగాల్లోకి రానున్నారు. వీరికి జీతాలు కూడా పెంచుతామనడంతో వారి అసంతృప్తి, అసమ్మతి తగ్గేందుకు వీలుకలిగింది. రెండేళ్లుగా పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు మళ్లీ అపాయింట్ చేయడం వెనుక కారణం జనాల్లో ప్రభుత్వంపై అసంతృప్తిని తగ్గించడానికేనని అర్థం చేసుకోవచ్చు. తరుముకొస్తున్న బీజేపీ ముప్పును కాచుకోవడానికే కేసీఆర్ ఈ నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు.

ఇక అవినీతి గద్దలు అని వీఆర్వోలు, వీఆర్ఏలను అసెంబ్లీ సాక్షిగా దునుమాడిన కేసీఆర్.. ఆ వ్యవస్థనే రద్దు చేసి పారేశారు. వారికి ఎలాంటి పని చెప్పకుండా ఇతర శాఖల్లోకి వాడుకున్నారు. తాజాగా వారి అసంతృప్తిని కూడా కేసీఆర్ చల్లార్చారు. వీఆర్ఏలను ఇరిగేషన్ శాఖలో కలుపనున్నట్లు ప్రకటించారు. వీఆర్ఏలను లష్కర్ పోస్టులకు తీసుకుంటామని.. వారికి పే స్కేల్ అమలు చేస్తామని తెలిపారు. వీఆర్ఏలలో చాలా మంది ఉన్నత చదువులు చదివిన వారున్నారని.. వారందరికీ ప్రమోషన్లు ఇస్తామని కేసీఆర్ సడెన్ గా వరాలు ప్రకటించారు. ఇక అంతేకాదు.. అనాదిగా వివక్షకు గురైన సెర్ప్, ఐకేసీ, మెప్మా ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని కూల్ చేశారు.
ఇక చాలాకాలంగా హామీగానే ఉండిపోతున్న జీవో 111 ను త్వరలోనే ఎత్తివేస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించడం ఊహించని పరిణామం. ఎందుకంటే సుమారు 1,32,600 ఎకరాల భూమి జీవో పరిధిలో ఉందని కేసీఆర్ ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేశారు.ఈ జీవోతో అక్కడ రియల్ ఎస్టేట్ జరగడం లేదు. 10శాతం మాత్రమే భూమి నిర్మాణాలకు అనుమతి ఉంది. ఇప్పుడు 111 జీవో రద్దుతో హైదరాబాద్ చుట్టుపక్కల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్ భూమ్ వర్ధిల్లనుంది.
ఇక ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలంగాణ వైద్య విద్యార్థుల ఖర్చును కూడా ప్రభుత్వమే పెట్టుకుట్టుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీన్ని బట్టి కేసీఆర్ అసంతృప్తి వర్గాలందరినీ సంతృప్తి పరిచి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ కు బీజేపీ గెలుపుతో జ్ఞానోదయం అయ్యిందని.. ఆ పార్టీని ఓడించాలంటే ముందుగా తనపై వ్యతిరేకతను తగ్గించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టుగా విపక్ష నేతలు అభివర్ణిస్తున్నారు. ఎప్పుడూ లేనిది ఇన్ని హామీలు ప్రకటించడం వెనుక అసలు మతలబు ఇదేనంటున్నారు.
Also Read: AP Cabinet Reshuffle: కొత్త వారికే జగన్ మంత్రివర్గంలో చాన్స్ దక్కనుందా?