CM KCR: “ఇంటికో ఉద్యోగం ఇస్తామని మేము ఎన్నడూ చెప్పలే.. ఉద్యోగాల భర్తీ అనేది ఖాళీలను బట్టి జరుగుతుంది. అంతే తప్పా.. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలంటే చాలా కష్టం.. చదువుకున్న వాళ్లందరికీ సర్కారు కొలువు ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుంది..? ప్రతీ ఒక్కరు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు వెతుక్కోవాలి.. సర్కారు స్కీములను సద్వినియోగం చేసుకోవాలి అంతే తప్పా ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న మాట తప్పు.. నేను ఆ మాట ఎప్పుడూ చెప్పలే.. కావాలంటే రికార్డులు చూసుకోండి’’
… గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్

‘‘ దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని మేము ఎన్నడూ చెప్పలే అధ్యక్షా.. దళితులకు అంత భూమి ఇచ్చేందుకు సర్కారు దగ్గర ఉంటే కదా.. రూరల్ ప్రాంతంలో జనాభా ఎక్కువ. అర్బన్ ప్రాంతంలో భూములు తక్కువ ఈ క్రమంలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుంది. అసలు ఈ హామీని మేము మేనిఫెస్టోలోనూ పెట్టలే. కావాలంటే మీరు చూసుకోండి’’
‘‘కరీంనగర్ జిల్లాను డల్లాస్.. హైదరాబాద్ ను లండన్ చేస్తానని నేను ఎన్నడూ అనలే అధ్యక్షా.. మన ప్రాంతాలను ఆ మాదిరిగా చేసుకోవాలని చెప్పిన. అంతే మన కరీంనగర్ డల్లాస్.. హైదరాబాద్ లండన్ ఎలా అవుతాయి.. సాధ్యం ఎలా అవుతుంది. ఈ ముచ్చట అసలు నేను అననే అండ్లే.. ఇప్పుడు మాత్రం పాతబస్తీని ఇస్తాంబుల్ చేసి చూపిస్తా‘‘
… ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్
వారం రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు.. మంత్రులు.. ప్రతిపక్ష నాయకులు సభకు హాజరు అవుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లోకి రావడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సభను టీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుండి నడిపిస్తున్నారు. అయితే రెండు మూడు రోజులుగా సభలో కేసీఆర్ మాట్లాడుతున్న మాటలు వివాదాస్పదంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏఏ హామీలైతే ఇచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారో.. అవి ప్రస్తుతం తమ పార్టీ ఇవ్వలేదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయం గురించి అసెంబ్లీ సాక్షిగా రెండుమూడుసార్లు ప్రకటన చేసిన ముఖ్యమంత్రి ప్రస్తుతం అలాంటిదేమీ లేదని దాటవేస్తున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నీళ్లు.. నిధులు.. నియామకాలు నినాదంతో.. నియామకాల గురించి గత రెండేళ్లుగా తీవ్రమైన ఆరోపణలు తెలంగాణ సర్కారు ఎదుర్కొంటోంది. నోటిఫికేషన్లు లేవని, ఉద్యోగాల జాడలేదని నిరుద్యోగ యువత సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నిత్యం ఆందోళనకు దిగుతున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా నిప్పుపై నీళ్లు చల్లిన విధంగా మూడు మాసాలకోసారి త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ అంటూ ప్రకటనలు చేస్తోంది. కొన్నేళ్లగా ఇదే తంతు సాగుతుండగా.. గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పలేదని.. ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని.. తాము నోటిఫికేషన్ల విషయంలో వెనక్కి వెళ్లడం లేదని ప్రకటించేశారు. దీంతో యువత ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. మరోసారి కేటీఆర్ సైతం ఇదే ప్రకటన చేశారు. యువత ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఇతర మంత్రలు సైతం పలుమార్లు ప్రకటలు చేయడంతో తెలంగాణలో నోటిఫికేషన్ల పై ఆశలు వదులుకున్నట్లయ్యింది.
దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీఆర్ఎస్ సర్కారు ఆ దిశగా కార్యాచరణ సైతం ప్రారంభించింది. పలు జిల్లాల్లో భూమిని సైతం అందించింది. ఈ క్రమంలో ఇటీవల దళిత బంధు ప్రవేశపెట్టారు. దీంతో రెండు పథకాలు ఎలా సాధ్యం అవుతాయని ఆలోచించారో ఏమో కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఏకంగా తాను మూడు ఎకరాల ముచ్చట చెప్పనే లేదని ప్రకటించేశారు. కావాలంటే రికార్టులు కూడా చూసుకోవాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అదే విధంగా కాంగ్రెస్ నాయకులు అడిగిన ప్రశ్నకు కరీంనగర్ ను డల్లాస్ చేస్తానని ఎన్నడూ చెప్పలేదని.. అలా తయారు చేస్తానని అన్నారు. కరీంనగర్, హైదరాబాద్ డల్లాస్, లండన్ లు అవడం సాధ్యమేనా అని ఎదురు ప్రశ్న వేసిన ముఖ్యమంత్రి పాతబస్తీని మాత్రం ఇస్తాంబుల్ చేస్తామని ప్రకటించేశారు. ఈ వీడియోలు , పాత వీడియోలను కలిపి ప్రతిపక్ష నాయకులు, యువత సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుండడం విశేషం.