CM Jagan: ఏపీలో ఒక పద్ధతి ప్రకారం ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోందా? సంక్షేమం మాటున ప్రజలను విడగొడుతున్నారా? దానికి సీఎం జగన్ ‘క్లాస్’ యుద్ధం అని పేరు పెట్టారా? దానికి విస్తృత ప్రచారం కల్పించి రాజకీయ లబ్ధి పొందనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులు సైతం అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన తరువాత జగన్ నవరత్నాలకు ప్రాధాన్యిమిచ్చారు. సంక్షేమ తారక మంత్రాన్ని పఠిస్తూ వస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా.. పరిమితికి మించి మరీ అప్పులుచేసి ప్రజలకు నగదు పంచుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సంక్షమమే తనను గెలిపిస్తుందని బలమైన నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో ‘క్లాస్’ యుద్ధమంటూ ఒక విభజన రణాన్ని మోగించారు. ఇప్పుడు అధికార పార్టీ దానిని ఒక నినాదంతో ముందుకు తీసుకెళ్లనుంది.

ప్రస్తుతం ఏపీలో ఉద్యోగుల జీతాల్లో ఎడతెగని జాప్యం జరుగుతోంది. అప్పు పుడితే కానీ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమకాని పరిస్థితి. మూడో వారం సమీపించినా జీతాలు పడని పరిస్థితి ప్రతినెలా దాపురిస్తోంది. అయితే దీనికి సంక్షేమమే కారణమన్న ఆరోపణ ఉంది. వచ్చిన ఆదాయంతో పాటు అప్పులు చేసి మరీ జగన్ సర్కారు సంక్షేమ పథకాలకు కేటాయిస్తోంది. ఒకటో తేదీన ఉద్యోగికి జీతం కంటే సామాజిక పింఛన్లు అందించేందుకే ప్రాధాన్యిమిస్తోంది. అటు తాను ఇవ్వదలచుకున్న పథకాలు, పంచుడుకు జగన్ వెనక్కి తగ్గడం లేదు. తనకు జీతాలు తీసుకునే ఉద్యోగులు, ఉపాధ్యాయులు కంటే.. నిర్మాణ పనులు చేపట్టే కాంట్రాక్టర్లు కంటే పథకాలు తీసుకునే లబ్ధిదారులే ఎక్కువ అంటూ సీఎం జగన్ ఒక స్లోగన్ ను ఏపీలో విస్తృతం చేస్తున్నారు. అదే సమయంలో తాను తప్ప ఈ స్థాయిలో పంచడం ఎవరి వల్ల సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు. నేను అధికారానికి దూరమైన మరుక్షణం మీ పథకాలు నిలిచిపోతాయంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారు.
సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావులాంటి వారితో సీఎం జగన్ ఈ నినాదాన్ని పదునుపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానిని ఏపీ వ్యాప్తం చేయాలని కసరత్తు ప్రారంభించారు. ఐ ప్యాక్ టీమ్ సైతం ప్రజల్లోకి ఈ నినాదం బలంగా పంపించేందుకు ప్రణాళిక రూపొందించింది. అదే సమయంలో క్లాస్ పీపుల్ గా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులకు కాదని మీ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నానని.. వారంతా తమకు వ్యతిరేకమని సంకేతాలు ఇచ్చేలా స్లోగన్ ప్రజల్లోకి బలంగా వెళ్లాలని చూస్తున్నారు.

అయితే ఇప్పటికే జగన్ సర్కారు చర్యల పుణ్యమా అని ఉద్యోగ, ఉపాధ్యాయులు దూరమయ్యారు. ఎన్నికలకు చివరి ఏడాది కావడంతో ఎన్ని ఉపశమన చర్యలు చేపట్టినా వారు నమ్మే స్థితిలో లేరు. దాదాపు జగన్ సర్కారుకు వారు శత్రువులుగా మారిపోయారు. అందుకే అదే శత్రుత్వాన్ని సంక్షేమ పథకాల లబ్ధిదారులకు లింకు పెట్టే ప్రయత్నం చేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఒకవైపు.. జీతాలు తీసుకునే వర్గం ఒక వైపు అన్నట్టు విభజన గీత గీశారు. వారి ప్రయోజనాలకు పెద్దపీట వేస్తే మీ సంక్షేమ పథకాలు, ఒకటో తారీఖున సామాజిక పింఛను నిలిచిపోతుందని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. దానికి క్లాస్ యుద్ధంగా నామకరణం చేశారు. ఏపీ వ్యాపితం చేయాలని భావిస్తున్నారు.