
Jagan vs Ramoji : అడవిలో రాళ్లు రాళ్లు రాసుకుంటే నిప్పు పుడుతుంది… అది అడవిని మొత్తం దహించి వేస్తుంది.. అదే ఇద్దరు బలవంతమైన మనుషులు కొట్లాడుకుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చేతులు, కాళ్లు చేతులు విరుగుతాయి. అవసరం అయితే ప్రాణాలు కూడా పోతాయి.. దీన్నే కొలాట్రాల్ డ్యామేజీ అంటారు. అలాగని బలవంతమైన మనుషులకు ఏమీ కాదు.. కానీ ఇప్పుడు ఈ సూత్రాన్ని పునర్ నిర్వచించే పనిలో ఉన్నాడు జగన్.. అఫ్కోర్స్ తన తండ్రి వల్ల కానిది తాను చేయించి చూపిస్తున్నాడు.. అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి హయాంలో రెండు పత్రికలు అని శాసనసభలో మాట్లాడటం, ఉండవల్లి అరుణ్ కుమార్ తో మార్గదర్శి విషయంలో చికాకు పెట్టడం తప్ప రామోజీరావును నాటి వైఎస్ఆర్ చేసింది ఏమీ లేదు.. కానీ జగన్ అలా కాదు.. నెమ్మదిగా నరుక్కుంటూ వస్తున్నాడు. ఒక్కొక్క కుంభస్థలాన్ని కొట్టుకుంటూ వస్తున్నాడు. ఇవాళ జీవో 12కు సంబంధించి రామోజీరావు వేసిన కేసును హైకోర్టు కొట్టి వేయడంతో ఇక జగన్ టార్గెట్ ఏమిటో స్పష్టంగానే అర్థమవుతున్నది.
జగన్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో జగన్, రామోజీరావు కలిశారు. మాట్లాడుకున్నారు.. కాల్పుల ఒప్పందం కుదిరింది. మార్గదర్శి శైలజ, జగన్ సతీమణి భారతి రెడ్డి వాయినాలు కూడా ఇచ్చుకున్నారన్న ప్రచారం సాగింది.. ఏం జరిగిందో, ఇక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ… మళ్లీ కాల్పులు ప్రారంభమయ్యాయి. కానీ సాక్షి నుంచి అంతగా ఎఫర్ట్ ఎందుకో కనిపించలేదు.. జగన్ వెనక్కి తగ్గాడు అందరూ అనుకున్నారు.. కానీ ఒక్కసారిగా రామోజీరావును చుట్టుముట్టేశాడని పరిస్థితులను బట్టి అందరికీ అర్థమైంది.
ఏపీలో అధికారం ఉండడంతో రామోజీ ఆర్థికవనరులపై సీఎంగా జగన్ దెబ్బకొట్టాడనికి అక్కడి నుంచే నరుక్కుంటూ వచ్చాడని అంటున్నారు. ప్రభుత్వపరంగా వ్యవసాయ శాఖకు సంబంధించి అన్నదాతకు చెల్లించే చందాను దాదాపు కట్ చేశాడనీ సమాచారం.. అసలు బాబు ప్రభుత్వంలో చందా తీసుకొని అన్నదాత సంచికలను ఈనాడు అసలు పంపకపోయేదిన్న విమర్శలు ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు.. కానీ అలా సైలెంట్ అవ్వడానికి ఇప్పుడు బాబు ప్రభుత్వం కాదు కాబట్టి జగన్ అడ్డగోలుగా ఆ చందా విధానాన్ని పూర్తిగా కట్ చేశాడని ఒక టాక్ అధికార వర్గాల్లో సాగుతోంది. ఇటు కేసీఆర్ కూడా అదే విధానాన్ని అనుసరించడంతో రామోజీరావుకు ఊపిరి సలపకుండా అయిందని అంటున్నారు.. వెంటనే నష్టాల బాటపట్టిన తన అన్నదాత సంచికను మూసేశాడని అంటున్నారు.
ఇక మార్గదర్శి కేసులోనూ సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యారు.. అంతేకాదు ప్రజల నుంచి వసూలు చేస్తున్న డబ్బులకు సంబంధించి అధికారులతో తనిఖీలు చేయించాడు. అంతేకాదు ప్రజలు ఎవరు కూడా మార్గదర్శిలో చిట్టీలు వేయకూడదని ఇన్ డైరెక్ట్ గా హెచ్చరికలు జారీ చేశాడని ఓ ప్రచారం జరుగుతోంది.. దీంతో మార్గదర్శి కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిందని అంటున్నారు.. ఇక రామోజీరావుకు ఆయువుపట్టైన ఈనాడు మీద జగన్ ఒత్తిడి పెంచడం మొదలుపెట్టాడట.
వాస్తవంగా సర్కిలేషన్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది కాబట్టి ప్రభుత్వ యాడ్స్ ఈనాడుకు ఇవ్వాల్సి వస్తోంది. లేకుంటే దాని పరిస్థితి కూడా ఆంధ్రజ్యోతినే.. ఇప్పుడు దాని నెంబర్ వన్ స్థానానికి గురిపెట్టాడట జగన్. జీవో 12 రూపంలో రామోజీరావుకు ఎరవేశాడనీ.. కోర్టు మెట్లు ఎక్కేలా చేశాడని అంటున్నారు. కేసు ఓడిపోయేలా కూడా చేశాడు.. సో జగన్ టార్గెట్ దాదాపు పూర్తయినట్టే.. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి.. చూడాలి ఏం జరుగుతుందో.
-అసలేంటి జీవోనంబర్ 12.. ఏముంది?
జీవో నంబర్ 12 ప్రకారం.. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వాలంటీర్లు, గ్రామ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు నెలకు రూ.300 చొప్పున కేటాయిస్తుంది. ఈ నిధులతో న్యూస్ పేపర్ కొనాలి. గ్రామ సచివాలయాల్లో వేయాలి. సచివాలయంకు వచ్చే గ్రామస్థులు చదువుకుంటారు. అయితే ఇది సాక్షి పేపర్ సర్క్యూలేషన్ పెంచే ఎత్తుగడగా జగన్ వేశారని చెబుతున్నారు. వలంటీర్లు, అధికారులు వైసీపీ బ్యాచ్ కాబట్టి సాక్షిని కొంటున్నారు. అలా సాక్షిని రాష్ట్రంలోని గ్రామ పంచాయితీ కొనేలా జగన్ చేస్తున్నారు. ఈనాడు రామోజీరావు ఈ జీవో మీద హైకోర్టుకు వెళ్లగా కొట్టివేసింది. ప్రభుత్వం పేపర్ కొనమని చెప్పింది కానీ.. అది సాక్షినా? ఈనాడునా.? అని చెప్పలేదని జగన్ ప్రభుత్వం వాదించింది. దీంతో ఈనాడుకు చెక్ పడింది. ప్రభుత్వం జగన్ ది కావడంతో వాళ్లు సాక్షినే వేస్తారు. ఈనాడు సర్క్యూలేషన్ పడిపోతుంది. సాక్షి నంబర్ 1కు వస్తుంది. ప్రభుత్వం నంబర్ 1లో ఉన్న ఈనాడుకు ప్రకటనలు ఇవ్వదు. అలా ఆర్థికంగా ఈనాడును జగన్ దెబ్బకొట్టే ప్లాన్ అమలు చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే ‘అన్నదాత’ను మూసివేయించిన జగన్ ఇప్పుడు ఈనాడు దినపత్రికను టార్గెట్ చేశాడని అంటున్నారు. మరి దాని పరిస్థితి ఏంటన్నది వేచిచూడాలి.